Historical Monuments……………………………………….
ఒకనాడు చారిత్రక,ఆధ్యాత్మిక సంపద కు ఆలవాలమైన మోటుపల్లి ఆలయాలు ప్రస్తుతం శిధిలావస్థలో ఉన్నాయి. మోటుపల్లిలో ఉన్న ఆలయాలకు కొన్ని వందల ఏళ్ళ చరిత్ర ఉంది. ఈ ఆలయాలు చాలా కాలం క్రితమే ధ్వంసమైనాయి.
వీరభద్ర స్వామి ఆలయం లో ప్రస్తుతం మూల విరాట్టు విగ్రహం లేదు. విగ్రహానికి బదులుగా ఒక పెద్ద చిత్రపటం కనబడుతుంది. విగ్రహం కింద నిధులున్నాయనే అపోహతో కొందరు దుండగులు విగ్రహాన్నిపెకిలించి వేశారు. ఈ పెకిలింతలో విగ్రహం ధ్వంసమైంది.
అప్పటి నుంచి విగ్రహం లేదు.చిత్రపటానికి మాత్రమే పూజలు చేస్తున్నారు. నైవేద్యం పెడుతున్నారు. ప్రస్తుతం ఈ ఆలయం కేంద్ర పురావస్తు శాఖ ఆధీనంలో ఉంది . ఇద్దరు కేర్ టేకర్స్ ను నియమించారు. వాళ్ళే నిత్య దూప దీప నైవేద్యాలను సమర్పిస్తూ … ఆలయ పరిరక్షణ బాధ్యతలను నిర్వహిస్తుంటారు.
ఆలయ ప్రాంగణంలో కనిపించే మండపంలో ఒకప్పుడు నందీశ్వరుని విగ్రహం ఉండేది. ఇపుడు అది కూడా లేదు. ఈ నంది విగ్రహంలో బంగారు నిధులు ఉన్నాయని దుండగులు దాన్నిఅపహరించి ధ్వంసం చేశారు.తర్వాత విగ్రహం దొరికినప్పటికీ పగిలిన విగ్రహాలు గుళ్లోఉండకూడదు కాబట్టి వీరభద్రుని విగ్రహం తోపాటు నందీశ్వరుని విగ్రహాన్ని హైదరాబాద్ ఆర్కియాలజీ శాఖ లో పదిలపరిచారు. ఆలయం శిధిలావస్థలో ఉండగా ప్రభుత్వం కొన్ని మరమత్తులు చేయించింది.
ప్రస్తుతం మండపం వద్ద ఉన్న పానవట్టం కే పూజలు చేస్తుంటారు. ఈ గుడి వెనుక వైపునుంచి ఒక సొరంగ మార్గం ఉండేదని అంటారు. ఆ మార్గం గుండా పెద గంజాం లోని భావన్నారాయణ స్వామి ఆలయానికి రాణి రుద్రమ దేవి వెళ్లి వచ్చేవారనే చెబుతారు. వీటిలో నిజమెంతో తెలీదు.
ఈ వీరభద్రస్వామి ఆలయానికి కొద్దిదూరంలో పురాతన కోదండ రామాలయం కూడా ఉంది. ఇది కూడా శిధిలావస్థలో ఉంది. ఈ రామాలయంలో ఏడడుగుల నల్లరాతి స్థంభంపై చెక్కబడిన శాసనం ఒకటి ఉన్నది. ఇది విజయనగర రాజుల కాలం నాటి శాసనం. కాలక్రమంలో ఈ మోటుపల్లి దేవస్థానంలో దుండగులు రాత్రివేళల్లో తవ్వకాలు జరిపి అక్కడ ఉన్న బంగారు నాణేలను అపహరించారు. ఈ రామాలయం ప్రాంగణం చాలా పెద్దది.
ఒకప్పుడు గొప్ప నౌకా కేంద్రంగా, బౌద్ధారామంగా, శైవక్షేత్రంగా, చారిత్రక స్థలంగాను విలసిల్లిన ఈ మోటుపల్లి గ్రామానికి వెళ్లటానికి ప్రస్తుతం సరైన రవాణా సౌకర్యం లేదు. ఇక్కడి ఆలయాలు, చారిత్రక సంపదను కాపాడాల్సిన రాష్ట్ర పురావస్తు శాఖ జిల్లా అధికారుల నిర్లక్ష్యం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు.
ఈ ప్రాంత ప్రజాప్రతినిధులు కూడా మోటుపల్లి పరిరక్షణ గురించి పెద్దగా పట్టించుకోలేదు. మోటుపల్లి హెరిటేజ్ సొసైటీ పలు ప్రభుత్వ శాఖల సమన్వయంతో టీటీడీ సహాయ సహకారాలతో శ్రీ కోదండరామ స్వామి ఆలయాన్ని అభివృద్ధి చేయాలనీ ప్రయత్నిస్తోంది.