అర్చకత్వం అంత వీజీ కాదు !!

Sharing is Caring...

Pardha Saradhi Upadrasta…………

ఈ ప్రపంచంలో నిజంగా సెలవులే లేని వృత్తులు చాలా తక్కువ. అటువంటి అరుదైన, నిరంతర త్యాగంతో నడిచే వృత్తుల్లో అర్చకత్వం ఒకటి.ఇది ఉద్యోగం కాదు… ఇది ఒక జీవన విధానం, ఒక తపస్సు. అర్చకుడి రోజు గడియారంతో కాదు – దేవుడి కాలంతో మొదలవుతుంది.

తెల్లవారుజామున 4 గంటలకే లేచి,కాలకృత్యాలు తీర్చుకొని, గుడికి చేరుకొని ముందుగా గర్భగుడిని ఊడ్చి, శుభ్రపరిచి,దీపాలు వెలిగించి, స్వామివారిని మేల్కొలిపి సరిగ్గా 5 గంటలకు అర్చన ప్రారంభించాలి.అక్కడి నుంచి ఆగకుండా—అభిషేకాలు, అలంకారాలు, మహానైవేద్యం, దర్శనాలు సాగుతాయి.

సాధారణ రోజుల్లోనే ఇవన్నీ పూర్తయ్యేసరికి మధ్యాహ్నం 1 దాటిపోతుంది. ఇక విశేష ఉత్సవాలు, బ్రహ్మోత్సవాలు, కళ్యాణోత్సవాలు వస్తే నిద్ర ఎప్పుడు? భోజనం ఎప్పుడు? అన్న ప్రశ్నలకే సమాధానం ఉండదు. ధనుర్మాసం, కార్తీక మాసం అయితే ఆ సేవ మరింత కఠినంగా మారుతుంది. భక్తులు ఎడతెరిపి లేకుండా వస్తూనే ఉంటారు.

అర్చకుడికి మాత్రం విశ్రాంతి అనే మాటే ఉండదు. ఒక అత్యవసర పరిస్థితిలో పక్క ఊరు వెళ్లాల్సి వస్తే— ఫోన్ ఓపెన్ చేసి కనీసం 15 మందికి కాల్ చేయాల్సిందే. 14 మంది “కుదరదు” అన్నాక  ఒక్కడు మాత్రమే “అన్నా నువ్వు వెళ్లిరా… రేపు అర్చన నేను చూసుకుంటా” అని చెప్పినప్పుడు వచ్చే ఆనందం డబ్బుతో కొలవలేనిది.

పెద్ద దేవాలయాల్లో ప్రత్యామ్నాయ అర్చకులు ఉండవచ్చు.చిన్న దేవాలయాల్లో,మధ్యస్థ దేవాలయాల్లో,
ఒకే ఒక్క అర్చకుడు ఉన్న ఆలయాల్లో ఆ ఒంటరితనం, ఆ బాధ నిజంగా వర్ణనాతీతం.దేవాదాయ శాఖ పరిధిలో ఉన్న ఆలయాల్లో సెలవులు కూడా అధికారుల అనుమతుల మీదే. సేవ చేయాలన్న మనసు ఉన్నా స్వేచ్ఛ ఉండదు. ఎవరైనా ఫంక్షన్‌కు పిలిస్తే ఆనందం కాదు… భయం!

ముహూర్తం వేళ గుడిలో అర్చనకి ఎవరు ఉంటారు? వెళ్లకపోతే ఏమనుకుంటారో? ఇక  శుభకార్యాలకు పిలవడం మానేస్తారేమో?ప్రత్యామ్నాయ అర్చకుడు దొరకక వెళ్లలేక వదిలేసిన పెళ్లిళ్లు, శుభకార్యాలు పదుల్లో కాదు… వందల్లో ఉంటాయి. వాడు అంతేలే పిలిచిన రాడు అనే నిష్టూరాలే ఎక్కువ. మౌనముగా భరిస్తూ బాధ పడుతూ వుంటారు.

ఇంకా హృదయాన్ని పిండేసే విషయం— ఇంటిపేరు వాళ్లు, చిన్నప్పటినుంచి తెలిసినవాళ్లు చనిపోతే కూడా “వాడు ఒక్కడే గుడి చేసుకుంటున్నాడు”“కార్తీక మాసం” “ధనుర్మాసం” అని చెప్పి మొత్తం కార్యక్రమాలన్నీ అయిపోయాక పదో రోజు ఫోన్ చేసి “బాబు, రేపు తలస్నానం చేయి” అనే స్థితి. ఎత్తుకుని పెంచినవాడు చనిపోతే  కనీసం ఆఖరి చూపు కూడా చూడలేకపోవడం అర్చకుడి జీవితంలో విషాదం.

మాటల్లో చెప్పలేని బాధ. ఇంతకీ… అర్చకత్వం అంటే చదువు లేని వృత్తి అనుకుంటారా? అసలు కాదు.
అర్చకత్వానికి అర్హత అంటే – సంవత్సరాల విద్య. వేదాధ్యయనం, ఆగమ శాస్త్రాలు, సంస్కృతం, సంప్రదాయ నియమాలు..ఇవి అన్నీ చిన్న వయసులోనే నేర్చుకోవాలి.

