లక్ష్మివిలాస్ బ్యాంక్ అప్పుల్లో చిక్కుకుంది. ప్రస్తుతం బ్యాంకు ఆర్ధిక వ్యవహారాలను చక్కదిద్ధేందుకు ఆర్బీఐ రంగంలోకి దిగింది. బ్యాంక్ రోజువారీ వ్యవహారాల నిర్వహణ కోసం ముగ్గురు డైరెక్టర్ల కమిటీ ని వేసింది. మూడురోజుల క్రితం జరిగిన వార్షిక సర్వసభ్య సమావేశంలో బ్యాంక్ ఎండీ , 6 గురు డైరెక్టర్ల ,ఆడిటర్ల నియమాకాలను వాటాదారులు తిరస్కరిం చారు. దీంతో బ్యాంకు ఆలనాపాలనా పట్టించుకునే నాధుడు లేకుండా పోయారు. బ్యాంకును అప్పుల ఊబిలో దించారనే కోపంతో వాటాదారులు వారి నియామకాలను తిరస్కరించినట్టు తెలుస్తోంది. బ్యాంకింగ్ చరిత్రలో ఇలా జరగడం ఇదే ప్రధమం.
బ్యాంకులో పనిచేస్తున్న ఇద్దరు సీనియర్ అధికారులను పోలీసులు అరెస్ట్ చేశారు. రెలిగేర్ ఫిన్వెస్టు కి సంబంధించిన 729 కోట్ల ఫిక్సడ్ డిపాజిట్ల వ్యవహారంలో అవకతవకలు జరిగేయని .. ఆకారణంగా ఆ ఇద్దరినీ అరెస్ట్ చేసి విచారిస్తున్నారని సమాచారం. తమిళనాడు కి చెందిన లక్ష్మి విలాస్ బ్యాంక్ కి 95 ఏళ్ళ చరిత్ర వుంది. దేశవ్యాప్తంగా 560 బ్రాంచీలు ఉన్నాయి. గత పది క్వార్టర్స్ గా బ్యాంకు నష్టాల్లో నడుస్తోంది. అయినప్పటికీ బ్యాంకు గత అయిదేళ్లుగా డివిడెండ్ ఇస్తుండటం విశేషం. ఎస్ ఏం ఈల నుంచి పెద్ద కంపెనీల వరకు రుణాలు ఇవ్వడం మొదలు పెట్టినప్పటినుంచి బ్యాంకు కు కస్టాలు మొదలైనాయి. కొన్ని సంస్థలకు 720 కోట్ల మేరకు రుణాలు ఇవ్వడం బ్యాంకుకి గుదిబండగా మారింది. ఆ రుణాలు వసూలు చేయడంలో బ్యాంకు విఫలమైంది. దాంతోపాటు బ్యాంకు నిరర్ధక ఆస్తులు కూడా పెరిగిపోయాయి. బ్యాంక్ జూన్ 2020 తో ముగిసిన త్రై మాసికంలో 112. 28 నష్టాన్ని ప్రకటించింది.
బ్యాంకు పరిస్థితులను గమనించి సరిగా ఏడాదిక్రితం ఆర్బీఐ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. 2019 మేలో మూలధన అవసరాల నిమిత్తం ఇండియా బుల్స్ హోసింగ్ ఇండియా బుల్స్ కమర్షియల్ క్రెడిట్స్ సంస్థలతో విలీనం కావాలని బ్యాంక్ ప్రతిపాదించింది . దీన్ని ఆర్బీఐ తిరస్కరించింది. ఈ ఏడాది జూన్ లో క్లిక్స్ క్యాపిటల్ ,క్లిక్స్ ఫైనాన్స్ సంస్థలతో విలీనానికి బ్యాంక్ ఒప్పందం కుదుర్చుకుంది.ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో క్లిక్స్ విలీనం కూడా కష్టమనే అభిప్రాయం వ్యక్తమౌతోంది. విలీన ప్రక్రియ కు క్లిక్స్ సంస్థ బ్యాంకు డైరెక్టర్ల హామీ అడుగుతున్నట్టు సమాచారం.
ఇదిలా ఉంటే డిపాజిట్ల భద్రతపై ఖాతాదారులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని బ్యాంకు అధికారులు చెబుతున్నారు. చెల్లింపుల కోసం ఆర్బీఐ పేర్కొన్న నిబంధనల కంటే 162 శాతం నిధులు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. ఖాతాదారులు , బ్యాంకు రుణపత్రాల్లో మదుపు చేసిన ఇన్వెస్టర్లు, ఫిక్సడ్ డిపాజిటుదారుల చెల్లింపులకూ ఇబ్బంది లేదని డైరెక్టర్ల కమిటీ ప్రకటించింది. ప్రస్తుతానికి ఇబ్బంది లేకపోయినా నష్టాలు కొనసాగుతూ ఉంటే బ్యాంక్ భవితవ్యం ప్రశ్నార్థకమవుతుంది.
ఆర్బీఐ ఈ బ్యాంకును ఎలా గట్టెక్కిస్తుందో చూడాలి. బ్యాంక్ షేర్ ప్రస్తుతం రూ.19.60 వద్ద ట్రేడ్ అవుతుంది. ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ఉండటం మంచిది. ఈ బ్యాంకులో తొలి వాటాదారుడు శ్రీ వేంకటేశ్వరుడు. తమిళ నాడు కరూర్ సమీపంలోని దందోని మలై లోని అరుళ్మిగు శ్రీ కల్యాణ వెంకటరమణ స్వామి పేరు మీద అప్పటి ఆలయ ట్రస్ట్ వాటాలు తీసుకుంది.
——— KNMURTHY