ఈ కంపెనీ షేర్లపై ఓ కన్నేయండి !

Sharing is Caring...

Sbi Cards…………………………………………..

ఎస్‌బీఐ కార్డ్స్ అండ్ పేమెంట్ సర్వీసెస్ పనితీరు ప్రోత్సాహకరంగా ఉంది. ఈ సంస్థను స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా ప్రమోట్ చేసింది.1998 లో స్థాపితమైన ఈ కంపెనీ ఆర్థిక సేవల్లో నిమగ్నమైంది. కంపెనీ మార్కెట్ క్యాప్ 79,766.43 కోట్లు.  ఫీజులు, ఇతర సర్వీసుల ద్వారా వచ్చిన మొత్తాలు వృద్ధి చెందడంతో  ఆదాయం కూడా పెరిగింది. 

2021 డిసెంబరు 31 తో ముగిసిన తొమ్మిది నెలల కాలానికి కంపెనీ రూ. 7826 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. అదే సమయంలో నికర లాభం కూడా 28 శాతం పెరిగి, రూ. 1,035 కోట్లకు చేరుకుంది. 2020 సంవత్సరంలో ఇదేకాలంలో 6968 కోట్ల ఆదాయంపై 809 కోట్ల నికరలాభాన్ని గడించింది. మార్చి 2021 తో ముగిసిన ఆర్ధిక సంవత్సరంలో  9713 కోట్ల ఆదాయంపై  984 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది.

మార్చి 2020 నికర లాభంతో పోలిస్తే కొంత తగ్గుదల ఉంది. 2022 మార్చి నాటికి మెరుగైన ఫలితాలు సాధించే అవకాశాలున్నాయని అంచనా వేస్తున్నారు. ఫలితాలు ప్రోత్సహకరంగా ఉన్నాయి. కంపెనీ షేర్లు ప్రస్తుతం రూ. 850 వద్ద ట్రేడ్ అవుతున్నాయి.  52 వారాల గరిష్ట ధర రూ. 1165 కాగా కనిష్ట ధర రూ. 781 మాత్రమే. మార్కెట్ డౌన్ ట్రెండ్ లో ఉన్నప్పటికీ షేర్ ధర పెరుగుతోంది.

గత ఏడాది షేర్ ధర రూ. 1100 రేంజ్ లో కదలాడింది. డిసెంబర్ నుంచి ధర తగ్గుముఖం పట్టింది. 2020 మే లో షేర్ ధర రూ.  509 కి పడిపోయింది. తర్వాత మెల్లగా పెరిగింది. ఈ షేర్ ధర మరింత పెరిగే అవకాశాలున్నాయని బ్రోకింగ్ సంస్థలు బై కాల్ ఇస్తున్నాయి. బ్రోకింగ్ సంస్థ మోతీలాల్ ఓస్వాల్  ప్రస్తుత మార్కెట్ ధర నుంచి  32 శాతం పెరుగుతుందన్న అంచనాతో  రూ. 1,120  టార్గెట్‌ ఇచ్చింది.

మరో బ్రోకింగ్ సంస్థ ఆనంద్ రాఠీ  రూ. 1,221.0  టార్గెట్ తో బై కాల్ ఇచ్చింది. ప్రస్తుత ధర వద్ద చిన్నఇన్వెస్టర్లు మదుపు చేయడం రిస్క్ తో కూడిన వ్యవహారమే. పెద్ద ఇన్వెస్టర్లు అయితే కొంత రిస్క్ తీసుకోవచ్చు. రూ. 500 రేంజ్ లో ఈ షేర్లను కొన్న చిన్న ఇన్వెస్టర్లు వాటిని అమ్మేసుకుని లాభాలు స్వీకరించడం మంచి వ్యూహం. కనీసం కొన్ని షేర్లు అమ్మి పాక్షిక లాభాలు జేబులో వేసుకోవడం మంచిది. ధర తగ్గినపుడు కావాలంటే కొనుక్కోవచ్చు.

నోట్ ….. ఇన్వెస్టర్ల అవగాహన కోసమే ఈ విశ్లేషణ. ఆలోచించి ఇన్వెస్టర్లు నిర్ణయం తీసుకోండి. 

——-KNM

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!