జడిపించని ‘జటాధర’ హారర్ మూవీ!!

Sharing is Caring...

Gr.Maharshi………..

ఈ మ‌ధ్య కాలంలో థియేట‌ర్‌కి వెళితే చాలా దెబ్బ‌లు. హాయిగా న‌వ్వుకుందామ‌ని ‘మిత్ర మండ‌లి’కి  వెళితే, ఏకంగా న‌లుగురు వుతికారు. త‌ర్వాత ధైర్యం తెచ్చుకుని’మాస్ జాత‌ర‌’కి పోతే , అదో మందు పాత‌ర‌. గాయ‌ప‌డి , కోలుకుని ‘జ‌టాధ‌ర’ చూస్తే గుండెలు అదిరిపోయాయి. సుధీర్‌బాబు త్రిశూలంతో ఎక్క‌డ‌ప‌డితే అక్క‌డ పొడిచాడు.

ప్రారంభంలో లంకె బిందెలు,పిశాచ‌ బంధ‌నం వివ‌రిస్తే బానే వుంద‌నిపించింది. మ‌న‌ల్నికుర్చీకి క‌ట్టేసి కొట్ట‌డ‌మే పిశాచ బంధ‌న‌మ‌ని తెలిసేస‌రికి ఆల‌స్య‌మైంది. త‌ర్వాత అవ‌స‌రాల శ్రీ‌నివాస్ వ‌చ్చి దెయ్యాల గురించి ఏదో చెప్పాడు. తెలుగే కానీ ఒక్క ముక్క కూడా అర్థం కాలేదు. దెయ్యాల ప‌రిశోధ‌కుడిగా హీరో ఎంట్రీ. ఆయ‌న ద‌గ్గ‌ర దెయ్యాల‌ను గుర్తించే ఏదో మీట‌ర్ కూడా వుంది.

దెయ్యాలున్నచోట ఆ మీట‌ర్‌లోని ముల్లు క‌దులుతుంది. ఈ ఘోష్ట్ మెటీరియ‌ల్‌తో తిరుగుతూ త‌న‌కి దెయ్యాలంటే న‌మ్మ‌కం లేద‌ని అంటూ వుంటాడు. హీరో ప‌క్క‌న ఓ క‌మెడియ‌న్‌. వాళ్లిద్ద‌రు పాత బంగ‌ళాలలో  తిరుగుతూ దెయ్యాల్ని అన్వేషిస్తూ వుంటారు. ప‌నిలో ప‌నిగా ఓ ఐట‌మ్ సాంగ్‌. ఆట‌, పాట రెండూ నాసిర‌కం. 

ఈ గ్యాప్‌లో హీరోయిన్ ఎంట్రీ. ఆమె హీరోకి పెద్ద‌క్క‌య్య‌లా వుంది. స‌రే మ‌నం వ‌చ్చింది హార‌ర్ కోసం, వాళ్ల కెమిస్ట్రీ అన‌వ‌స‌రం. ఆమెకి యాక్టింగ్ రాదు, తెలుగు ఎలాగూ రాదు. క‌నీసం డ‌బ్బింగ్ చెప్పిన వాళ్ల‌కి కూడా తెలుగు రాక‌పోవ‌డం విశేషం.

రుద్రారం అని ఒక గ్రామం వుంటుంది. అక్క‌డ లంకె బిందెలు వుంటాయి. ధ‌న పిశాచి సోనాక్షి సిన్హా కాప‌లా వుంటుంది. ఇది అస‌లు క‌థ‌. పిశాచికి హీరోకి ఏంటి సంబంధ‌మ‌ని ఫ‌స్టాఫ్ మొత్తం ఎదురు చూస్తాం. ఏమీ లేకుండా ఇంట‌ర్వెల్ వేస్తారు. ఎంత పిచ్చి సినిమాకైనా ఇంట‌ర్వెల్ అంటే ఏదో బ్యాంగ్ వుంటుంది. ఇదేం బిగ్ బ్యాంగ్ థియ‌రీ బాస్ అనుకుంటూ బ‌య‌టికి వెళ్లి ఎందుకైనా మంచిద‌ని కాఫీ తాగి వ‌చ్చాను. 

