ఎమోషనల్ లీగల్ డ్రామా !

Sharing is Caring...

child abuse story ……………………….. 

బాలలపై జరిగే లైంగిక వేధింపుల అంశం పై అల్లిన కథ ఇది.  గార్గి పాత్ర …..  నటి సాయి పల్లవి కోసం సృష్టించినట్టుంది. రోజూ మనం పేపర్లలో చూసే వార్తలనే కథాంశం గా ఎంచుకుని దర్శకుడు గౌతమ్ రామచంద్రన్ అద్భుతంగా తెరకెక్కించాడు.  

మహిళలు, యువతుల పైనే కాదు వృద్ధులు, చిన్న పిల్లలపై కూడా అత్యాచారాలు జరుగుతున్నాయి. అలాంటి సందర్భాల్లో బాధిత కుటుంబ సభ్యులతో  పాటు నిందితుల కుటుంబ సభ్యులు కూడా పడే మానసిక క్షోభ, అవమానాలు  ఎలా ఉంటాయో  దర్శకుడు  కళ్లకు కట్టినట్లు చూపించారు.

కథ .. కథనం ఆసక్తికరంగా నడుస్తాయి. చైల్డ్ అబ్యూజ్ ప్రస్తుతం సాధారణమై పోయింది. బయటకు చెప్పుకుంటే అవమానాలు .. హేళనలు ఉంటాయి. అందుకే ఇలాంటి ఘటనల గురించి బయటకు చెప్పుకోరు. తల్లిదండ్రులు పిల్లలను ఓ కంట గమనిస్తుండాలి. బయట వ్యక్తులు కానీ , కుటుంబ సభ్యులు కానీ అతి చనువుగా వ్యవహరిస్తూ ఇలాంటి నేరాలకు పాల్పడుతుంటారు.

ఈ సినిమాలో కథానాయిక గార్గి కూడా చిన్నతనంలో చైల్డ్ అబ్యూజ్ కి గురైనదే.  ఇలాంటి కేసుల్లో న్యాయం తొందరగా లభించదు. కోర్టుల్లో కేసులు ఏళ్ల తరబడి నడుస్తుంటాయి. లైంగిక నేరాల నుంచి పిల్లలకు  రక్షణ (పోక్సో) చట్టం కింద 2020లో 47,000కు పైగా కేసులు నమోదు కాగా, 2021 చివరి నాటికి 1,70,271 కేసులు విచారణ కాకుండా పెండింగ్‌లో ఉన్నాయని మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ లోక సభలో ఒక ప్రశ్న కు సమాధానం ఇచ్చింది.  

ఇక ఎలక్ట్రానిక్ మీడియా ఇలాంటి కేసుల్లో ఎలా వ్యవహరిస్తుంది? అనే అంశాన్ని కూడా చూపారు. 
సినిమా మొత్తం మీద అశ్లీలత లేకుండా సున్నితమైన అంశాలను చాలా జాగ్రత్తగా దర్శకుడు డీల్‌ చేసాడు.  రేప్ కేసులో  అరెస్ట్‌ అయిన తండ్రిని నిర్ధొషిగా బయటకు తీసుకొచ్చేందుకు ఓ కూతురు పడుతున్న కష్టాన్ని చూపిస్తూనే..మరో పక్క అత్యాచారానికి గురైన చిన్నారి తండ్రి పడే బాధ, మానసిక క్షోభని ప్రేక్షకులను హృదయాలను హత్తుకునేలా చూపించారు.

ఈ సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. అలాగే కోర్టుకు కావల్సినవి ఆధారాలు అంటూ వాటిని కూడా లాజిక్‌ మిస్ కాకుండా చూపారు దర్శకుడు.  ఎక్కడా అతికి పోకుండా .. మసాలా లేకుండా.. కథలో బిగి సడలకుండా .. చివరిలో ఒక ట్విస్ట్ ఇచ్చాడు దర్శకుడు. ముగింపును అలా ఎవరూ ఊహించరు.

సినిమాలో డైలాగులు బాగున్నాయి. “ఆడ పిల్లగా పుట్టావు కదా..ప్రతి రోజు యుద్దమే’  ‘ఆడవాళ్లకు నొప్పి ఎక్కడ ఉంటుందో.. మగాళ్లకు ఎక్కడ పొగరు ఉంటుందో నాకే బాగా తెలుసు’ అని మహిళా జడ్జి అనడం… ‘ఇష్టమొచ్చింది చెప్పడం న్యూస్‌ కాదు.. జరిగింది చెప్పడం న్యూస్‌’అని సాయిపల్లవి చెప్పే డైలాగ్‌ లు ఆకట్టుకుంటాయి. 

సాయి పల్లవి గార్గి పాత్రలో ఒదిగిపోయింది. లాయర్‌ గిరీశం పాత్రలో కాళీ వెంకట్‌ బాగా నటించాడు. ఆ పాత్రకు న్యాయం చేసాడు. అత్యాచారానికి గురైన బాలిక తండ్రిగా కలైమామణి శరవణన్‌,గార్గి తండ్రి పాత్రలో  శివాజీ బాగా చేశారు. మిగతా నటులు తమ పరిధి మేరకు నటించారు. 

ఈ సినిమాకు  గోవింద్ వసంత సమకూర్చిన నేపథ్య సంగీతం హైలెట్ గా నిలుస్తుంది.  సినిమాటోగ్రఫి బాగుంది. ప్రస్తుతం గార్గి సోనీ లైవ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. మసాలా సినిమాలు చూసే వారికి ఈ సీరియస్ సినిమా నచ్చదు. 

—–KNM 

 

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!