Young Minister……………………………..
చూడటానికి సినీ నటి లా కనిపించే ఈ యువతి రాజకీయ నాయకురాలు.ఇటీవల ఏర్పాటైన స్వీడన్ ప్రభుత్వంలో ఈ 26 ఏళ్ల రోమినా పౌర్మోఖ్తారి మంత్రి పదవిని దక్కించుకున్నారు. అతి పిన్నవయస్సులోనే పర్యావరణశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టి కొత్త రికార్డు సృష్టించారు.
రోమినా గతంలో లిబరల్ పార్టీ యువజన విభాగానికి అధిపతిగా పనిచేశారు. 2020లో వాతావరణ మార్పులపై పోరాడేందుకు మాంసం పై పన్నును ప్రతిపాదించారు. స్టాక్‌హోమ్ శివార్లలో ఇరాన్ మూలానికి చెందిన కుటుంబంలో రోమినా జన్మించారు. ప్రముఖ పర్యావరణ కార్యకర్త గ్రెటా థన్‌బర్గ్ స్వదేశమైన స్వీడన్‌లో రోమినా పర్యావరణ మంత్రిగా చేస్తున్నారు.
స్వీడన్ నూతన ప్రధానిగా ఎన్నికైన ఉల్ఫ్ క్రిస్టర్‌సన్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో కేబినెట్ సభ్యులు ఆమె పేరును మంత్రి పదవికి ప్రతిపాదించారు. స్వీడన్ డెమొక్రాట్ల తో కలిసి నడిచేందుకు గతంలో పార్టీ నేత క్రిస్టర్‌సన్ తీసుకున్న నిర్ణయాన్ని రోమినా బహిరంగంగానే విమర్శించారు. సొంత పార్టీ నేత అయినప్పటికీ తనదైన శైలిలో ఆమె చురకలంటించారు.
అయినప్పటికీ, తన విమర్శల్ని పాజిటివ్‌గా తీసుకొని తాజాగా తనకు మంత్రిపదవి ఇవ్వడంపై రోమినా హర్షం వ్యక్తం చేశారు. తనను మంత్రివర్గంలోకి తీసుకున్న క్రిస్టర్‌సన్‌కు ఆమె కృతజ్ఞతలు తెలియ జేశారు.
2014 లో స్వీడన్ ప్రభుత్వం లో అప్పర్ సెకండరీ స్కూల్, వయోజన విద్యా శాఖా మంత్రిగా 27 సంవత్సరాల ఐడా హడ్జియాలిక్ అనే మహిళ పనిచేశారు. హడ్జియాలిక్ మద్యం సేవించి డ్రైవింగ్‌లో పట్టుబడటం తో వివాదం తలెత్తింది. దాంతో ఆమె పదవి చేపట్టిన రెండు సంవత్సరాల తర్వాత రాజీనామా చేశారు. ఆమె రికార్డు ను రోమినా అధిగమించారు.