ఆ ఊర్లో అసలు వర్షాలే పడవట !

Sharing is Caring...

No Rain Fall …………………………….

వర్షాలు విపరీతంగా పడే ప్రదేశాల గురించి మనం విని ఉంటాం. అసలు వర్షాలు పడని ఊళ్ళ గురించి విని ఉండం. ఎడారి ప్రాంతాల్లో సహజంగా వర్షాలు పడవు.  మేఘాలయలోని మాసిన్రామ్ గ్రామం లో విపరీతం గా వర్షం పడుతుంది. అత్యధిక సగటు వర్షపాతం ఆధారంగా ఈ గ్రామం ప్రపంచంలోని అత్యంత తడియైన ప్రదేశాల్లో ఒకటిగా నమోదైంది.

గిన్నిస్ బుక్ రికార్డుల ప్రకారం 1985 లో మాసిన్రామ్ లో 26,000 మి.మీ వర్షపాతం నమోదయింది. మాసిన్రామ్ లో రోజూ వర్షం పడుతుంది .. అలాగే చిరపుంజీ లో కూడా. ఈ రెండూ పది కిలోమీటర్ల దూరంలో ఉంటాయి.

ఇక వర్షాలు పడని ప్రదేశాల విషయానికొస్తే …  అల్-హుతైబ్ లో అసలు వర్షాలు అసలు పడవట. దీనికి కారణం ఈ గ్రామం మేఘాల పైన ఉండటమే. ఇది ఈ గ్రామం ప్రత్యేకత. ఈ ఊరు యెమెన్ రాజధాని సనాకు పశ్చిమాన, మనాఖ్ డైరెక్టరేట్  హరాజ్ ప్రాంతంలో ఉంది. పర్యాటకులు ఇక్కడకు ఎక్కువగా వస్తుంటారు. మేఘాలను దగ్గర నుంచి చూసే అవకాశం ఇక్కడ లభిస్తుంది.

ఈ అద్భుత దృశ్యాన్ని చూసేందుకే పర్యాటకులు వెళుతుంటారు. ఇక్కడ పర్వతాల పైభాగంలో చాలా అందమైన ఇళ్ళు నిర్మితమైనాయి. అల్-హుతైబ్ గ్రామం భూమి ఉపరితలం నుండి 3,200 మీటర్ల ఎత్తులో ఉంది. గ్రామం చుట్టూ వాతావరణం చాలా వెచ్చగా ఉంటుంది. శీతాకాలంలో వాతావరణం ఉదయం చాలా చల్లగా ఉన్నప్పటికీ, సూర్యుడు ఉదయించాక క్రమంగా వేడి పెరుగుతుంది. 

అటు గ్రామీణ ఇటు పట్టణ  సంస్కృతులతో ఈ గ్రామం ఇప్పుడు ‘అల్-బోహ్రా లేదా అల్-ముకర్మా’ ప్రజల కోటగా ఉంది. ఇక్కడి ప్రజలను  యెమెని కమ్యూనిటీలు అంటారు.యెమెన్ కమ్యూనిటీ ప్రజలు ముంబైలో నివసించిన ముహమ్మద్ బుర్హానుద్దీన్ నేతృత్వంలోని ఇస్మాయిలీ (ముస్లిం) శాఖ నుండి వచ్చారు. అతగాడు  2014 లో మరణించే వరకు ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి ఈ గ్రామాన్ని సందర్శించేవాడు.

ఇక అక్కడ నిర్మించిన ఇళ్ళు ..మేడలు .. మిద్దెలను చూస్తే అబ్బురపోతాం. అంత ఎత్తున కొండలపైన ఇళ్ళు ఎలా కట్టారా అని ఆశ్చర్యపోతాం. అలాగే అటాకామాలోని చిలీకి ఉత్తరాన ఉన్న అరికాలో వర్షాలు బహుతక్కువ. పెరూ సరిహద్దు నుండి కేవలం 18 కిమీ దూరంలో ఈ అరికా ఉంది, ఇది ప్రపంచంలోనే అతి తక్కువ వర్షపాతం ఉన్నప్రదేశంగా ప్రసిద్ధి చెందింది. 20 వ శతాబ్దం ప్రారంభంలో వరుసగా పదునాలుగు సంవత్సరాలు ఇక్కడ వర్షం పడలేదని అంటారు. అంటార్కిటికాలోని డ్రై వ్యాలీలు సంవత్సరానికి సగటున 0 అంగుళాల వర్షపాతం కలిగి ఉంటాయి. 

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!