పాపం పుష్కర్ సింగ్ ! సెంటిమెంట్ నిజమైంది!!

Sharing is Caring...

Losing trend…………………………….

ఉత్తరాఖండ్‌లో సిట్టింగ్ సీఎంలు గెలవరనే మాట మరోమారు నిజమైంది. కొద్దీ రోజుల క్రితం జరిగిన ఎన్నికల్లో అధికార పార్టీ బీజేపీ 47 సీట్లు గెలుచుకుని తిరిగి అధికారాన్ని సాధించిన మొదటి పార్టీ గా చరిత్ర సృష్టించింది. 

అయితే ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ఖటిమా నుంచి పోటీ చేసి ఓడిపోయారు. కాంగ్రెస్ అభ్యర్థి భువన్ చంద్ర కప్రీ చేతిలో 6,500 ఓట్ల తేడాతో ఓడి పోయారు. ఉత్తరాఖండ్ లో  సిట్టింగ్ సీఎం లు వారి టర్మ్ దరిమిలా జరిగిన ఎన్నికల్లో గెలవలేదు. 2002 లో జరిగిన ఎన్నికల్లో నిత్యానంద్‌ స్వామి, 2012లో బి.సి.ఖండూరి, 2017లో హరీశ్‌ రావత్‌లకు పరాజయాలు ఎదురయ్యాయి. 2007లో అప్పటి సిట్టింగ్‌ సీఎం ఎన్‌.డి.తివారీ ఎన్నికల్లో పోటీ చేయలేదు.

మొన్నటి ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించి సీఎంల పరాజయాల పరంపరకు తెర దించాలని  పుష్కర్‌సింగ్‌ ధామి గట్టిగా ప్రయత్నించారు.  2012, 2017 ఎన్నికల్లో తనకు విజయాన్నందించిన ఖటిమా స్థానం నుంచే ధామి బరిలోకి దిగారు.అయినా ప్రయోజనం లేకపోయింది. పార్టీ అధికారంలోకి వచ్చింది కానీ తాను నెగ్గలేకపోయాడు. ఇపుడు ఈయనను సీఎం పదవికి ఎంపిక చేస్తారా ?లేదా అనేది సస్పెన్స్. 

2000 సంవత్సరంలో ఉత్తరప్రదేశ్ నుండి విడివడి ఉత్తరాఖండ్ ఏర్పాటైంది. ఇప్పటివరకు నాలుగు మార్లు అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. కొత్త రాష్ట్రం ఏర్పడినప్పుడు ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలో ఉత్తరాఖండ్ నుండి అత్యధిక సంఖ్యలో ఎమ్మెల్యేలు ఉన్నారు. అప్పట్లో బిజెపి అధికార పగ్గాలు చేపట్టింది. 2000 నుండి 2002 వరకు మధ్యంతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.

నిత్యానంద స్వామి 2001 నుండి 2002 వరకు ముఖ్యమంత్రిగా పనిచేశారు.తరువాత భగత్ సింగ్ కొష్యారి అధికారంలోకి వచ్చారు.2002లో ఉత్తరాఖండ్ లో మొదటిసారిగా ఎన్నికలు జరిగాయి.భగత్ సింగ్ కొష్యారి తన సీటును నిలబెట్టుకున్నారు. ఇప్పటివరకు ఎన్నికల్లో గెలిచిన ఏకైక ముఖ్యమంత్రి కొష్యారి ఒక్కరే. ఆనాటి ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయింది.

అప్పట్లో కాంగ్రెస్ కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. నారాయణ్ దత్ తివారీ సీఎం అయ్యారు. ఐదేళ్లపాటు ముఖ్యమంత్రిగా అధికార బాధ్యతలు నిర్వహించారు. ఆయన తదుపరి ఎన్నికలలో అంటే 2007లో పోటీ చేయలేదు. నాడు జరిగిన ఎన్నికల్లో బీజేపీ అసెంబ్లీలో అతి పెద్ద పార్టీగా అవతరించింది, బిజెపి అప్పటి లోక్‌సభ ఎంపి బిసి ఖండూరిని ముఖ్యమంత్రిని చేసింది.

2009లో ఖండూరి స్థానంలో క్యాబినెట్ మంత్రి రమేష్ పోఖ్రియాల్ సీఎం అయ్యారు. అవినీతి ఆరోపణలతో సెప్టెంబరు 2011లో పోఖ్రియాల్ రాజీనామా చేశాడు. మళ్ళీ ఖండూరీ సీఎం అయ్యాడు. 2012 ఎన్నికలలో బీజేపీ ఓడిపోయింది.నాటి సీఎం ఖండూరి తన సొంత కోట్‌ద్వార్ అసెంబ్లీ స్థానంలో ఓడిపోయారు.

నాటి ఎన్నికల్లో మెజారిటీకి నాలుగు సీట్లు తగ్గి కాంగ్రెస్ అతిపెద్ద పార్టీగా అవతరించింది. స్వతంత్ర ఎమ్మెల్యేల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. విజయ్ బహుగుణ ముఖ్యమంత్రి గా పదవీ బాధ్యతలు చేపట్టారు. జూన్ 2013 లో ఉత్తరాఖండ్ ను వరదలు ముంచెత్తిన నేపథ్యంలో రెస్క్యూ కార్యకలాపాలను నిర్వహించ లేదనే విమర్శలు ఎదుర్కొని బహుగుణ పదవి నుంచి దిగి పోయారు.

తర్వాత హరీష్ రావత్ పగ్గాలు చేపట్టారు. 2017 ఎన్నికల్లో సిట్టింగ్ ముఖ్యమంత్రిగా ఉన్న హరీష్ రావత్‌ రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోయాడు. నాటి ఎన్నికల్లో బీజీపీ ఘన విజయం సాధించింది. త్రివేంద్ర సింగ్ రావత్‌ ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టారు. పెరిగిన అసమ్మతి కారణంగా ఆయన పదవి నుంచి దిగిపోయాడు. ఆయన వారసుడిగా పుష్కర్‌ సింగ్‌ ధామి పగ్గాలు అందుకున్నారు.

 

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!