Capital of Black Magic ……………………
మాయలకు, మంత్రాలకు, క్షుద్ర పూజలకు ..తాంత్రిక శక్తులకు మన దేశం ప్రసిద్ధి గాంచింది. అయితే ఇపుడు వాటిని అనుసరిస్తున్నవారు,ఆచరిస్తున్నవారు బహు తక్కువే. ఒకప్పుడు అస్సాంలోని ‘మయాంగ్’ గ్రామం మంత్ర విద్యలకు,మాయాజాలాలకు పుట్టినిల్లుగా విలసిల్లిందని అంటారు.
ఈ గ్రామానికి సుదీర్ఘ చరిత్ర ఉంది.’మయాంగ్’ ను “క్షుద్ర భూమి”అని “భారతదేశపు మాయాజాల రాజధాని” అని పిలిచేవారు. పూర్వం ఈ గ్రామం తాంత్రిక అధ్యయనాలు, క్షుద్ర శాస్త్రాలకు కేంద్రంగా ఉండేదని అంటారు. అక్కడి తవ్వకాల్లో నరబలికి ఉపయోగించిన కత్తులు, ఇతర పదునైన ఆయుధాలు బయటపడ్డాయి.
ఈ గ్రామాన్ని 1624 ADలో సున్యత్ సింఘా ఏర్పాటు చేసాడని చెబుతారు. మయాంగ్ కు ఇప్పటికీ ఒక సాంప్రదాయ రాజు ఉన్నాడు. గిరిజన తెగలు ఇక్కడ ఉంటారు. ఈ గ్రామంలో ఒకప్పుడు మాంత్రికులు ఎక్కువగా ఉండేవారు. వీరిని ‘ఓజా లేదా బెజ్’ అని పిలిచేవారట. అప్పట్లో తప్పనిసరిగా ఇంటికొకరు క్షుద్ర విద్యలను నేర్చుకుని ఉండేవారట.
ఇతరులను స్వస్థత పరచడానికి ఉపయోగించే మంత్రాన్ని మంచి తంత్రం లేదా సుమంత్రం అంటారు.ఇతరులకు హాని కలిగించడానికి ఉపయోగించే మాయాజాలాన్ని దుష్ట తంత్రం లేదా కుమంత్రం అంటారు. ఇక్కడ ఆ రెండూ జరిగేవని అంటారు.
మనుషులు గాలిలోకి అదృశ్యమవడం, మనుషులు జంతువులుగా మారడం లేదా జంతువులను మాయాజాలంతో మచ్చిక చేసుకోవడం వంటి అనేక కథలు మయాంగ్ తో ముడిపడి ఉన్నాయి. కొన్నితరాల క్రితం మాయలు,మంత్రాలను విరివిగా ఉపయోగించేవారట. చేతబడులు,బాణావతి ..క్షుద్రపూజలు,బలులు జరిగేవట.
కొన్ని వందల ఏళ్ళ క్రితం నుంచి మంత్రవిద్యలు ఆ గ్రామస్తులకు వారసత్వంగా సంక్రమించేవని అంటారు. మయాంగ్ గ్రామ చరిత్ర విషయానికొస్తే.. ఇది ఒకప్పుడు శక్తివంతమైన అహోం రాజ్యంలో భాగంగా ఉండేది.
బ్రహ్మపుత్ర లోయ (ప్రస్తుత అస్సాం)లో మధ్యయుగ కాలం నాటి రాజ్యమైన అహోం రాజ్యాన్ని 1228లో మోంగ్ మావో చైనా నుండి వచ్చిన తాయి యువరాజు సుకఫా స్థాపించాడు.ఆ ప్రాంతం అహోం పాలనలోనే ఉంది.
19వ శతాబ్దంలో మయాంగ్ గ్రామం బ్రిటిష్ వలస పాలనలోకి వచ్చింది. స్థానిక సంప్రదాయాలు, నమ్మకాలను అణచివేయడానికి బ్రిటిష్ వారు ప్రయత్నించారు. కానీ గ్రామస్తులు వారి సాంస్కృతిక వారసత్వాన్ని చాలా వరకు కాపాడుకోగలిగారు.
మయాంగ్ గ్రామం మాయాజాలం మూలాలు అస్పష్టంగా ఉన్నాయి. కొందరు ఇది పాత గిరిజన ఆచారాల నుండి వచ్చిందని చెబుతారు, మరికొందరు ఇది బయటి వ్యక్తులచే ప్రభావితమైందని భావిస్తారు. గ్రామంలోని కొన్ని కుటుంబాలకు రహస్య జ్ఞానం,మంత్ర శక్తులు ఉన్నాయని నమ్ముతారు. ఈ కారణంగానే మయాంగ్‌కు తరతరాలుగా మర్మమైన ఖ్యాతి లభిస్తున్నదని అంటారు.
మహాభారతంలో మయాంగ్ ప్రస్తావన ఉందని కూడా కథలు ఉన్నాయి, ఘటోత్కచుడు ఇక్కడే తన శక్తులను పొందాడని అంటారు. మొఘల్ రాజు ముహమ్మద్ షా సైన్యం మొత్తం 1330 ప్రాంతంలో అడవుల్లో అదృశ్యమైంది. ఎంతమంది శోధించినప్పటికీ, లక్ష మంది సైనికుల జాడ దొరకలేదని అంటారు.
ఈ గ్రామానికి ఉన్న చారిత్రిక ప్రాధాన్యతను బట్టి ఇపుడు ఇదొక పర్యాటక కేంద్రంగా మారింది.ఈ గ్రామంలో పురావస్తు శిథిలాలు, సమీపములో వన్యప్రాణుల అభయారణ్యం చూడదగినవి. మయాంగ్ సెంట్రల్ మ్యూజియం, ఎంపోరియం ను చూసేందుకు పర్యాటకులు ఎక్కువగా వస్తుంటారు.
ఆయుర్వేదం, తంత్ర క్రియలపై పుస్తకాలు ఈ మ్యూజియం లో ఉన్నాయి. మయాంగ్ మోరిగావ్ జిల్లాలోని ఒక చిన్న గ్రామం. ఇది గౌహతి నుండి 40 కి.మీ దూరంలో బ్రహ్మపుత్ర నది ఒడ్డున ఉంది.ఇపుడు అక్కడ మాంత్రికులు ఎవరూ లేరు. మయాంగ్ అనే పేరు సంస్కృత పదం మాయ నుండి వచ్చింది, దీని అర్థం భ్రమ లేదా ఉపాయం..
——--KNM