శోభన్ కెరీర్లో పెద్ద హిట్ ఇదేనా ?

Sharing is Caring...

Subramanyam Dogiparthi  ………………………….  Mass entertainer

అక్కినేనికి దసరాబుల్లోడు లాగా ,ఎన్టీఆర్ కు అడవిరాముడు లాగా, శోభన్ బాబుకు సోగ్గాడు . Super duper mass ఎంటర్టైనర్. శోభన్ బాబు కెరీర్లో ఓ పేద్ద హిట్. ఈ సోగ్గాడు సినిమా టెక్నికల్ గా 1975 లో వచ్చింది . డిసెంబర్ 19 న రిలీజయింది.ఆడిందంతా 1976 లోనే . అందువలనే 1976 సినిమాలలో ఒక సినిమాగా దీని సమాచారాన్ని పంచుకుంటున్నాను.

వాస్తవానికి అడవిరాముడు ఈ సినిమా తర్వాత వచ్చింది కాబట్టి కంపేర్ చేయకూడదు.ఎందుకు కంపేర్ చేసానంటే రెండు సినిమాలు రికార్డులు సృష్టించాయి.ఇద్దరు హీరోయిన్లు,రెండింటిలోనూ హీరోలు చాలా ఎనర్జిటిక్ గా దుమ్ము దులిపారు. ఈ సినిమా విజయానికి కారణం బాలమురుగన్ కధ , దర్శకుడు బాపయ్య స్క్రీన్ ప్లే , మోదుకూరి జాన్సన్ డైలాగులు. అన్నీ చాలా బిర్రుగా ఉన్నాయి.

మరో ప్రధాన కారణం కె వి మహదేవన్ సంగీత బాణీలు..ఇరగ్గొట్టేసాడు . ఏడూ కొండలవాడా వెంకటేశా ఓరయ్యా ఎంత పనీ చేసావు తిరుమలేశా , ఒలె ఒలె ఓలమ్మీ ఉఫ్ఫంటేనే ఉలిక్కిపడ్డావు రెండు పాటలు శోభన్ బాబు-జయచిత్రల మీద షూట్ చేసారు. రెండూ చాలా హుషారుగా ఉంటాయి . జయసుధతో కూడా రెండు పాటలున్నాయి . అవ్వ బువ్వా కావాలంటే అయ్యేదేనా అబ్బాయీ , చలి వేస్తుంది చంపేస్తుంది కొరికేస్తుంది పాటలు చాలా బాగుంటాయి .

ఎంతగా పాపులర్ అయ్యాయంటే ఈరోజుకీ 48 ఎళ్ళ తర్వాత కూడా జంటలు పాడుకుంటూ హుషారవుతుంటారు. ప్రత్యేకంగా మెచ్చుకోవలసింది సోగ్గాడు లేచాడు చూసి చూసి నీ దుమ్ము దులుపుతాడు గ్రూప్ డాన్స్ . రామానాయుడు మార్క్ గ్రూప్ డాన్స్ . దసరాబుల్లోడులో ఊరు ఊరంతా పాల్గొనే గ్రూప్ డాన్సులాగా , ఈ గ్రూప్ డాన్స్ కూడా అదరగొట్టేసింది.

నృత్య దర్శకుడు హీరాలాల్ కష్టాన్ని తప్పక మెచ్చుకోవాలి.కష్టం ఫలించింది.మంజు భార్గవి , జయసుధ, జయచిత్ర ముగ్గురితో శోభన్ బాబు డాన్స్ దసరాబుల్లోడు అక్కినేనిని గుర్తుకు తెస్తుంది . అలనాటి హీరోయిన్ అమ్మాజీ కూతురు జయచిత్రకు మొదటి తెలుగు సినిమా . అయినా బాగా నటించింది.  లక్షణరేఖ , జ్యోతి సినిమాలతో పాపులరయిన జయసుధ ఈ సినిమాతో స్టారయింది .

ఈ ముగ్గురితో పాటు సత్యనారాయణ , శాంతకుమారి , గుమ్మడి , అంజలీదేవి , అల్లు రామలింగయ్య , గిరిబాబు , రాజబాబు , పద్మనాభం , నాగేష్ , రమాప్రభ , ఝాన్సీ ప్రభృతులు నటించారు . ఈ సినిమా మొత్తంలో నాకు నచ్చని ఒక సన్నివేశం , అందులోని ద్వందార్ధ డైలాగులు పద్మనాభం-రమాప్రభలవి . ఇంత చక్కని సినిమాలో ఇంత చెత్త ద్వందార్ధ డైలాగులు పెట్టకుండా ఉంటే బాగుండేదని నేనెప్పుడూ అనుకుంటూ ఉంటాను.

అన్ని సినిమాలలో లాగానే రామానాయుడు ఈ సినిమాలో కూడా తళుక్కుమన్నారు . తనతోపాటు టి సుబ్బరామిరెడ్డిని కూడా తళుక్కుమనిపించారు .దసరాబుల్లోడులో అక్కినేని స్పోర్ట్స్ కారు లాగానే ఈ సోగ్గాడు సినిమాలో శోభన్ బాబుకు అందంగా తయారు చేసిన ఎద్దు బండి బాగుంటుంది. నిర్మాత రామానాయుడు ఔట్ డోర్ షూటింగులన్నీ ఆయన స్వంత ఊరు కారంచేడులో , కోలవెన్ను , ఈడ్పుగల్లులలో చేసారు . ఆ గ్రూప్ డాన్స్ బహుశా కారంచేడులో ఏమయినా చేసారేమో !

బాపయ్య దర్శకత్వంలోనే రామానాయుడు హిందీలో కూడా దిల్దార్ టైటిల్ తో రీమేక్ చేసారు. రేఖ , జితేంద్ర నజ్నీన్ నటించారు. రామానాయుడు అదృష్టవంతుడు కదా ! అక్కడా డబ్బులు బాగానే వచ్చాయి . ఈ సినిమాలో కబడ్డీ పోటీలను పెట్టడం గ్రామీణ ప్రేక్షకులకు బాగా నచ్చింది.

రిలీజయిన 31 కేంద్రాలలో యాభై రోజులు ఆడింది . విజయనగరం , విశాఖపట్టణం , అనకాపల్లి రాజమహేంద్రవరం , కాకినాడ , ఏలూరు , భీమవరం , తణుకు , విజయవాడ , బందరు , గుంటూరు , ఒంగోలు , చీరాల , నెల్లూరు , కర్నూలు , హైదరాబాద్ , వరంగల్ కేంద్రాలలో వంద రోజులు ఆడింది.

విజయవాడలో జరిగిన శత దినోత్సవానికి శివాజీ గణేశన్ ముఖ్య అతిధిగా వచ్చారు .ఈ సినిమా వచ్చేటప్పటికి నేనింకా గుంటూరులో కాపురం పెట్టలేదు . మా నరసరావుపేట సత్యనారాయణ టాకీసులో చూసా . ఓ మూడు నాలుగు సార్లు చూసి ఉంటా .

టివిలో వచ్చినప్పుడల్లా కాసేపు చూస్తుంటా . నేను జయసుధ అభిమానిని . మాతరంలో చూడనివారు ఎవరూ ఉండరు . ఇప్పటి తరంలో ఒకరూ అరా ఉంటే తప్పక చూడండి . యూట్యూబులో ఉంది . ముఖ్యంగా పాటల వీడియోని అస్సలు మిస్ కావద్దు . గొప్ప వినోదాత్మక ఊర మాస్ సినిమా . చూసేయండి .

Sharing is Caring...
Support Tharjani

Leave a Comment!

error: Content is protected !!