పెగాసస్ స్పైవేర్ వ్యవహారం సుప్రీంకోర్టు ముందుకు వెళ్లింది. సుప్రీం కోర్టు అడ్వకేట్ ఎంఎల్ శర్మ సుప్రీంలో పిల్ దాఖలు చేశారు. సుప్రీం కోర్టు పర్యవేక్షణలో ప్రత్యేక దర్యాప్తు బృందం ద్వారా ఈ మొత్తం వ్యవహారంపై విచారణ జరిపించాలని శర్మ కోరారు. పాత్రికేయులు, ఉద్యమకారులు, రాజకీయ నాయకులు, ఇతరులపై నిఘా పెట్టినట్లు ఆరోపణలు వచ్చాయని ఆ పిటిషన్లో శర్మ వివరించారు. పెగాసస్ వ్యవహారం దేశ ప్రజాస్వామ్యం, న్యాయ వ్యవస్థ ,దేశ భద్రత పై దాడిగా ఆయన అభివర్ణించారు.
ఈ వ్యవహారాన్ని తేలికగా తీసుకోకూడదని కోర్టును అభ్యర్ధించారు. నిఘాను విస్తృతంగా, యథేచ్ఛగా, జవాబుదారీతనం లేకుండా ఉపయోగించడం కఠినమైన నేరమని … వ్యక్తిగత గోప్యత ను కాపాడాల్సిన అవసరం ఉందని శర్మ పేర్కొన్నారు.పెగాసస్ స్పైవేర్ ను ఉపయోగించడం అంటే ఒక వ్యక్తి సంభాషణలు చాటుగా వినడం మాత్రమే కాదని ఆ వ్యక్తి యావత్ జీవితానికి సంబంధించిన డిజిటల్ ప్రింట్ ను తెలుసుకోవటమే అని శర్మ పిటీషన్ లో కోర్టు కి విన్నవించారు.
ఫోన్ యజమానిని మాత్రమే కాకుండా ఆ వ్యక్తితో కాంట్రాక్టులో ఉండే వారందరి గురించి తెలుసుకోవడానికి ఈ స్పైవేర్ పనిచేస్తుందని శర్మ వివరించారు సర్వేలెన్స్ టెక్నాలజీ వెండర్లు విపరీతంగా పెరగడం వల్ల అంతర్జాతీయ భద్రతా.. మానవ హక్కుల సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని పిటిషనర్ ఆందోళన వ్యక్తం చేశారు.
సుప్రీం కోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరిపేందుకు సిట్ ను ఏర్పాటు చేయాలని పిటిషనర్ కోర్టును కోరారు. ఈ వ్యవహారంలో ఉన్న నిందితులను శిక్షించాలని అలాగే పెగాసస్ స్పైవేర్ కొనడం చట్టవిరుద్ధం.. రాజ్యాంగ విరుద్ధమని కోర్టు ప్రకటించాలని పిటిషనర్ కోరారు. పెగాసస్ అనేది కేవలం నిఘా సాధనం మాత్రమే కాదని ఇది సైబర్ ఆయుధమని పిటీషనర్ ఆందోళన వ్యక్తం చేశారు. సుప్రీం ఈ పిటీషన్ పై ఎలా స్పందిస్తుందో చూడాలి.