Bharadwaja Rangavajhala……………….
ప్రముఖ రచయిత పింగళి నాగేంద్రరావు ‘పాతాళభైరవి’లో ‘ఎంత ఘాటు ప్రేమయో’ అనే పాట రాశారు…అది దుష్టసమాసమనీ వ్యాకరణరీత్యా తప్పనీ చాలా మంది విమర్శించారు కదా మీరేమంటారు అని ఓ సారి పింగళి నాగేంద్రరావుని ఓ జర్నలిస్టు అడిగారు.
దానికి ఆయన ….ఆ పాట పాడిన తోటరాముడు కాస్త మొరటువాడు. వాడి ప్రేమలో మొరటు దనమే కానీ మృదుత్వం తక్కువ. రాజకుమారికి తోట రాముడిలో ఉన్న ఘాటుతనమే కనిపించి ఎంత ఘాటు ప్రేమయో అని పాడుకున్నది.
అది పాత్రను బట్టి వచ్చిన పాట కాబట్టి ఘాటు శబ్దాన్ని ఉపయోగించాను. పోతే ఘాటు ప్రేమ కొత్త ప్రయోగం. భావం భాషను తన అవసరానికి మూసపోసుకుంటుంది. పోసుకోవాలి. తగిన భావాన్ని అందచేయగలదన్న నమ్మకం వున్నప్పుడు కొత్త ప్రయోగాలు చేయవలసినదే.
భావం ఎప్పుడూ వ్యాకరణానికి బందీ కాకూడదు. రోజులు మారుతూ వస్తున్నాయి. అభిరుచులూ మారుతున్నాయి.అలాగే కవిత్వమూ కవితా ధోరణులూ కూడా మారుతున్నాయి. మారవలసినదే. లేకపోతే పురోగతి ఎక్కడ?
ఈ విధంగానే నేను ‘పెళ్లి చేసి చూడు’లో ‘ఊగించిన ఉర్రూగించిన’ అని రాశాను. నిజానికి ఉర్రూగించిన అన్న శబ్దం లేదు.’ఉర్రూతలూగించిన’ అని ఉండాలి. కానీ సొగసుకోసం ఊపు కోసం ఉర్రూగించిన అని ప్రయోగించాను.అలాగే ‘యుగయుగాలు’గా అన్న తర్వాత ‘జగజగాలు’గా అని ప్రయోగించాను. ఇవన్నీ తప్పులనుకుంటూ కూచుంటే ఎలా?
ఎంత వరకు అవసరమో చూసుకుని కవి కొత్త ప్రయోగాలను చేయవలసినదే …అని పింగళి వారు ఆ జర్నలిస్టుకి వివరించారు.
Tharjani…………….
తెలుగు వారి హృదయాలకు హత్తుకు పోయేలా పాటలు రాసి అలరించిన పింగళి వారు అదే స్థాయిలో సంభాషణలు సమకూర్చడంలో కూడా కొత్త ఒరవడి సృష్టించారు. కొన్నికొత్త పదాలు,నానుడులను పరిచయం చేసి ప్రశంసలు పొందారు.
@ నిజం చెప్పమంటారా? అబద్ధం చెప్పమంటారా?@ సాహసము సేయరా ఢింభకా రాజ కుమారి లభించునురా@మాంత్రికుని ప్రాణం పిట్టలో ఉన్నదిరా ఢింభకా
@ జనం అడిగింది మనం చేయవలెనా? మనం చేసింది జనం చూడవలెనా?
@ జై పాతాళ భైరవి వంటి డైలాగులు బాగా పాపులర్ అయ్యాయి.
మాయా బజార్ లో
@ ఎవరూ పుట్టించకుండా మాటలెలా పుడతాయి?@ ముక్కోపానికి విరుగుడు ముఖస్తుతి ఉందిగా
@ ఉద్దండ పండితులే కానీ మీకు ఉండవలసిన బుద్ధి మాత్రం లేదయా పెళ్లి పెద్దలంటూ శుద్ధమొద్దులు తయారయారు.
@ ఉన్నమాటైనా సరే ప్రభువుల ఎదుట పరులను పొగడరాదు
@ లక్ష శనిల పెట్టు శకుని మామ
@ మరి మన తక్షణ కర్తవ్యం?
@ మనం వరుని పక్షం. బెట్టు చెయ్యాలి. అది బాగులేదు, ఇది బాగులేదు అని – వాళ్లని చిన్నబుచ్చాలి’
@ కంబళీ వద్దు, గింబళీ కావాలి , తల్పం వద్దు గిల్పం కావాలి …
ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సినిమాల్లో పింగళి వారు తన డైలాగ్స్ తో ప్రేక్షకులను అలరించారు. ‘వయిళము’ (తొందరగా, శీఘ్రంగా)హై హైనాయకా, అస్మదీయులు, తస్మదీయులు, దుష్ట చతుష్టయం, గిల్పం, గింబళి,సత్యపీఠం, ప్రియదర్శిని, వీర తాళ్లు వంటి పదజాలం ఆయన కలం నుంచి వచ్చినవే.