సెకెండాఫ్‌ ప్లాష్‌బ్యాక్ స్టార్ట్ అయ్యింది. లంకె బిందెల కోసం పూజ‌లు. మొద‌ట కోడిని బ‌లిస్తారు. ధ‌న పిశాచి శాంతించ‌దు. త‌ర్వాత మేక‌, దున్న‌పోతు. కుద‌ర్లేదు. ఈ సారి న‌ర‌బ‌లి. అదేదో ముందే చెబితే కోడి, మేక‌, దున్న‌పోతుతో పాటు ప్రేక్ష‌కుడు కూడా బ‌తికేవాడు. ఈ మ‌ధ్య కాలంలో ఇంత సుదీర్ఘ ప్లాష్‌బ్యాక్ చూడ‌లేదు. బ‌హుశా ఎడిట‌ర్ కూడా అల‌సిపోయి నిద్ర‌పోయి వుంటాడు. 

ధ‌న పిశాచిగా సోసాక్షి సిన్హా కాపాడుతుందేమో అని ఆశ ప‌డితే, ఆమె జ్యువెల‌రీ మోడ‌ల్‌లా న‌గ‌లు దిగేసుకుని కిచ‌కిచ‌మ‌ని  విచిత్ర ధ్వ‌నితో న‌వ్వుతూ , చిన్న డ్యాన్స్ కూడా చేసి , ఒక్క డైలాగ్ కూడా లేకుండా నిష్క్ర‌మిస్తుంది. ఇక స్వామీజీగా శుభ‌లేఖ సుధాక‌ర్ సెగ మామూల్ది కాదు. 

గంభీరంగా శివ‌లీల‌, ఎన్ని ర‌కాల లింగాలున్నాయో వాటి వివ‌ర‌ణ‌, ఆల‌య విశిష్ట‌త ఉప‌న్య‌సిస్తూ వుంటాడు. ఫైన‌ల్‌గా ఏం చెబుతాడంటే సోనాక్షికి డ్యాన్స్ వ‌స్తుంది కాబ‌ట్టి , సుధీర్‌బాబు కూడా త్రిశూలం ప‌ట్టుకుని డ్యాన్స్ చేయాలంటాడు. హీరో శివ‌తాండ‌వం చేసి ధ‌న పిశాచిని అంతం చేస్తాడు. చివ‌ర్లో కైలాసంలో ఈశ్వ‌రుడు సాక్ష్యాత్కారం.

దేవుడా అనుకుంటే, మూడు నెల‌ల త‌ర్వాత అని దీనికి సీక్వెల్ ఉన్న‌ట్టు వార్నింగ్ ఇచ్చారు. నిజంగా సాహ‌స‌మే. తీసేవాడికి, చూసేవాడికి కూడా. బ‌య‌ట అంబులెన్స్‌ ఏర్పాటు చేస్తే యూట్యూబ్ వాళ్ల‌కి పండ‌గ‌.

ఈ సినిమాకి ఇద్ద‌రు డైరెక్ట‌ర్లు. ఎంట్రీ ద‌గ్గ‌ర ఒక‌రు, ఎగ్జిట్ ద‌గ్గ‌ర మ‌రొక‌రు నిల‌బ‌డి దుడ్డు క‌ర్ర‌ల‌తో ప్రేక్ష‌కున్ని చావ‌బాద‌డానికి తీసిన‌ట్టున్నారు. ఎన్నోఘోరాతి ఘోరమైన సినిమాలు చూసి త‌ట్టుకున్న గుండెలు మావి. ఈ మ‌ధ్య ‘త‌మ్ముడు’ లాంటి ఉప‌ద్ర‌వాన్ని కూడా భ‌రించి బ‌తికి బ‌ట్ట క‌ట్టిన ప్రేక్ష‌కులం మేము.

ప‌ట్టు వ‌ద‌ల‌ని విక్ర‌మార్కుల్లా ప్ర‌తి శుక్ర‌వారం వ‌చ్చి తీరుతాం. హీరో, ద‌ర్శ‌కుడు, నిర్మాత క‌లిసి మీరు ముగ్గురు. ప్రేక్ష‌కుడు సింగిల్‌గా వ‌స్తాడు. మీ ముప్పేట దాడిని సింహంలా ఎదుర్కొంటాడు. మీకు చేత‌నైతే ఈ ఏడాది ‘జ‌టాధ‌ర‌’ని మించి తీసి చూపించండి.

Sharing is Caring...
Support Tharjani

Leave a Comment!

error: Content is protected !!