Impressive web series………………………..మీర్జాపూర్ వెబ్ సిరీస్ మూడో సీజన్ త్వరలో రాబోతున్నది. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. లాక్ డౌన్ నిబంధనల వల్ల షూటింగ్ జరగలేదు. త్వరలో మూడో సీజన్ చిత్రీకరణ మొదలు కానుంది. ఇప్పటికే స్ట్రీమింగ్ అవుతోన్న రెండు భాగాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతున్న వెబ్ సిరీస్ లో మీర్జాపూర్ అత్యంత ఆదరణ పొందిన సిరీస్ గా గుర్తింపు సాధించింది. ఈ నేపథ్యంలో మూడో సీజన్ పై నిర్మాతలు దృష్టిపెట్టారు.
ఈ సిరీస్ ను కరణ్ అంశుమాన్, గుర్మీత్ సింగ్,మిహిర్ దేశాయ్ లు డైరెక్ట్ చేశారు. కరణ్ అంశుమాన్,వినీత్ కృష్ణ , పునీత్ కృష్ణ లతో కలసి ఈ సిరీస్ స్క్రిప్ట్ తయారు చేశారు. రితేష్ సిద్వానీ ఈ సిరీస్ ను నిర్మించారు. మొదటి సీజన్ 2018 నవంబర్ లో రెండో సీజన్ 2020 అక్టోబర్ లో రిలీజ్ అయ్యాయి. గ్యాంగస్టర్ ల జీవితాలు ఎలా ఉంటాయి ? యువకులు ఎలా గ్యాంగ్ స్టర్ లు గా మారుతున్నారు ? ఎందుకు ఆ లైఫ్ స్టైల్ పట్ల ఆకర్షితులవుతున్నారో మీర్జాపూర్ కళ్ళకు కట్టినట్టు చూపిస్తుంది. గతంలో గ్యాంగ్ స్టర్స్ గా ఓ వెలుగు వెలిగి పతనమైన వారి జీవితాలలో జరిగిన ఘటనల ఆధారంగా ఈ సిరీస్ ను రూపొందించారు.
మధ్యలో పోలీసుల వ్యవహారశైలి .. నేరస్థుల జీవితాల్లో తొంగి చూసిన ప్రేమ… దాని పర్యవసానాలు వంటి అంశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. రాజకీయ వ్యవస్థ .. నాయకుల వ్యవహార శైలిని కూడా ఇందులో ఎండగట్టారు.మొదట హిందీలోనే తీసిన మీర్జాపూర్ ను తెలుగు లోకి కూడా అనువదించారు. ఒక దశలో ఈ సిరీస్ ను బ్యాన్ చేయాలని డిమాండ్ కూడా వచ్చింది.
మీర్జాపూర్ ఎంపీ అనుప్రియ పటేల్ ఈ సిరీస్ చూసి ఆగ్రహం వ్యక్తం చేశారు. మీర్జాపూర్ ను హింసాత్మక ప్రదేశంగా చూపారని బ్యాన్ చేయాలని మీడియా కెక్కారు. ఒక జర్నలిస్టు కూడా ఈ సిరీస్ లో మీర్జాపూర్ ను చట్టవిరుద్ధ కార్యకలాపాలకు కేంద్రంగా చూపడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇవన్నీ కూడా మీర్జాపూర్ సిరీస్ కి మరింత పబ్లిసిటీ ఇచ్చాయి.
మీర్జాపూర్ రెండు సీజన్ల సిరీస్ లో కాలిన్ భయ్యాగా నటించిన పంకజ్ త్రిపాఠీ నటన ఆకట్టుకుంటుంది. కూల్ గ్యాంగ్ లీడర్ గా తనదైన శైలిలో నటించాడు. అలాగే కాలిన్ భయ్యా కుమారుడు మున్నాభయ్యా గా దివ్యేందు శర్మనటించాడు. సిరీస్ మొత్తం మీద దివ్యేందు శర్మ నటన ఆకట్టుకుంటుంది. ఇంకా గుడ్డు పండిట్ గా ఆలీ ఫజిల్ పాత్రలో జీవించాడు. బబ్లు పండిట్ గా విక్రాంత్ కూడా తన పాత్రకు న్యాయం చేసాడు. మొదటి పార్ట్ లోనే ఇతని క్యారెక్టర్ ముగిసిపోతుంది.
రెండు సీజన్లలో ఉండే గోలు పాత్రలో శ్వేతా త్రిపాఠి కూడా ఆడియన్స్ ను ఆకట్టుకుంటుంది. ఫోటోగ్రఫీ .. మ్యూజిక్ అద్భుతం గా ఉన్నాయి. రెండు సీజన్ల సిరీస్ తెలుగులో ఉన్నాయి. చూడని వాళ్ళు ఉంటే చూడొచ్చు. కాకపోతే డైలాగ్స్ లో బండ బూతులు వాడారు. సెక్సువల్ కంటెంట్.. వయోలెన్స్ డోస్ ఎక్కువగానే ఉంది. నిజానికి ఆ బూతు కంటెంట్ .. బూతు మాటలు లేకపోయినా సిరీస్ బాగానే ఉంటుంది.
———– KNM