ఎటు చూసినా శిధిలాల దిబ్బలే !

Sharing is Caring...

రష్యా చేస్తోన్న యుద్ధం దెబ్బకు ఉక్రెయిన్‌ దేశంలోని నగరాలన్నీ శిథిలాల దిబ్బలుగా మారిపోతున్నాయి. మళ్లీ కోలుకోడానికి కొన్ని దశాబ్దాలు పట్టవచ్చు. లక్షలాది మంది ఉక్రెయిన్‌ చిన్నారుల భవిష్యత్తు ప్రశ్నార్ధకం గా మారింది . యుద్ధం మొదలైనప్పటి నుంచి ఉక్రెయిన్‌ వీడిన వారి సంఖ్య ఇప్పటికే 40 లక్షలు దాటేసింది. ఇక ప్రాణ నష్టం కూడా అపారమే.

వలస పోయిన వారిలో  సగం మంది 18 ఏళ్లు దాటని వాళ్లేనని గణాంకాలు చెబుతున్నాయి. వీరంతా తల్లులతో పాటు పోలండ్, హంగరీ, స్లొవేకియా, మాల్దోవా, రుమేనియా తదితర దేశాలకు వెళ్లిపోయారు. దాదాపు 21 లక్షలమంది పోలండ్ కే వలస వెళ్లారు. కేవలం కొద్దీ మంది మాత్రమే ఎలా గోలా తిప్పలు పడి ఎన్జీవోల సాయంతో విదేశాల్లోని తమ బంధువుల ఇళ్లకు వెళుతున్నారు.

ఇక ఏ దిక్కులేని వారు శరణార్థి శిబిరాల్లోనే బిక్కుబిక్కుమంటూ తలదాచుకుంటున్నారు. స్థానిక ప్రభుత్వాలు, ఎన్జీవోలు అందించే ఆహరం తో ప్రాణాలు కాపాడుకుంటున్నారు. శరణార్థి శిబిరాల్లో ఎవరిని కదిలించినా కన్నీరు మున్నీరు అవుతున్నారు. 

హంగరీకి కూడా 4 లక్షల దాకా శరణార్ధులు చేరుకున్నారు. ఇదివరలో శరణార్థులను అనుమతించని హంగరీ తన మనసు  మార్చుకుని ఉక్రేనియన్లకు ఆశ్రయమిస్తోంది. రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు సన్నిహితుడిగా పేరున్న హంగరీ ప్రధాని విక్టర్‌ అర్బన్‌ కూడా ఈ యుద్ధం జరుగుతున్న తీరుకి చలితులై ఈ నిర్ణయం తీసుకున్నారు.

రాజధాని బుడాపెస్ట్, జహోని, డెబ్రిసెన్‌ లాంటి నగరాల్లోనూ శరణార్థులు పెద్ద సంఖ్యలో ఉన్నారు.  ప్రభుత్వం కంటే ఎన్జీవోలే వీరికి ఎక్కువగా సాయం చేస్తున్నాయి. రష్యా, బెలారస్‌ తరువాత ఉక్రెయిన్‌తో ఎక్కువ సరిహద్దు పంచుకునేది పోలండ్‌ దేశమే. యుద్దం మొదలు కాగానే పోలండ్‌కు భారీగా ప్రజలు తరలి వెళ్లారు. సరిహద్దు నగరం ల్యుబ్లిన్‌తో పాటు రాజధాని వార్సాకు శరణార్థుల తాకిడి  పెరిగింది.

 

శరణార్థులకు పోలిష్‌ నేషనల్‌ ఐడెంటిటీ నంబర్‌ ఇచ్చి ఆర్నెల్ల పాటు తమ దేశంలో ఉండేందుకు అవకాశం ఇచ్చింది. ఈ సమయంలో ప్రయివేట్  ఉద్యోగాలు చేసుకోవచ్చు. ప్రభుత్వం  ఉచితంగా వైద్యం అందిస్తుంది. పిల్లలకు నెలకు 110 యూరోలు సాయంగా ఇస్తుంది.

లక్షన్నరమంది పైగా లబ్ధి పొందినట్టు పోలండ్‌ చెబుతోంది.హంగరీ, రుమేనియా, స్లోవేకియా కూడా శరణార్థుల పట్ల ఉదారంగా వ్యవహరిస్తున్నాయి. శరణార్థులతో పోలండ్‌ పూర్తిగా నిండిపోతోంది. 
ఒక్క వార్సాకే 4 లక్షల మంది దాకా వచ్చినట్టు సమాచారం. నగర జనాభాలో ఇది ఐదో వంతు! వీరిని ఎక్కడుంచాలన్నది కూడా ప్రభుత్వానికి సమస్యగా మారింది.

ముఖ్యంగా రాత్రిళ్లు మైనస్‌ డిగ్రీల చలిలో పిల్లలు, మహిళలు గజ గజ వణికిపోతున్నారు.. స్టేడియాలు, కమ్యూనిటీ హాళ్లతో పాటు పలు ఎన్జీవోలు తమ ఇళ్లను కూడా  ఉక్రేయినియన్ల కోసం కేటాయించాయి. పౌరులు కూడా ఉదారంగా తోచింది తెచ్చి శిబిరాల్లో ఇస్తున్నారు. విద్యార్థులు, యువకులు సోషల్‌ మీడియాలో కమ్యూనిటీగా ఏర్పడి శరణార్ధులకు సాయం చేస్తున్నారు. యుద్ధంఎప్పుడు ఆగినప్పటికీ శరణార్ధుల జీవితాలు ఓ కొలిక్కి రావడానికి ఏళ్ళుపట్టవచ్చు.  యుద్ధం వారి పాలిట శాపం గా మారింది.  

 

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!