కమర్షియల్ డైరెక్టర్లు లేకపోతే .. సంస్కృతి ఏమై పోయేదో ?

Sharing is Caring...

Bharadwaja Rangavajhala……………………………. 

అసలు మన కమర్షియల్ డైరక్టర్లు లేకపోతే… మన సంస్కృతి ఎప్పుడో నాశనం అయ్యేది. మన సంస్కృతి నాశనం కాకుండా చూడ్డానికి ఆ విష్ణుమూర్తే స్వయంగా రాఘవేంద్రరావుగా, దాసరి నారాయణరావుగా , పూరీ జగన్నాథ్ గా త్రివిక్రమ్ శ్రీనివాస్, రాజమౌళి లా ఇలా అనేక అవతారాలు ఎత్తాడేమో అని కూడా నాకో అనుమానం.

అసలు మన సినిమాల్లో హీరో హీరోయిన్ల తొలి పరిచయమే చాలా సాంప్రదాయంగా (క్రూరంగా) ఊహిస్తున్నారు మన రచయితలు, దర్శకులు.ఇలా హీరోయిన్ ను గ్లామరస్ గా చూపించడానికి…  ఆమెను హీరో వేధించడానికి… ఒక సామాజిక ఆమోదం లభించేలా చేయడం కోసం వారు అవసరం అయితే కమ్యునిస్ట్ ఫోజు కూడా దొబ్బుతారు … సంప్రదాయం కాపాడ్డం కోసం ఏం చేసినా తప్పు లేదు.

అసలు  కమ్యూనిజం అంత సేలబుల్ సబ్జక్టు మరోటి లేదని కూడా మన కమర్షియల్ డైరక్టర్ల కాడ ఓ థియరీ ఉండుద్దని నా అనుమానం .. హీరోయిన్ అనే అమ్మాయిని డబ్బున్న కుటుంబానికి చెందినదిగాను .. హీరోను పరమ పేదోడు గానూ బడుగు జనాల ప్రతినిధి గానూ చూపించడం అనే పద్దతిని అనుసరిస్తారు మనవాళ్లు.ఇలా హీరోను బడుగు బలహీన వర్గాల ప్రతినిధిగా చూపిస్తూ …హీరోయిన్ ను అగ్ర వర్గాల ప్రతినిధిగా చూపించడం వల్ల ఓ అద్భుతమైన ప్రయోజనం ఉంటుంది.

హీరోయిన్ ను రకరకాలుగా హీరోతో చిత్ర హింసలు పెట్టించవచ్చు,ఏడిపించవచ్చు.అదంతా వర్గ పోరాటం అక్కౌంటులోకి వచ్చేస్తుంది. దీంతో రెండు లక్ష్యాలు నెరవేరుతాయి. ఆ అమ్మాయిని ఎలా పడితే అలా ఆడు కోవచ్చు. ఆ క్రమంలో ఎక్స్ పోజ్ చేయవచ్చు.ఆఎక్స్ పోజింగుకు జనామోదం లభించేలా చూసుకోవచ్చు.

సంప్రదాయం కాపాడుకుంటూనే కమర్షియల్ గా సక్సస్ కొట్టడం ఇది. మన సినిమాల్లో హీరోయిన్లు అన్ని విధాలుగా బలహీనంగా ఉంటారు.వాళ్లకు  బికాంప్లెక్సులు ఇచ్చే ప్రయత్నం చచ్చినా చేయరు మన నిర్మాత దర్శకులు. ఈ బలహీనమైన హీరోయిన్లు పూర్తిగా హీరోల మీద ఆధారపడిపోతారు.అప్పుడు మాత్రమే మీ జీవితాలు నడుస్తాయని డైరట్రు చెప్తాడేమో ఈళ్లకి చెవిలో అని నా అనుమానం . ఆడది అబల అనే విషయాన్ని బలంగా చెప్పే విధంగానే సన్నివేశ కల్పన సాగుతుంది.

