మహిళలు పార్టీ పెట్టి నడపడం లేదా పార్టీకి వారసులుగా వచ్చి ఆ పార్టీని ముందుకు నడిపించడం అంత సులభమైన విషయం కాదు. మన దేశంలో ఇందిరా గాంధీ , సోనియా గాంధీ, మాయావతి, మమతా బెనర్జీ , జయలలిత వంటి నేతలు అలాంటి సాహస యత్నం చేసి సక్సెస్ అయ్యారు. వీరిలో మమతా బెనర్జీ ఒక్కరే సొంతంగా పార్టీ పెట్టగా మిగిలిన వారు వారసత్వంగా పార్టీని ముందుకు నడిపించారు. మణిపూర్ లో ఇరోమ్ చాను షర్మిల హక్కుల కార్యకర్త గా 16 ఏళ్ళు ఉద్యమం చేసి సొంత పార్టీ పెట్టి ఎన్నికల్లో పోటీ చేసి దారుణంగా ఓడిపోయారు. అలాగే పార్టీ అండతో ఎదిగిన మహిళా నేతలు కూడా ఉన్నారు.
ఇక తెలంగాణా లో రాజకీయ అరంగేట్రం చేసి ఒక నాయకురాలిగా ఎదగడానికి దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి తనయురాలు, ఏపీ సీఎం జగన్ సోదరి వైఎస్ షర్మిల ఇవాళ సంకల్పం చెప్పబోతున్నారు. షర్మిల రాజకీయాలకు కొత్తేమి కాదు. ప్రజలకు అపరిచితురాలు కాదు. 2012లో జగన్ జైలుకి వెళ్ళినపుడు షర్మిల 3,112 కి.మీ. సుదీర్ఘ పాదయాత్ర చేసి రికార్డు సృష్టించారు. వైసీపీ ఉనికిని కాపాడటం కోసం నాడు షర్మిల చేసిన యాత్ర పార్టీకి బాగా ఉపయోగ పడింది. తర్వాత కాలంలో జగన్ కి అనుకూలంగా ఎన్నో ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొని తన సత్తా చాటుకున్నారు. తనకంటూ ఒక ఇమేజ్ ను సృష్టించుకున్నారు. దానితో పాటు తండ్రి వైఎస్ ఇమేజ్ ను కలుపుకుని ఇవాళ రాజకీయ అరంగేట్రం చేస్తున్నారు.
తెలంగాణ లో అధికార పార్టీని, ఇతర పార్టీలను ఎదుర్కొనడం అంటే కొండలను ఢీ కొనడమే. ఆమాటే షర్మిల కూడా ఒక సందర్భంగా చెప్పారు. అంటే తన బలం ఏమిటో ? ప్రత్యర్థుల బలం ఏమిటో స్పష్టంగా తెలుసుకునే ఆమె వ్యూహాత్మకంగా ముందడుగు వేస్తున్నారని చెప్పుకోవాలి. దీన్ని సాహసంగానే పరిగణించాలి. పార్టీ పెట్టిన దరిమిలా షర్మిల రాజకీయంగా తెలంగాణ లో ఇతర పార్టీల నేతలను కూడా మరింత ధైర్యంగా విమర్శించాలి. అలాగే అన్న జగన్ ను కూడా విధానాల పరంగా విమర్శించాల్సిన పరిస్థితులు ఎదురవుతాయి. రెండు రాష్ట్రాల మధ్య కొన్ని సమస్యలున్నాయి. ముఖ్యంగా నీటి వివాదాలు. ప్రాజెక్టుల విషయమై గొడవలు అవుతూనే ఉన్నాయి. వాటి గురించి కుండబద్దలు గొట్టినట్టు మాట్లాడాలి. తెలంగాణ తరపున మాట్లాడాలి. అవసరమైతే కొట్లాడాలి. అంతే కానీ తిట్టితిట్టనట్టుగా వ్యవహరిస్తే విమర్శలు ఎదురుకోవాల్సి వస్తుంది.
ఇవాళ్టి సభతో షర్మిల అజెండా ఏమిటో అందరికి అర్ధం కావచ్చు.ఇప్పటివరకు పెద్దగా పేరున్న నేతలు ఎవరూ షర్మిల పార్టీలో చేరలేదు. ఇక నుంచి చేరికలు మొదలు కావచ్చు. పార్టీ ప్రకటన వచ్చాక విమర్శల జోరు కూడా పెరగవచ్చు. ఇన్నాళ్లు చూసి చూడనట్టు వ్యవహరించిన పార్టీలు ఇకపై రాజకీయ దాడులకు పూనుకోవచ్చు. వాటన్నంటిని ఎదుర్కొంటూ నిర్మాణాత్మక విధానాలతో పార్టీని పటిష్ష్టం చేసుకుంటూ వెళితే ఏదో ఒక రోజుకి షర్మిల సంకల్పం నెరవేరుతుంది. వైఎస్ రాజకీయ సంకల్పం 25 ఏళ్లకు నెరవేరితే , జగన్ కి పదేళ్లు పట్టింది. ఏదైనా సుదీర్ఘ కాలం ప్రజల తరపున సమస్యల పరిష్కారం కోసం పోరాడితేనే ఫలితాలు ఉంటాయి.
—————- K.N.MURTHY