రామా… కనవేమిరా ?

Sharing is Caring...

Subbu Rv……………………………………………..

కళను, కళామతల్లిని కొన ఊపిరితోనైనా బ్రతికిస్తున్నారని సంతోషపడాలో లేక కళ వీధి వీధి తిరుగుతూ భిక్షాటన చేస్తుందని బాధపడాలో తెలియడం లేదు. పురాణగాధలను, మహనీయుల చరిత్రను, దేశభక్తి, దైవభక్తి కథలను తమ గాత్రాల ద్వారా  సమాజానికి చేరవేసిన ఆ గొంతులు, వాయిద్యాలు ప్రస్తుతం  భుక్తి కోసం నానాపాట్లు పడుతూ..  బ్రతికేందుకు అగచాట్లు పడుతున్నాయి.

స్వాతంత్య్రం వచ్చి డెబ్భై ఏళ్ళు దాటినా ఇంకా పట్టెడు మెతుకులకోసం వెంపర్లాట తప్పని సమాజం మనది. ప్రాథమిక హక్కులుగా పొందాల్సిన కనీస అవసరాలు కూడా అందనంత దూరంలో ఉన్నాయి. బడికెళ్ళాల్సిన పిల్లవాడు మొహానికి రంగు పూసుకుని పగటి వేషగాడిగా మారాడు. చదువుకుంటావా అంటే చదువుకున్నా ఇదే చెయ్యాలి అంటూ తన చిన్న జీవితంలో జరిగిన సంఘటనలు పంచుకున్నాడు లక్ష్మణ వేషధారి శివకుమార్. 

శివకుమార్ బుడగజంగాలకు చెందిన అబ్బాయి. ఉదయాన్నే మొహానికి రంగేసుకుని పగటి వేషగాళ్ళు అంటారు కదా అలా వేషధారణ చేసుకుని ,భుజానికి ఒక జోలె తగిలించి వీధి వీధి కలియదిరుగుతూ ప్రతి గుమ్మాన్ని పలకరిస్తూ యాచిస్తున్నాడు. చిన్న వయసులోనే బడిలో ఉండాల్సిన సమయంలో ఈ వేషం ఎందుకు వేశాడా అనిపించి మాట కలిపాను.

సాధారణంగానే పగటి వేషగాళ్ళు, ఊరూరు తిరుగుతూ వేషాలు వేస్తూ, భిక్షాటన చేస్తూ, గుడారాలు ఏర్పాటు చేసుకుని సంచార జీవనం గడిపే జాతి. కానీ అది ఒకప్పుడు .నేడు విద్య వారి హక్కు, కనీస వసతి కల్పించడం ప్రభుత్వ బాధ్యత. ఇంతగా పాలన మారినా వీరు ఇంకా గత జీవితమే గడపడం నన్ను ఆలోచనలో పడేసింది.

శివకుమార్ పదిహేనేళ్ళ అబ్బాయ్, ఎనిమిదవ తరగతి వరకు చదువుకున్నాడు, రేపు జూన్ నుండి మళ్ళీ బడికి వెళ్తాడు. రాయడం చదవడం చక్కగా వచ్చు. ‘మరి చదువు మానేసి ఇలా ఏంటీ.?’ అని అడిగాను. శివకుమార్ సొంత ఊరు కర్నూలు, అక్కడ డక్కడ ఆరు నెలలు ఉంటుంటారు. ఆ చుట్టుపక్కల ఇలా భిక్షాటన చేస్తూ సొంతూరు వెళ్లి చదువుకుంటాడు. ఇలా మారుతూ ఉండటం వల్ల తన చదువు సగం సగంగా ఉంది.

“గొప్పగా చదివినా మేము ఇదే చేసుకోవాలి స్వామీ, మా చిన్నాయన బి టెక్ చదివి ఇప్పుడు మరలా ఇలాంటి యేషాలేస్తున్నాడు. మాకు రిజర్వేషన్ కూడా లేదు మా జాతి ఓసీ కింద ఒస్తది. 
మమ్మల్ని కూడా sc,stల్లో చేర్చాలని మా వాళ్ళు అడుగుతున్నారు కూడా. లాక్డౌన్ నుండి నేను ఇలా యేషాలు యేస్తున్నాను.

అప్పటి నుండి చదువు ఆపేశా. రాముడు, లక్ష్మణుడు, హనుమంతుడు, జాంభవంతుడి యేషాలు యేస్తాను. మాయమ్మ ఇళ్లల్లో పనికి పోతది. ఇంట్లో మగోళ్ళు యిలా యేషాలు యేసుకొస్తం. రోజుకి మూడొందలు దాకా వస్తాయి.” అని చెప్పాడు. ఎవరైనా చదివిస్తే చదువుకుంటావా అని అడిగిన ప్రశ్నకు తన సమాధానం “చదువుకున్న జాబ్ రాదు సామీ, మాకు సరిగా గుర్తింపే లేదు, రిజర్వేషన్ లేదు.

పథకాలు లేవు ఎంత చదివినా ఈ యేషాలే యెయ్యాలి. అంతకాడికి నేను చదివిన చదువు చాలుగా సామీ. ఎంత చదివిన ఇదే పని సామీ” అనే మాటలో అసహనం స్పష్టంగా కనిపిస్తుంది. కానీ అతనిలో ఎక్కడో చదువుకోవాలి అనే ఆశ లేకపోలేదు. “ఒకప్పుడు బుర్రకధలు, డ్రామాలు వేసే వాళ్ళం ఇప్పుడు అవి లేవు, మాకు ఇల్లు వాకిలి కూడా లేదు, మరి మాకు ఇలా వేషం వేసి భిక్షమెత్తడమే వృత్తయింది” అన్నాడు.

లక్ష్మణుడి వేషం వేసిన నీ పక్కన రాముడు సీత ఏరి అనడిగితే.. “అంతా కలిపి తిరిగినా, నేనొక్కడినే తిరిగినా అదే పది రూపాయలు ఇచ్చేవి. నలుగురం నాలుగు వీధులు తిరిగితే నాలుగొందలు వస్తాయి సామీ, అందుకే విడివిడిగా భిక్షాటన చేస్తున్నాం. ఆ రామచంద్రుడు అందరి బ్రతుకులు మార్చాడు కానీ మా బ్రతుకులనే ఇలా వదిలేసాడు” అంటూ శివకుమార్ ఆ రాముడిని తలుచుకున్నాడు.

అరణ్యవాసంలో కూడా వీడని రామలక్ష్మణుల బంధం ఆకలి బాధలు జయించడానికి నేడు విడి విడిగా విడిపోయి పొట్ట తిప్పల కోసం భిక్షేత్తుతోంది. ఏమి రామా.. ఏమిటిది నువ్వే దిక్కని నిన్ను నమ్ముకున్నోడిని వీధులపాలు చేసి నీ పేరుతో రాజకీయం చేసే వాడిని అందలమెక్కించావు.
నిజమే రాముడు వేషం వేసిన రామాయణాన్ని చెబుతూ  తిరుగుతున్న వీరి బ్రతుకులు వీధుల్లో రామాయణమయితే రాముడి పేరుని వాడుకున్న కొందరు భోగాలు అనుభవిస్తున్నారు. ఎప్పటికైనా ఈ లక్ష్మణుడి జీవితం సలక్షణంగా విలసిల్లాలని కోరుకుందాం. 

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!