పేదవాడే కానీ మహాసాహసి !

Sharing is Caring...

Subbu Rv……………………………………… 

Super Hero ………………………………

కూ.. చుక్ చుక్ రైలు బండి.. రోజూ ప్రయాణిస్తూ తన గమ్యం చేరుతూ ఎందరినో వారి గమ్యాలకు క్షేమంగా చేరుస్తుంది. ఈ రైలు బండి ఎందరికో ఉపాధిని అందిస్తోంది. కొందరికి భుక్తిని కల్పిస్తుంది. అలాంటి రైలు బండి ప్రమాదపు అంచులకు చేరితే ….ఆ ఊహ కూడా భరించలేము. ఆ ప్రమాదం ఎన్నో వందల, వేల కుటుంబాలను వేటాడి రోడ్డున పడేస్తుంది, వేదనలో కలిపేస్తుంది. అలాంటి రైలు ప్రమాదం నుండి రెండు వేల మందిని మాత్రమే కాదు వారి కలలను, కుటుంబాలను రక్షించాడో సూపర్ హీరో. అతని పేరే స్వపన్ దిబ్రామా.

సూపర్ హీరో అనగానే కంటికి ఇంపైన కలర్ఫుల్ కాస్ట్యూమ్, స్పెషల్ గాడ్జెట్స్ తో,పవర్స్ తో, సొగసైన పార్టనర్ తో అనుకుంటే పొరపాటే. ఈ హీరో చిరిగిన మురికి బట్టలతో, చిత్తు కాగితాలు, ప్లాస్టిక్ బాటిల్స్ ఏరుకుంటూ ఓ చిన్న పిల్లతో  రైలుకు అడ్డం పడి మృత్యువు నుంచి వేల మందిని కాపాడాడు. త్రిపుర లోని ఒక ఆదివాసీ కుటుంబానికి చెందిన వ్యక్తి స్వపన్. ఆరోజు అతగాడు సాహసం చేయకపోతే ప్రమాదం అనివార్యం అయ్యేది. 

స్వపన్ రైల్వే ట్రాక్ పక్కన ఉండే ప్లాస్టిక్ బాటిల్స్, కాగితాలు ఏరుకుంటూ మైళ్ళ తరబడి నడుస్తుంటాడు. అలాగే ట్రాక్ పక్కన అరటి బోదెలు, బొంగులను , ఆకులను,పండ్లను సేకరించి వాటిని అమ్మి కుటుంబాన్ని పోషించే వ్యక్తి. అలా అమ్మగా వచ్చే వంద రూపాయలు  లేదా అంతకన్నా తక్కువ మొత్తం తో నే నలుగురు పిల్లలు, తల్లి దండ్రులను పోషించాలి. ఒక్కోసారి బియ్యం కొనలేని దుస్థితి. అంతటి భారమయిన జీవితం.

రోజులాగే రైల్వే ట్రాక్ పక్కన తన కూతురు సుమతితో నడుస్తుంటే త్రిపురలో కురిసిన భారీ వర్షాల మూలంగా ఒకచోట మట్టి కోసుకుని పోయి కనిపించింది. ట్రాక్ పై నున్నరాళ్ళు పక్కకి పోయి ఉండటం చూసాడు. ఇలాంటి ట్రాక్ పైకి రైలు వస్తే తప్పకుండా ప్రమాదానికి గురవుతుంది. దగ్గర్లోని సెక్యూరిటీ వాళ్లకు చెప్పే లోపు  రైలు వస్తే ప్రమాదం జరుగుతుంది. ఈ పరిస్థితుల్లో తనకెందుకులే అని వెళ్లకుండా అక్కడే గంటల తరబడి వేచిఉన్నాడు. రైలొస్తున్నది గమనించి కాస్త ముందుకు పరిగెత్తి .. పట్టాల మధ్య నించుని తన చొక్కాని విప్పి చేత్తో ఊపడం ప్రారంభించాడు.

తనతో పాటుగా తన కూతురు సుమతిని తన రెండు కాళ్ళ మధ్య నొక్కిపెట్టి .. భయంతో అలాగే చొక్కాఊపుతూ రావొద్దని అరుస్తూ … ప్రాణాన్ని అరచేతిలో పెట్టుకుని నిలబడ్డాడు. రైలులో ఉన్న ప్రయాణికులకు ఇది తెలియదు. భయంతో పక్కకు తొలిగితే పెద్ద ప్రమాదం జరుగుతుంది. ఏదైతే అది కానీయ్ అనే మొండి ధైర్యంతో .. అలాగే ప్రాణాలు ఉగ్గబట్టి పట్టాల మధ్యలోనే నిలబడ్డాడు. పోతే తమ ప్రాణాలు… రైలు ఆగితే వేల మంది ఆశలు, ఆశయాలు బతుకుతాయి. ఎట్టకేలకు రైలు ఆగింది.

లోకో పైలెట్ క్రిందకి దిగి స్వపన్ దగ్గరకు రాగానే విషయం చెప్పాడు. అతగాడు  ప్రమాదాన్ని అంచనా వేశాడు. ఈ విషయాన్ని అధికారులకు సమాచారం పంపాడు. ప్రాణాలకు తెగించి రెండు వేల మందిని కాపాడారు స్వపన్ అతని కూతురు సుమతి. త్రిపుర ప్రభుత్వం రియల్ హీరోతో పోలుస్తూ అసెంబ్లీ లో అభినందనలు ప్రకటించింది. త్రిపుర మినిస్టర్ రాయ్ బర్మన్ స్వపన్, సుమతి లను పిలిచి కొత్త బట్టలు పెట్టి, కలిసి భోజనం చేశారు. స్వపన్ కుటుంబానికి మంత్రులు .. విఐపీల నుంచి విందుకి ఆహ్వానాలు వచ్చాయి.

దరిద్రం తప్ప తలుపు తట్టని ఆ గూడెంకి బుగ్గ కారులు వరుస పెట్టాయి. త్రిపుర ప్రభుత్వం స్వపన్ కి గ్రూప్ D ఉద్యోగం, నగదు బహుమతి ప్రకటించింది. సుమతి ని చదివించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంది.అనేక సేవాసంస్థలు, వ్యక్తుల నుండి బట్టలు, స్వీట్స్ (తనెప్పుడు తినని రుచికరమైన వంటలు), డెబ్బయివేల నగదు రూపంలో మూడు లక్షల వరకు చెక్కు రూపంలో అందాయి.అంతా బాగున్నా స్వపన్ ని చెక్ రూపంలో వచ్చిన నగదు ఏం చెయ్యాలో తెలియదు. బ్యాంక్ అకౌంట్ లేదు, అది ఓపెన్ చెయ్యాలంటే ఆధార్, గుర్తింపు లాంటివి ఎలా తెచ్చుకోవాలో కూడా తెలియని, అందని దూరంలో అతని గత జీవితం ఉంది. స్వపన్ దిబ్రామ పేరుకి పేదోడు కానీ ధైర్యానికి కాదు. అతనొక సూపర్ హీరో అంతే..

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!