అక్కడ సముద్రం మన కళ్ళముందే మాయమవుతుంది. కొద్దీ గంటల తర్వాత మళ్ళీ కంటి ముందు కొస్తుంది. ప్రకృతి అద్భుతాలలో ఇది ఒకటి. ఈ మాయా సముద్రం మరెక్కడో కాదు .. మనదేశం లోనే ఉంది. ఈ సముద్రం ఒడిస్సాలోని చండీపూర్లో ఉంది.
మన కళ్ళముందే మాయమయ్యే సముద్ర జలాలు గంటల్లోనే లయబద్దమైన అలలతో కంటి ముందు కొచ్చేస్తాయి. అప్పటి వరకు ఖాళీగా ఉన్న బీచ్ అంతా కదిలే అలలతో కళకళ లాడుతుంది.ఇలాంటి అద్భుతం ఇండియాలో మరో చోట కూడా ఉంది. కానీ వేరే దేశంలో ఎక్కడా ఉన్న దాఖలాలు లేవు.
చండీ పూర్ వెళితే ఈ అద్భుతాన్ని రోజూ చూడవచ్చు. ప్రతి రోజూ అక్కడ సముద్ర జలాలు మాయమవుతుంటాయి. మళ్ళీ ఒడ్డుకు చేరుతుంటాయి. మాయమయ్యే జలాలు దాదాపు 5 కిమీ పైనే వెనక్కి వెళతాయని అంటారు. మళ్ళీ ఒడ్డుకు రావడానికి మరో ఆరేడు గంటల సమయం పడుతుందంటారు.
పగలు ఆ బీచికి వెళితే సముద్రం వెనక్కి వెళ్లడాన్ని .. మళ్ళీ రావడాన్ని కూడా చూడొచ్చు. ఇలా సముద్ర జలాలు వెనక్కి వెళ్లిపోయినపుడు మనకి ఇసుక పర్రలు స్పష్టంగా కనిపిస్తాయి. అలాగే గులకరాళ్లు, శంఖాలు, కూడ కనిపిస్తుంటాయి. సముద్రంలో ఆటు పోటులు సహజం.. ఆటు సమయంలో అలలు సముద్రం లోపలకి వెళతాయి.
పోటు సమయంలో ఒడ్డుకి అలలు వస్తాయి. ఎంతటి ఆటు పోటు లైనా మరీ ఐదు కి.మీ. లోపలకు వెళ్లడమంటే చిత్రమే. ఈ చిత్రం చూడటానికే ఇక్కడికి పర్యాటకులు ఎక్కువగా వస్తుంటారు. చండీపూర్ భువనేశ్వర్ నుండి 200 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న బాలసోర్ స్టేషన్ లో దిగితే సులభంగా చేరుకోవచ్చు.
పౌర్ణమి, అమావాస్య రోజులలో ఆటు పోట్లు ఎక్కువగా ఉంటాయి. ఇలా కనిపించి, అంతలోనే మాయమై పోయే సముద్రాన్ని వీక్షించడానికి నవంబర్ నుండి మార్చి మధ్యలో అక్కడికి వెళితే బాగుంటుంది . అప్పుడు వాతావరణం మరింత ఆహ్లాదంగా ఉంటుంది.తప్పక చూడాల్సిన బీచ్ ల్లో ఇదొకటి అని చెప్పుకోవచ్చు.
—————–KNM