Sai Vamshi……………….
‘మణిచిత్రతాళు’ సినిమా చూశారా? అదేనండీ … ‘చంద్రముఖి’. ఆ.. గుర్తొచ్చిందా? కన్నడలో ‘ఆప్తమిత్ర’, తెలుగు, తమిళంలో ‘చంద్రముఖి’, హిందీలో ‘బూల్ బులైయా’ సినిమాలకు ఒరిజినల్ వెర్షన్ ఎక్కుడుంద్రా అంటే మలయాళంలో. పేరు ‘మణిచిత్రతాళు’.
1993లో విడుదలైంది. ఇప్పుడు మనం చాలా అభిమానిస్తున్న ఫాహద్ ఫాజిల్ తండ్రి ఫాజిల్ దానికి డైరెక్టర్. ముట్టం మధు కథ అందించారు. తెర వెనుక వాళ్లిద్దరూ, తెర మీద నటి శోభన, హీరోలు మోహన్‌లాల్, సురేష్ గోపి కలిసి చేసిన మ్యాజిక్ ‘మణిచిత్రతాళు’. భారతీయ సినిమాల్లో క్లాసిక్‌గా మిగిలింది.
ఒక పురాతన బంగ్లా. అందులో దెయ్యాలున్నాయన్న పుకారు. అక్కడికో జంట రావడం, ఆ తర్వాత రకరకాల పరిణామాలు జరగడం, చివరకు వాటి చిక్కుముడులు వీడటం, దీని వెనుక సైకలాజికల్ కోణం ఉండటం..చాలా ఆసక్తికరమైన కథ. ఇప్పటికి ఐదు భాషల్లో ఈ సినిమా తీస్తే అన్ని చోట్లా పెద్ద హిట్.
అయితే ఇది నిజంగా డైరెక్టర్ ఫాజిల్, రచయిత ముట్టం మధు కలిసి రాసుకున్న కథేనా? ఇప్పటికీ ఇది చాలామందికి సందేహం. అందుకు కారణం ఉంది. ఆ కారణం పేరు ‘విజనవీధి’. అదొక మలయాళ నవల. అసలేంటి ఆ నవల? ఏంటా కథ?
‘కుంకుమం’ అని మలయాళంలో చాలా ప్రఖ్యాతి పొందిన సాహిత్య పత్రిక ఉంది. అందులో 1985లో అశ్వతి తిరునాల్ అనే రచయిత రాసిన ‘విజనవీధి’ అనే సీరియల్ ప్రచురితమైంది. ‘అశ్వతి తిరునాల్’ అనేది ఆయన కలం పేరు. అప్పటికి అతనికి పాతికేళ్లుండొచ్చు. ‘విజనవీధి’ అంటే ‘నిర్మానుష్యమైన వీధి’. అది హర్రర్ జానర్ లో సాగే సీరియల్.
ఆ రోజుల్లో ఆ సీరియల్ చాలా ఫేమస్. కొందరు ఆ సీరియల్ చదవడం కోసమే ఆ పత్రికను కొనేవారు. అప్పటి పాఠకుల్లో కొందరికి నేటికీ ఆ సీరియల్ గుర్తుంది. కథేంటి? గౌరి అనే అమ్మాయి ‘సుభద్ర’ అనే ఓ చారిత్రక పాత్రతో తనను తాను ఐడెంటిఫై చేసుకుంటుంది. ఆమె చుట్టూ రకరకాల అతీతమైన అంశాలు జరుగుతూ ఉంటాయి. విజయానంద్ అనే సైక్రియాట్రిస్ట్ వచ్చి స్వామి సత్యచిత్తన్ అనే సన్యాసి సాయంతో ఈ సమస్యను పరిష్కరిస్తాడు.
1987లో నాగకృష్ణ పబ్లికేషన్స్ ఈ సీరియల్‌ని నవలగా ప్రచురించారు. అయితే సీరియల్ సాధించినంత పాపులారిటీ నవల సాధించలేకపోయింది. కొన్ని వందల కాపీలు మాత్రమే అమ్ముడుపోయింది. ఆ తర్వాత కొంత కాలానికి అశ్వతి తిరునాల్ సన్యాసం తీసుకొని, స్వామి అశ్వతి తిరునాల్గా మారారు. దాంతో ‘విజనవీధి’ నవల కథ అక్కడితో ముగిసిపోయింది.
ఆ తర్వాత 1993లో మలయాళంలోనే ‘మణిచిత్రతాళు’ సినిమా వచ్చింది. నవలలోని గౌరి కాస్తా సినిమాలో గంగ అయ్యింది. చాలా వరకు కథ ఒకేలా ఉంది. కొన్ని సీన్లు కూడా సీరియల్లో ఉన్నట్లే తెరపైన కనిపించాయి. దీంతో ఆ సీరియల్ ఆధారంగానే సినిమా తీశారని చాలామంది అనుకున్నారు.
అయితే ఈ వాదనని అటు డైరెక్టర్ ఫాజిల్, ఇటు రచయిత ముట్టం మధు ఇద్దరూ ఖండించారు.
ఈ సినిమాకు ఆ సీరియల్‌కీ ఏమాత్రం సంబంధం లేదన్నారు. ఇది తాను స్వయంగా రాసుకున్న కథ అని ముట్టం మధు చెప్పారు. అది నిజమే అయినా, ‘మణిచిత్రతాళు’ సినిమాకు స్ఫూర్తి మాత్రం ‘విజనవీధి’ సీరియలే అని ఇప్పటికి చాలామంది నమ్ముతున్నారు. సీరియల్ రాసిన స్వామి అశ్వతి తిరునాల్ కూడా ఓసారి ఈ విషయం గురించి మాట్లాడుతూ ‘నా సీరియల్‌కీ ఆ సినిమాకీ కొన్ని పోలికలున్నాయి’ అన్నారు.
ఈ నవల చదవాలని చాలామంది అనుకున్నా కాపీలు చాలాకాలం పాటు దొరకలేదు. దాంతో ఈ కాంట్రవర్సీని దాదాపు అందరూ మర్చిపోయారు. 2022లో మళ్లీ ఈ నవలను మళ్లీ ప్రచురించి పాఠకులకు అందుబాటులోకి తెచ్చారు. ఆ నవల చదివిన పాఠకులు కొందరు ‘మణిచిత్రతాళు సినిమా కథ ఇదే. ఈ నవల చదివే ఆ సినిమా తీశారు’ అని నేటికీ గట్టిగా వాదిస్తున్నారు.