Gr Maharshi………
ఈ దీపావళికి 3 సినిమాలొచ్చాయి. ఒక్కటీ పేలలేదు. అన్నీ తుస్సు. వరుసగా మూడు రోజులు చూసి , రెండు రోజులు సిక్ అయ్యాను. థియేటర్ అంటే వాషింగ్ మిషన్ కాదు, ఉతికి ఆరేయడానికి. ఆశ్చర్యం ఏమంటే మూడు సినిమాల్లోనూ గట్టి హీరోలే, విషయం వుంటే సినిమాని మోయగలరు.
మూడింటికి కొత్త డైరెక్టర్లే, ప్రూవ్ చేసుకునే శ్రమ తీసుకోకుండా, తెగిపోయిన చెప్పుల్లో కాళ్లు పెట్టి పరిగెత్తాలని అనుకున్నారు. బొక్క బోర్లా పడి ప్రేక్షకుల్ని నిద్రపుచ్చారు.
మొదటిది … మిత్ర మండలి. ముందురోజే ధైర్యంగా ప్రీమియర్స్ వేశారు. నవ్వినవ్వి ప్రేక్షకులు చచ్చిపోతారనే భయంతో బయట అంబులెన్స్‌లు కూడా పెట్టించారు. నమ్మి లోపలికెళితే కుంభీపాకమే. అరిగిపోయిన డైలాగ్‌లతో , అతినటనతో సినిమా చూపించారు. ప్రియదర్శి మంచి నటుడు. అతనికి వెన్నెల కిషోర్, సత్య, విష్ణు, ప్రసాద్ బెహరా తోడైతే థియేటర్ అదిరిపోవాలి తప్ప బెదిరిపోకూడదు.
కులం పిచ్చి ఉన్న మూర్ఖుడు,వేరే కులపోడి తో కూతురు లేచిపోతే ఏడ్చేస్తాడు! అతనికి తల తిక్క వున్న ఎస్ఐ, ఎందుకు వస్తాడో తెలియని పిచ్చి క్యారెక్టర్ కలిసింది. పంచ్ డైలాగ్‌లు చెబుతూ తిరిగే ఒక మిత్ర బృందం కథ నడిపింది.
అసలు ఈ లైన్‌లోనే బోలెడు కామెడీ వుంది. కాకపోతే డైరెక్టర్ మెదడుని బ్యాంక్ లాకర్‌లో భద్రంగా పెట్టి, పాత సీన్స్ , డైలాగులని మిక్సీలో వేసి కొత్త రకం పేస్ట్ చేసి ఒడ్డించాడు. అజీర్ణంతో ప్రేక్షకుడు ఎగ్జిట్ కోసం వెతికాడు.
రెండోది… ‘ తెలుసు కదా‘ టైటిల్ చూస్తే తెలిసిపోతుంది. తెలుసుకోడానికి ఏమీ లేదని. టిల్లూ సినిమాలతో బ్లాక్ బస్టర్ కొట్టిన సిద్ధూ హీరో. కుర్రాళ్లలో పెద్ద ఫాలోయింగ్ వుంది. మధ్యలో జాక్ అంటూ రా ఏజెంట్‌గా వచ్చి ప్రేక్షకుల్ని ఒక రేంజ్‌లో రక్త గాయాలకి గురి చేసాడు. పాత ఇమేజ్‌ని వదిలించుకోడానికి డీసెంట్‌గా దీపావళికి వచ్చాడు.
ఓపెనింగ్ సీన్‌లోనే హీరో ఒక మంటలో కొన్ని ఫొటోలు, వస్తువులు వేస్తూ బ్రేకప్ గురించి సుదీర్ఘంగా వివరిస్తాడు. అపుడు మనకి తెలియదు, ఫస్ట్ షాట్‌లో కనపడే సెగ , చివరి వరకూ వెంటాడుతుందని. కుర్చీ కింద కుంపటి పెట్టినట్టు బాసూ.
సినిమా 90 శాతం నాలుగే క్యారెక్టర్లు. రెండుమూడు లొకేషన్లలో నాటకంలాగా మాట్లాడుతూనే వుంటారు. కార్తీకదీపం అమ్మ మొగుడు సీరియల్ చూపిస్తారు. ఒక దశలో చిరాకు పుట్టి, మీ బిడ్డ మీ ఇష్టం , కంటే కనండి , మాకెందుకీ నొప్పులని ప్రేక్షకులకి అరవాలనిపిస్తుంది.
