చాముండి ఉగ్ర రూప ధారిణి.. శక్తి స్వరూపిణి. అమ్మవారి సప్త మాతృకలలో ఒకరు. దుర్గాదేవి సైన్యమైన 81 మంది తాంత్రిక దేవతలలో యోగిని చాముండి కీలక దేవత అని చెబుతారు. తాంత్రిక ప్రక్రియలో ఉపాసకులు ఎక్కువగా చాముండిని కొలుస్తారు. సప్త మాతృకలలో మిగిలిన వారిని వారి వారి భర్తల శక్తి స్వరూపాలుగా పూజిస్తారు. ఒక్క చాముండిని మాత్రం ప్రత్యేకంగా కొలుస్తారు.
మన దేశంలో ఉన్న చాముండేశ్వరి ఆలయాలలో రెండు ఆలయాలు ప్రత్యేకమైనవి .. వాటిలో మొదటిది హిమాచల్ ప్రదేశ్ లోని కాంగ్రా కు దగ్గరలో ఉన్న పాలంపూర్ లో ఉన్నది.ఇక్కడ దేవిని రుద్ర చాముండి గా కొలుస్తారు. ఇక్కడ చాముండీని గిరిజన దేవతగా భావిస్తారు. జంతు బలులు ఇస్తారు. తాంత్రిక పూజల్లో ఈ దేవిని ప్రార్ధిస్తారు. ఇదే ప్రాంతంలో మరో చాముండి ఆలయం కూడా ఉంది. యాత్రికులు పెద్ద సంఖ్యలో ఈ దేవిని దర్శిస్తుంటారు.
ఇక రెండవ చాముండి ఆలయం కర్ణాటక రాష్ట్రం మైసూరులో ఉన్నది. ఇక్కడ దేవిని చాముండేశ్వరి అని పిలుస్తారు. ఇక్కడ అమ్మవారు మైసూర్ రాజ వంశీకుల కులదేవతగా పూజలందుకుంటున్నది. దసరా ఉత్సవాలు ఇక్కడ వైభవంగా జరుగుతాయి. పెద్ద ఎత్తున భక్తులు వస్తారు.
ప్రచారంలో ఉన్న పురాణ కథనం ప్రకారం పూర్వం మహిషాసురుడు అనే రాక్షసుడు మరణం లేని వరాన్ని కోరుతూ ఘోర తపస్సు చేస్తాడు.. అయితే అది అసాధ్యమని బ్రహ్మ చెప్పగా స్త్రీ తప్ప ఇతరుల చేతిలో మరణం లేని వరం కావాలని అడుగుతాడు మహిషాసురుడు. నాడు బ్రహ్మ ఇచ్చిన వరం ప్రభావంతో ముల్లోకాలను జయించి దేవతలను, ఋషులను నానా ఇబ్బందులు పెడుతుంటాడు. ప్రజాకంటకుడిగా మారిన మహిషాసురుడు సంహరించుటకు ఆ జగన్మాతే చాముండేశ్వరిగా అవతరించి … అతగాడిని సంహారిస్తుంది. ఈ క్రమంలోనే చాముండేశ్వరి ని మహిషాసుర మర్ధినిగా కూడా కొలుస్తారు. ఈ మహిషాసురుడు పాలించిన ప్రాంతం మహిషాసుర పురం గా మారింది. అదే కాలక్రమేణా మైసూరుగా స్థిరపడింది.
చాముండేశ్వరీ ఆలయం అష్టాదశ శక్తి పీఠాలలో నాలుగవది. మైసూర్ పట్టణానికి సుమారు 13 కి.మీ.లో చాముండీ పర్వతం పై ఈ అమ్మవారు కొలువై ఉన్నారు. ఈ పర్వతం సతీదేవి దివ్యాభరణాలు పడిన ప్రదేశంగా కూడా ప్రసిద్ధి గాంచింది. మార్కండేయ పురాణంలో చాముండి దేవి అవతారాల గురించి ప్రస్తావించారు. పురాణ కథనాల ప్రకారం కాళికాదేవి చండ, ముండలను సంహరించి ”చాముండి”గా ప్రసిద్ధి గాంచింది.
అందుకే ఈమెను కాళికాదేవి కి దగ్గరగా పోలుస్తారు.. కొన్నిచోట్ల పార్వతి దేవిగా కూడా కొలుస్తారు. చాముండి అమ్మవారు త్రిశూలం, ఖడ్గ ధారిణియై ఉంటుంది.. అమ్మవారి వాహనం గుడ్లగూబ అంటారు. ఈమె శ్మశాన వాసి.. అందుకేనేమో ఈ అమ్మవారికి జంతుబలి ఇచ్చి, మద్యంతో నైవేద్యాన్ని నివేదిస్తారు.. తాంత్రిక విద్యలు సిద్దించేందుకు ఈ అమ్మవారిని ఎక్కువగా ఆరాధిస్తారు.దేశ వ్యాప్తంగా మరెన్నో చాముండి దేవాలయాలు ఉన్నాయి.