బాబా వంగా అంచనాలు సంచలనం కోసమేనా ?

Sharing is Caring...

No evidence for Baba Vanga’s predictions….. 

బల్గేరియన్ ఆధ్యాత్మిక వేత్త బాబా వంగా (Baba Vanga) చెప్పినవన్నీ నిజంగా జరిగేయా? ఆమె భవిష్యత్ అంచనాలపై మేధావులు, శాస్త్రవేత్తలు ఎన్నో సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. తాజాగా బంగారం ధరల పెరుగుదల గురించి కూడా ఆమె అప్పట్లోనే చెప్పిందని జోరుగా ప్రచారం జరుగుతోంది.  

ఎవరీ బాబా వంగా ? ఆమె అసలు పేరు వంగేలియా పాండేవా గుష్టెరోవా. 12 ఏళ్ల వయసులో ఒక పెద్ద తుఫానులో చిక్కుకుని ఆమె తన చూపును కోల్పోయారు. ఆ తర్వాతే తనకు భవిష్యత్తును చూసే అద్భుత శక్తి లభించిందని ఆమె నమ్మేవారు. ఆమెను ‘నొస్ట్రడామస్ ఆఫ్ ది బాల్కన్స్’ అని పిలుస్తారు.

ఆమె ప్రస్తుతం జీవించి లేరు. ఆమె 1911లో జన్మించి, 1996 ఆగస్టు 11న మరణించారు. ఆమె తన జీవిత కాలమంతా బల్గేరియాలోని రూపైట్ (Rupite) అనే మారుమూల గ్రామంలో నివసించారు. ఆమె బతికున్నప్పుడు ప్రజలకు భవిష్యత్తు గురించి చెప్పేవారట. జనాల రోగాలను నయం చేసేవారని అంటారు.

తర్వాత కాలంలో ఆమె ప్రపంచ యుద్ధాలు, దేశాధినేతల మరణాలు, సునామీల వంటి అంతర్జాతీయ పరిణామాలను ఆమె ముందే ఊహించేవారని చెబుతుంటారు.బాబా వంగా చదువుకోలేదు,తన అంచనాలను ఎప్పుడూ స్వయంగా రాసుకోలేదు. ఆమె మరణం (1996) తర్వాత ఈ సమాచారం ఆమె మేనకోడలు, ఇతర బంధువులు డైరీలలో రాసుకున్న విషయాలను అప్పుడప్పుడు వెల్లడిస్తుంటారు.

ఉదాహరణకు 1988లోనే ఆమె కోవిడ్ గురించి చెప్పారని ఆమె మేనకోడలు ఒక ఇంటర్వ్యూలో చెప్పారట. అలాగే 9/11 దాడులు, బరాక్ ఒబామా అధ్యక్షుడు అవ్వడం, బ్రెక్సిట్ (Brexit) వంటి అనేక విషయాలను ఆమె ముందే చెప్పారని ఆమె అనుచరులు నమ్ముతారు. బాబా వంగా తన మరణానికి ముందే మరెన్నో జరగబోయే వింతలను అంచనా వేశారు.

ఆమె స్వయంగా తన అంచనాలను రాసి ఉంచిన పత్రాలు లేదా రికార్డింగ్‌లు ఏవీ లేవు అని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్నవన్నీ ఆమె పేరుతో ఇతరులు సృష్టించినవి కావచ్చని అభిప్రాయ పడుతున్నారు.

బాబా వంగా అంచనాలు చాలా అస్పష్టంగా, విభిన్నఅర్థాలకు తావిచ్చేలా ఉంటాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఏదైనా ఘటన జరిగిన తర్వాత, ఆమె పాత మాటలను ఆ ఘటనకు సరిపోయేలా అన్వయించుకోవడం (Post-event interpretation) వల్ల అవి నిజమైనట్లు కనిపిస్తాయని అంటున్నారు. 

2010లో మూడవ ప్రపంచ యుద్ధం ప్రారంభమవుతుందని ఆమె చెప్పిన అంచనా నిజం కాలేదు అని శాస్త్రవేత్తలు గుర్తు చేస్తున్నారు.ఇంటర్నెట్ యుగంలో ఆమె పేరిట అంచనాలను సంచలనం కోసం వాడుకుంటున్నారని, ఇది కేవలం క్లిక్-బైట్ వార్తల కోసమే జరుగుతోందని మేధావులు అంటున్నారు. 

భూకంపాలు లేదా తుపాన్ల వంటి అంచనాలను ఆధునిక విజ్ఞాన శాస్త్రంతో కూడా కచ్చితంగా ముందే చెప్పలేమని, కాబట్టి ఆమె అంచనాలకు శాస్త్రీయ ప్రాతిపదిక లేదని టోక్యో విశ్వవిద్యాలయానికి చెందిన సెకియా నవోయా వంటి శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 

మొత్తంగా,బాబా వంగా ఒక సాంస్కృతిక చిహ్నంగా (Cultural Icon) నిలిచినప్పటికీ, ఆమె అంచనాలు శాస్త్రీయంగా ధృవీకరించబడలేదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.మీడియాలో మటుకు బాబా వంగా అంచనాలపై ప్రచారం జోరుగా సాగుతోంది.  

Sharing is Caring...
Support Tharjani

Leave a Comment!

error: Content is protected !!