ఇలాంటి ట్రయాంగిల్ కథల్లో క్యారెక్టరైజేషన్ బలంగా వుండాలి. అనేక సంఘటనలు , పాత్రలు వచ్చి కథని ఫుష్ చేస్తుండాలి. అప్పుడే కామెడీ కానీ,ఎమోషన్ కానీ, జనరేట్ అవుతుంది. ఈ బేసిక్ రూల్ మరిచిపోయిన దర్శకురాలు దీపావళికి చేతులు కాల్చుకున్నారు.
సూది మొనంత ప్రయోజనం లేకుండా మనుషులు ఏ పనీ చేయని కాలమిది. జబ్బులే డబ్బులుగా భావించి కార్పొరేట్ ఆస్పత్రిలో పని చేసే ఒక డాక్టర్ త్యాగమయిలా బిడ్డని మోయడమే కాకుండా, తమ ఇంట్లోనే వుండాలనే పిచ్చి షరతులకి కూడా ఎందుకు ఒప్పుకుందో రాశీ ఖన్నాకి కనీస అనుమానం కూడా రాదు. ఆమె మెచ్యూర్డ్ విమెన్‌లాగా డబ్బింగ్ డైలాగ్‌లు చెబుతూ వుంటే మనం డబ్బులిచ్చి మరీ వినాలి.
ఇక మూడో టార్చర్ కె-ర్యాంప్. కిరణ్ అబ్బవరం హీరో. స్టామినా, ఎనర్జీ లెవెల్ ఎక్కువ. గొప్ప వంటవాడికి కూడా ఉప్పు ఎంత వేయాలో తెలియాలి. అది మిస్ అయితే ప్రేక్షకుడు జంప్. ఈ మధ్య వచ్చిన తలాతోకా లేని పిచ్చి కథల్లో ఇదొకటి. హీరో లీటర్లు లీటర్లు తాగుతూ వుంటాడు. వాగుతూ వుంటాడు. పడిపోతూ కూడా వుంటాడు.
అయినా అర్ధరాత్రి తాగి రోడ్డు పక్కన పడిపోతే , అదే సమయానికి దీపాల ర్యాలీలో వెళుతున్న హీరోయిన్ చీర సర్దుకోడానికి పక్కకు వచ్చి హీరోని చూసి కరుణతో మనవాడి మందు గబ్బుని కూడా భరించి నోట్లో నోరు పెట్టి గాలి ఊది ప్రాణాలు కాపాడుతుంది. ఈ భూమ్మీద ఇలాంటి దేవతలు కూడా వుంటారా? సినిమాల్లోనే వుంటారు.
మంచితో పాటు ఆ అమ్మాయికి తిక్క కూడా వుంటుంది. టైమ్‌కి రాకపోతే కత్తి తీసుకుని ప్రేక్షకుడికి రెండు పోట్లు, తనకో నాలుగు పోట్లు వేసుకుంటుంది. ఇదేం పిచ్చిరా అని మనం కంగారు పడకుండా పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ అని పేరు కూడా చెబుతారు.
మందులేకపోతే హీరో వుండలేడు. బ్లడ్ కనపడకపోతే ఆ పిల్ల వుండదు. మధ్యలో మనం శ్యాండ్ విచ్. దీనికి తోడు హీరో బిల్డప్‌లు, ఫైట్స్, సాంగ్స్. పనిలో పనిగా హీరోయిన్‌కి లిప్‌కిస్‌లు. ఉన్న బాదుడు చాలదని స్క్రీన్ మీదకి నరేష్ వస్తాడు. ఆయన మంచి నటుడే కాదు, కరెక్ట్ క్యారెక్టర్ పడితే నెక్ట్స్ లెవెల్. రంగస్థలంలో పీక్స్. నరేష్‌కి ఆడవాళ్ల నడుములు గిల్లే పాత్ర ఇచ్చారు. పాపం నరేష్ అనిపించింది.
మూడు సినిమాలు చీదేయడానికి కారణం ఏమంటే వీక్ రైటింగ్. మంచి నటులున్నా వర్కౌట్ కాలేదు. ప్రొడక్షన్, హీరో కాస్ట్యూమ్స్, సాంగ్స్, బీజీఎం , డ్రోన్స్ వీటన్నిటి మీద శ్రద్ధ పెడుతున్నారు కానీ, పెద్దగా ఖర్చు కాని బ్రౌండ్ స్క్రిప్ట్ మరిచిపోతున్నారు.
చికెన్ , బాస్మతి రైస్, మసాలా ఎన్ని ఉన్నా కింద మంట వుండాలి. అపుడే బిర్యాని. సినిమా వుడకాలంటే కథ, కథనం వుండాలి. లేదంటే ప్రేక్షకుడు మాల్‌లోని ఐదో ప్లోర్ నుంచి దూకేసైనా పారిపోతాడు. పండగ పూట ప్రసాదం పెట్టకపోతే పోయారు, కషాయం తాగించకండి.

