తాలిబన్లతో పోరాటానికి సిద్ధంగా ఉన్నామని .. పంజ్‌షీర్ ప్రాంతాన్నే కాకుండా అఫ్గానిస్థాన్ మొత్తాన్ని తాలిబన్ల పాలన నుంచి రక్షిస్తామని పాపులర్ రెసిస్టెన్స్ ఫ్రంట్ కమాండర్లు చెబుతున్నారు. ఇప్పటివరకు తాలిబన్లతో ఎలాంటి ఒప్పందం కుదరలేదు. ఒకవేళ కుదిరినా వారిని కాబుల్ పరిపాలనలో భాగంగానే పరిగణిస్తామని అంటున్నారు.
అఫ్గాన్ ప్రజల హక్కులు, మహిళల భద్రత, మైనారిటీల రక్షణ కోసం మేమంతా ఆందోళన చెందుతున్నాం. తాలిబన్లు దేశ ప్రజల హక్కులకు ఎలాంటి హానీ తలపెట్టమని భరోసా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నామని ఫ్రంట్ అధికారి ప్రతినిధి ఫహీమ్ మీడియాకు వివరించారు.గతంలోకూడా తాలిబన్ల పాలనను ఎదుర్కోవడంలో పంజ్‌షీర్ ప్రాంతం కీలక పాత్ర పోషించింది.
తాలిబన్లకు ఆ ప్రాంతం వారంటే వణుకు. మొదటి నుంచి కొరుకుడుపడని వారే. ఎప్పటి నుంచో తాలిబన్ల కు వ్యతిరేకంగా ఉన్న పంజ్ షేర్ ప్రాంత నేత అహ్మద్ షా మసూద్ కుమారుడు అహ్మద్ మసూద్… అఫ్గాన్ ఉపాధ్యక్షుడిగా ఉన్న అమ్రుల్లా సలేహ్ వంటి నాయకులు తాలిబన్ల దురాక్రమణను సవాల్ చేస్తున్నారు. అవసరమైన ఆయుధ సామాగ్రిని సమకూర్చుకుంటున్నారు. అమెరికా సహాయం కూడా అర్ధించారు. అయితే అమెరికా ఏవిధంగా స్పందించింది తెలియ రాలేదు.
లొంగిపొమ్మని తాలిబన్లు చేసిన హెచ్చరికను పంజ్ షేర్ యోధులు అసలు ఖాతరు చేయడం లేదు. హిందూకుష్ పర్వతాల్లోని పంజ్ షీర్ లోయ ఇప్పటివరకు అజేయమైన కోటగా నిలిచింది. అక్కడి ఎత్తైన పర్వతాలు, ఇరుకైన లోయ, పంజ్‌షీర్ లోయకు వెళ్లే అన్నిరహదారుల్లో తాజిక్ యోధులు పహారా కాస్తున్నారు. రెసిస్టెన్స్ ఫ్రంట్ లో చేరడానికి ఆఫ్ఘన్ నేషనల్ ఆర్మీ సైనికులు పంజ్‌షీర్ చేరుకుంటున్నారు.
ఈ ప్రాంతంలో తజిక్ జాతికి చెందిన ప్రజలే ఎక్కువ. వీరు అహ్మద్ షా మసూద్ నాయకత్వంలో గెరిల్లా యుద్ధంలో కాకలు తీరిన యోధులుగా మారారు.1980లో సోవియట్ రష్యా దాడులను తిప్పికొట్టారు. 1996-2001 మధ్య కాలంలో తాలిబన్ల ఆధిపత్యాన్ని ఎదిరిస్తూ పోరాటం చేశారు. అయితే ప్రస్తుతం తాలిబన్ల వద్ద అమెరికా వదిలి వెళ్లిన ఆయుధాలు పెద్ద సంఖ్యలో ఉన్నాయి. తాలిబన్లు కూడా ఆ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకునేందుకు బయలు దేరారు. ఆ రెండు వర్గాల మధ్య యుద్ధం అనివార్యం అయ్యే సూచనలున్నాయి.