ఇంట్లో అలంకరణ కు పుర్రెలు .. అస్తి పంజరాలు !!

Sharing is Caring...

Strange habits………………………...

అమెరికాలోని కెంటకీ రాష్ట్రానికి చెందిన ఓ  ప్రబుద్ధుడు  40 మనుషులకు చెందిన పుర్రెలు, ఇతర అవశేషాలతో ఇంటిని అలంకరించుకున్నాడు. ఈ విషయం ఎలా తెలిసిందో ఏమో మొత్తం మీద ఫెడరల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్‌వెస్టిగేషన్‌ (ఎఫ్‌బీఐ) మౌంట్‌ వాషింగ్టన్‌లో నివసించే జేమ్స్‌ నాట్‌ ఇంట్లో  సోదాలు చేసింది.

కొన్నాళ్ల క్రితం హార్వర్డ్‌ మెడికల్‌ స్కూల్‌ శవాగారంలో కొన్ని మానవ శరీర అవయవాలు మాయమయ్యాయి. ఈ నేపథ్యంలో ఎఫ్‌బీఐ అధికారులు విచారణ చేపట్టారు. సోదాలు చేసే ముందు ఇంట్లో ఇంకెవరైనా ఉన్నారా అని ఎఫ్‌బీఐ అధికారులు జేమ్స్‌ను ప్రశ్నించగా.. ‘కేవలం చనిపోయిన నా స్నేహితులు మాత్రమే’ అంటూ సమాధానం ఇచ్చాడట. దీంతో అధికారులకు మరిన్ని సందేహాలు కలిగాయి .

ఇల్లంతా తనిఖీ చేయగా 40 మంది మనుషుల పుర్రెలు, వెన్నెముకలు, తొడ, తుంటి ఎముకలు అలంకరించి కనిపించాయి. ఇవన్నీ చూసి అధికారులు విస్తుపోయారు. అక్కడ హార్వర్డ్‌ మెడికల్ స్కూల్ బ్యాగ్‌ కూడా లభించినట్లు కోర్టు రికార్డులో నమోదు చేశారు. మానవ శరీర భాగాలను విక్రయించడంలో జేమ్స్‌ పాత్ర ఉందని పోలీసులు అంటున్నారు.

అతడి ఇంట్లోని మంచం, కుర్చీలు తదితర వస్తువులను ఎముకలతో అలంకరించాడని  వివరించారు. ఎముకలు కొనడం, అమ్మడంలో జేమ్స్‌ కీలకంగా వ్యవహరించినట్లు  దర్యాప్తులో తేలిందట.  
నిందితుడు జేమ్స్ నాట్‌పై కేవలం మానవ శరీర భాగాల రవాణా కేసు మాత్రమే కాదు.. నిషేధిత ఆయుధాలు కలిగి ఉన్నాడనే కేసు కూడా నమోదైంది. అతడికి పెన్సిల్వేనియాకు చెందిన జెర్మీ పౌలీతో సంబంధాలున్నాయి.

జెర్మీ మానవ అక్రమ రవాణాలో పాలు పంచుకున్న పలువురితో కీలక లావాదేవీలు జరిపేవాడు. ఎప్పుడు, ఎక్కడ శరీర భాగాలు విక్రయించాలనే విషయంపై జేమ్స్‌, జెర్మీ మధ్య ఫేస్‌బుక్‌లో సంభాషణలు జరిగినట్లు పోలీసులు గుర్తించారు. ఈ విచారణలో హార్వర్డ్ మెడికల్ స్కూల్‌లో సుదీర్ఘకాలంగా పని చేస్తున్న ఉద్యోగి సెడ్రిక్‌ లాడ్జ్‌ పేరు కూడా బయటకు వచ్చింది. అతడిపై కూడా శరీర భాగాల దొంగతనం, విక్రయం, రవాణా చేసిన కేసులు నమోదయ్యాయి. అదండీ  జేమ్స్‌ నాట్‌ కథ. 
 

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!