Goverdhan Gande……………………………….
“బెయిళ్ళు ఇవ్వకుండా వ్యక్తుల వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించడం సరికాదు.” అర్ణవ్ గోస్వామి బెయిల్ పిటిషన్ విచారణ సందర్బంగా అత్యున్నత న్యాయస్థానం చేసిన వ్యాఖ్య ఇది. విచారణ సందర్బంగా అర్ణవ్ కు హై కోర్టు బెయిల్ నిరాకరించడాన్ని తప్పుబట్టింది కూడా. నిజమే వ్యక్తి గత స్వేచ్ఛకు భంగం కలిగించే హక్కు ఎవరి (రాజ్యాంగం ప్రకారం)కీ లేదు.
ఆ హక్కును కాపాడే గొప్ప తీరు నిచ్చింది.అత్యున్నత న్యాయస్థానం. స్వేచ్చా ప్రియులు, ప్రజాస్వామిక వాదులంతా స్వాగతిస్తారు. అందరూ సమర్థించవలసిందే. (గోస్వామి తరహా జర్నలిజం ఇక్కడ సందర్భం కా దు.ఇది జర్నలిజానికి సంబంధం లేని కేసు.ఇది వ్యక్తి స్వేచ్ఛకు మాత్రమే పరిమితం)ఇందులో అనుమానాలకు తావు లేదు. అయితే ఈ వ్యాఖ్య దేశంలోని పౌరులందరికీ వర్తించాలి.
ఎలాంటి ఆధారాలు లేని కేసుల్లో అనేకమంది ఏళ్లుగా జైళ్లలో మగ్గుతున్నారు. వీరిలో వృద్ధులు,అనారోగ్య పీడితులూ ఉన్నారు.వీరికి సరైన వైద్యం కూడా లభించడం లేదు. బెయిలుకు దరఖాస్తు చేసుకున్న ప్రతీసారీ,బెయిలు దొరకక వారికి నిరాశే కలుగుతున్నది.వీరిలో 80 ఏళ్ళు పై బడిన వృద్ధులు కూడా ఉన్నారు.
ఉత్తుత్తి ఆరోపణలతో వేధిస్తున్నారని విశ్వసించే విధంగా దర్యాప్తు సంస్థల ధోరణి కొనసాగుతున్నదనేది జనం నమ్ముతున్నారు. ఈ కేసులు న్యాయ వ్యవస్థ కు ఎందుకు స్ఫురించవు అనేదే ఇక్కడ ప్రశ్న. కోర్టులు తలుచుకుంటే ఇలాంటి కేసుల సంగతి కూడా పట్టించుకోవచ్చు. పట్టించుకోవాలి కూడా.
లాయర్ ను నియమించుకునే శక్తి ,అవగాహన లేక బెయిలు కోసం దరఖాస్తు చేసుకోలేక అండర్ ట్రయిల్ (విచారణ ఖైదీలుగా ) మగ్గుతున్న వారు ఎందరో ఉన్నారు. చిన్నా చితక కేసులో అరెస్ట్ అయినవారు రిమాండ్ లో ఉండగా అక్కడ జైలులోని నేరస్థుల తో పరిచయాలు ఏర్పడి బయటికి వచ్చాక నేరస్థులు గా మారుతున్నారు.
అర్ణవ్ “సెలెబ్రిటీ “జర్నలిస్టు కాబట్టి బెయిల్ లభించిందా? అంటే మిగతావారు పౌరులు కారా?ద్వితీయ శ్రేణి పౌరులా? లేక పౌరులందరూ సమానులు కారా?కొందరు ఎక్కువ సమానులా? లేక వ్యక్తిగత స్వేచ్చ కొందరికే వర్తిస్తుందా? అదీకాక రాజ్యాంగం అందరికీ సమంగా వర్తించదా?
దేశంలో ఇలాంటి కేసుల్లో బెయిల్ దొరకక అన్యాయంగా జైళ్లలో మగ్గుతున్న వారికి,వారి కుటుంబ సభ్యులు,స్నేహితులు,ప్రజాస్వామిక వాదులకు ఇలాంటి అనుమానాలు తప్పకుండా కలుగుతాయి.మరి వీటికి జవాబు ఎవరిస్తారు? అదే ఒక విషాదం.
ఇదికూడా చదవండి >>>>>>>> జీవిత ఖైదు కన్నాఉరిశిక్షే నయం కదా !