Living alone in a deserted place ………………..
పై ఫొటోలో కనిపించే వ్యక్తి పేరు బిల్లీ బార్. న్యూ జెర్సీ కి చెందినవాడు. వయసు 66 వరకు ఉండొచ్చు. ఎవరూ లేని నిర్జన ప్రదేశం లో 46 ఏళ్లుగా జీవిస్తున్నాడు. ఒంటరి తనమంటేనే భయంకరం .. అందులో నిర్జన ప్రదేశంలో ఒంటరిగా అంటే ఇక చెప్పనక్కర్లేదు. మరో వైపు ఎటు చూసినా మంచు పర్వతాలు. ఎముకలు కొరికే చలి.
అలాంటి ప్రదేశంలోకి వెళ్ళాలంటేనే వణుకు పుడుతుంది ఎవరికైనా. అలాంటి ప్రదేశంలో ఈ బిల్లీ జీవిస్తున్నాడు.. ఎవరూ తోడు లేకుండా. పలకరించే మనిషి కూడా లేకపోవడంతో అక్కడి ప్రకృతిని వీడియో తీస్తూ గడిపేస్తున్నాడు. అతడి ఒంటరి జీవితం, అతడు తీసిన వీడియోలు.. ఇప్పుడు గ్లోబల్ వార్మింగ్ పరిస్థితులకు అద్దం పడుతూ చేస్తున్న పరిశోధనలకు ఉపయోగపడుతున్నాయి.
ఆ మధ్య కొందరు పరిశోధకులు అక్కడికి వెళ్లి ఇతగాడిపై ఓ వీడియో తీసి విడుదల జేశారు. ఎన్విరాన్ మెంటల్ సైన్స్ చదివిన బిల్లీ బార్ 1972లో వాటర్ కెమిస్ట్రీ పరిశోధన నిమిత్తం రాకీ మంచు పర్వత ప్రాంతమైన కొలరాడోలోని గొతిక్ పట్టణానికి వెళ్ళాడు. ఆ పట్టణంలో 1920 నుంచి జనం ఎవరు నివశించడం లేదు.
దీంతో గొతిక్ పట్టణానికి ‘దెయ్యాల ఊరు’ అనే పేరు స్థిర పడిపోయింది. బిల్లీ బృందం ఆ పట్టణంలో పరిశోధనలు జరిపి తిరిగి న్యూజెర్సీ వచ్చింది.అయితే బిల్లీకి ఆ గొతిక్ పట్టణం బాగా నచ్చింది. ఒంటరిగా.. ఏ తోడూ లేకుండా… నరమానవుల సంచారం లేకపోయినా సరే తను మాత్రం అక్కడే జీవించాలని నిర్ణయించుకున్నాడు.
ఆ ఆలోచన రావడమే ఆలస్యం.. మూటా ముల్లె సర్దుకుని గొతిక్ పట్టణానికి చేరుకున్నాడు. దట్టంగా మంచు కురిసే ఆ ప్రాంతంలో చిన్న టెంట్ ఏర్పాటు చేసుకున్నాడు. అక్కడ ఎముకలు కొరికే చలిలో కొన్ని గంటలు ఉంటే మృత్యువాత పడడం ఖాయం.
అయితే ఆ దెయ్యాల ఊరిలో భవనం కలిగిన ఓ వ్యక్తి బిల్లీని తన భవనంలో ఉండమన్నాడు.ప్రకృతిని వీడియోలో బంధిస్తూ… దీంతో బిల్లీ ఒంటరిగా ఆ భవనంలో నివసిస్తున్నాడు.
సమీపంలోని మరో పట్టాణానికి వెళ్లి తనకు అవసరమైన సామగ్రి తెచ్చుకునే వాడు. ఒంటరిగా ఉండడం వల్ల బోర్ కొట్టి.. తన వద్దనున్న కెమెరాతో అక్కడి అందాలను, ప్రకృతిలో వచ్చే మార్పులను వీడియో తీయడం మొదలుపెట్టాడు.
మొదట్లో తానూ ఏ ఉద్దేశం లేకుండా వీడియోలు తీసినా.. ప్రస్తుతం తాను తీసిన వీడియోలు గ్లోబల్ వార్మింగ్ పరిశోధనలకు ఎంతగానో ఉపయోగ పడుతున్నాయని బిల్లీ పరిశోధకులతో చెప్పాడు. మంచు ఎంత దట్టంగా కురుస్తుంది? అక్కడ ఏ సమయంలో ఎంత ఉష్ణోగ్రత ఉంటుంది? మంచు సాంద్రత ఎంత ? .. ఇలా ప్రకృతిలోని ప్రతి విషయాన్నీ గత 46 ఏళ్లుగా బిల్లీ వీడియో తీస్తూ రికార్డు చేస్తున్నాడు.