ఆ దర్శకుడు ఎంతటి ప్రోగ్రెసివ్ అయినా సినిమా హీరో సెంట్రిక్ గానే నడుస్తుంది. హీరోయిన్ చదువుకున్నదై హీరో చదువులేని వాడైనా సరే ఆమె అతనిపైనే ఆధారపడి ఉంటుంది. అలా చూపించడం ద్వారా మన సంస్కృతిని కాపాడుతున్నాననుకుంటారు మన సినిమా రచయితలు దర్శకులు.అని నా అనుమానం.

ఆడవారిని చులకనగా చూడడం … వాళ్లకు అందం ఉంటుంది తప్ప బుర్రుండదని అనుకునేలా సన్నివేశాలు కల్పించడం ఓ అద్భుతమైన ప్రక్రియ.ఆడువారిని పూర్తి కంట్రోల్ లో ఉంచాలనుకోవడం … ఆడవారి మీద ఎవరైనా అత్యాచారానికి పాల్పడ్డా అందుకు కారణం వీళ్లే అనడం … వీళ్లు పద్దతిగా లేకపోవడం వల్లే … రెచ్చగొట్టేలా వ్యవహరించడం వల్లే అలాంటి దారుణాలు జరుగుతున్నాయి తప్ప మహిళలు పద్దతిగా ఉంటే జరగవు అనే టోన్ లో సన్నివేశాలను నడిపించడం మన దర్శకులకే చెల్లింది.

మన ఆడియన్స్ కూడా తక్కువ్వోళ్లు కాదండి బాబు .పొగరుబోతు హీరోయిన్ ను కంట్రోల్ లో పెట్టే హీరో అంటే మనకి అడ్మిరేషను.పొగరుబోతు అత్తను దారిలో పెట్టే అల్లుడంటే మనకు మహా మోజు .. తులసి ఆకుతో భర్తను గెల్చుకున్న రుక్మిణీదేవి ఆదర్శంలో పతివ్రతా లక్షణాలను మహిళలకు ఏకరువు పెట్టడానికే మన సినిమా దర్శకుల తహతహ… తద్వారా భారతీయ సంస్కృతిని కాపాడుతున్నామని మన దర్శకులు ఫీలవుతూ ఉంటారు.

తప్ప తాము కల్పిస్తున్న సినిమాల ద్వారా ఏ రకమైన భావాలను వ్యాపింప చేస్తున్నాం అనే స్పృహ ఉండడం లేదు.హీరో అనేవాడు ముందూ వెనుకా ఆలోచించకుండా ఎలా పడితే అలా వ్యవహరించవచ్చు …కానీ హీరోయిన్ అలా అనుకోకూడదు. తన జీవితాన్ని పవిత్రంగా హీరో కోసమే అంకితం చేసి ఉంచాలి.

భర్త ఎలాంటి వాడైనా తాగుబోతు అయినా తిరుగుబోతైనా అతన్ని మార్చుకోవాలి తప్ప కాపురాన్ని కాల దన్నుకోరాదు. ఈ సందేశం ఇవ్వడానికి తెలుగు సినిమా దర్శకులు పడ్డంత తాపత్రం ఎవరూ పడి ఉండరు.కావాలంటే దాసరి స్వర్గం నరకం నుంచీ చూసుకోవచ్చు . 

భర్త నుంచీ విడిపోవాలనుకునే హీరోయిన్లు మన సినిమాల్లో కనిపించరు.ఒక వేళ అలా అనుకున్నా ఆ హీరోయిన్ తండ్రో తల్లో వచ్చి మా పిల్లకు బుద్ది చెప్పాల్సిన బాధ్యత నీదే బాబూ అని అనధికారికంగా తమ కూతురి బతుకు అల్లుడి చేతిలో పెట్టి ఆ అమ్మాయిలో ఉన్న స్వేచ్చ కోరుకునే తత్వాన్ని ఆత్మాభిమానాన్నీ అన్నిటినీ చంపేసే బాధ్యత అల్లుడికి అప్పగించేస్తారు. ఇలా మన సినిమాల్లో అనేక సన్నివేశాలు కనిపిస్తాయి.

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!