8,12 ఏళ్ల వయస్సులో తోటి విద్యార్థులు జీవితాని చదువుతో పాటు ఆనందిస్తూ ఉంటే వీళ్ళు అవేమి లేకుండా వేద విద్యాధ్యయనము కోసం గురుకులాలలో చేరుతారు. వేద విద్య మొదలు పెడతారు. ఒక అక్షరం తప్పుగా ఉచ్చరిస్తే మంత్రార్థమే మారిపోతుంది. గురుకులాల్లో లేదా తండ్రి–తాతల దగ్గర తరతరాలుగా వచ్చే విద్య ఇది.

చదువుతో పాటు నిత్య స్నానం, శుద్ధ ఆహారం, శౌచ నియమాలు, వ్రతాలు— ఇవి పాటించకపోతే
గర్భగుడిలో అడుగు పెట్టే అర్హతే ఉండదు. వేరే పిల్లలకు ఉండే సినిమాలు, ఆటలు వీళ్ళకు ఉండవు. త్యాగం ఆ వయస్సులోనే మొదలు అవుతుంది.

ఇప్పుడు మరో పెద్ద సమస్య భాష. అర్చకుడికి సంస్కృతం, స్థానిక భాష (తెలుగు వంటి) బాగా వస్తాయి. కానీ భక్తులు హిందీ, ఇంగ్లీష్‌లో మాట్లాడితే సరిగా సమాధానం ఇవ్వలేకపోతే చులకన చూపులు. “ఇంత చదువు కూడా లేదా?” అన్న ప్రశ్నలు. ఎవ్వరూ అడగరు—వేదాలు నేర్చుకోవడం సులువా? సంస్కృతం సాధన చిన్న విషయం నా? ఎప్పటికీ కాదు.

ఇంత సేవ చేస్తూనే ఎక్కువసేపు గర్భగుడిలో ఉండడం వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలు … చాలా తీవ్రమైనవి –  గాలి ప్రసరణ లేని గర్భగుడిలో ధూపం, దీపాలు, కర్పూరం పొగను రోజూ గంటల తరబడి పీల్చడం వల్ల తలనొప్పులు, మైకం, శ్వాసకోశ సమస్యలు, దీర్ఘకాలంలో ఆస్థమా వస్తాయి. 

దీపాల వేడి, మూసివేసిన గది వల్ల  అధిక వేడి, డీహైడ్రేషన్, నీరసం, బీపీ సమస్యలు గంటల తరబడి నిలబడి ఉండటం, వంగి అభిషేకాలు చేయడం వల్ల మోకాళ్ల నొప్పులు,వెన్నునొప్పి, స్పాండిలైటిస్,తక్కువ వెలుతురు, పొగ వల్ల కళ్ల మంట, నీరు రావడం, చూపు మందగించడం టైమ్‌కు భోజనం లేక గ్యాస్ట్రిక్, అసిడిటీ, అల్సర్లు, జీర్ణకోశ వ్యాధులు ,నిద్రలేమి, కుటుంబానికి సమయం లేక మానసిక ఒత్తిడి, ఒంటరితనం  ఏర్పడతాయి. 

దీర్ఘకాలంలో రోగనిరోధక శక్తి తగ్గిపోవడం, ఇవన్నిటికంటే అత్యంత దారుణమైన సమస్య ఒకటి ఉంది. ఒకసారి గుడిలో అడుగు పెట్టాక…. మధ్యలో ప్రకృతి పిలిచినా… గర్భగుడిని వదిలి వెళ్లే వెసులుబాటు ఉండదు. అందుకే చాలాసార్లు అవి ఆపేసుకుంటూ ఉండిపోతారు. దీని వల్ల తీవ్రమైన శరీర సంబంధ సమస్యలు వస్తాయి.

ఒకవేళ పక్కకు వెళ్లి వచ్చినా మళ్లీ మళ్లీ స్నానాలు, అవి తెచ్చే మరో రకమైన ఇబ్బందులు భరించాలి.అందుకే చాలాసార్లు తినకుండా, తాగకుండా అలాగే ఉండిపోతారు. వెరసి పొద్దున్నే 5 గంటలకు డ్యూటీ ఎక్కితే ఎప్పుడూ డ్యూటీ దిగే సమయం వస్తుందో అర్చకుడికే తెలియదు.

ఇన్నికష్టాలు తెలిసినా అర్చకుడు గుడిని వదలడు. స్వామిని వదలడు.సేవను ఆపడు. సమాజం, గౌరవం,  మర్యాద,మానవీయ దృష్టి చూపితే అదే అతనికి పెద్ద ఆరోగ్యం. అర్చకత్వం వృత్తి కాదు.తరతరాల త్యాగం, నిరంతర సేవ, నిశ్శబ్ద జీవితం.

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!