కరుణానిధి పూర్వీకులు ఒంగోలు వారే !

Sharing is Caring...

తమిళ రాజకీయాలను అర్ధ శతాబ్దం పాటు శాసించిన  డీఎంకే పార్టీ అధినేత ముత్తువేల్ కరుణానిధి తెలుగువాడే.  ఇది నిజమే.  ఆయన మద్రాస్ ప్రెసిడెన్సీలో తిరువారూర్ జిల్లాలోని తిరుక్కువళైలో పుట్టారు. ముత్తువేలు, అంజు దంపతులకు 1924 జూన్ 3న కరుణానిధి జన్మించారు. తల్లిదండ్రులు ఆయనకు పెట్టిన పేరు దక్షిణా మూర్తి. ఆయన పద్నాలుగేళ్ళ వయసు నుంచి సామాజిక ఉద్యమాల్లో పాల్గొన్నారు. కరుణానిధి పుట్టకమునుపే  వారి పూర్వీకులు ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లా నుంచి తమిళనాడుకి వలస వెళ్లారు. ఈ విషయాలన్నీ కరుణానిధే స్వయంగా ఒంగోలు కి చెందిన  కొంపల్లి బాలకృష్ణ అనే రచయితకు చెప్పారట.  1960లో పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో రచయితల సమావేశం జరిగింది. ఆ సమావేశానికి హాజరైన కరుణానిధికి కొంపల్లి బాలకృష్ణ కి పరిచయం ఏర్పడింది.

ఆ సందర్భంగా కరుణానిధి మాట్లాడుతూ తనకు రెండు తరాల ముందు వారు ఒంగోలులోని చెరువుకొమ్ముపాలెంలో ఉంటూ,  పెళ్లూరు సంస్థానం ఆస్థాన విధ్వాంసులుగా పనిచేశారని చెప్పారట . ఒంగోలు ఎలా ఉందని, తమది ఒంగోలేనని, పరిస్థితులు అనుకూలించక, పూర్వీకులు మద్రాసుకు వలస వెళ్లి స్థిరపడ్డారని కరుణ  ఆ సందర్భంగా బాలకృష్ణతో అన్నారట.  ఆ తర్వాత కరుణానిధి తన పూర్వీకుల గురించి ఎక్కడ మాట్లాడలేదు. అయితే ఈ విషయాన్ని బాలకృష్ణ మాత్రం తన సన్నిహితుల వద్ద, భార్య అరుణ వద్ద ఎన్నోమార్లు చెప్పారు. 2016 ప్రాంతంలో కరుణానిధి మూలాలపై మీడియాలో చర్చ జరిగింది. ఆ సందర్భంగా ఈ విషయాలు బయటకొచ్చాయి. ఇక బాలకృష్ణ ఒంగోలు మంగమ్మ కళాశాల లో లెక్చరర్ గా, ప్రిన్సిపాల్ గా కూడా పని చేశారు. కరుణానిధి మరణించిన సమయంలో బాలకృష్ణ సతీమణి అరుణ మీడియా కు కరుణానిధి పూర్వీకుల విషయాలను వెల్లడించారు. 

———–KNM

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!