US Presidential Elections………………………..
అమెరికా అధ్యక్ష పదవికి జరగబోయే ఎన్నికల్లో భారత సంతతికి చెందిన రిపబ్లికన్ నేత వివేక్ రామస్వామి పోటీ చేయబోతున్నారు . ప్రముఖ వ్యాపారవేత్త అయిన రామస్వామి ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ తన పోటీ గురించి అధికారికంగా ప్రకటించారు.
నిక్కీ హేలీ తర్వాత ఈ ప్రకటన చేసిన రెండో భారతీయ సంతతి నేత ఈయనే. వీరిద్దరూ కూడా రిపబ్లికన్ పార్టీకి చెందిన నేతలే కావడం విశేషం. మాజీ ప్రెసిడెంట్ ట్రంప్ కూడా అంతకు ముందు పోటీ చేస్తానని ప్రకటించిన విషయం తెలిసిందే.
వివేక్ రామస్వామి ఒహాయో లో ఆగస్టు 9, 1985లో జన్మించారు. ఆయన వయస్సు 37 సంవత్సరాలు. కేరళకు చెందిన ఆయన తల్లిదండ్రులు ఆమెరికా కు వలస వచ్చారు. ఆయన సోషల్ మీడియాలో తనను తాను క్యాపిటలిస్ట్, సిటిజెన్ గా అభివర్ణించుకున్నారు.
హార్వర్డ్, యేల్ యూనివర్సిటీల్లో ఆయన విద్యనభ్యసించారు. లింక్టిన్ ప్రొఫైల్ ప్రకారం.. గత ఏడాది ఆయన డ్రైవ్ అసెట్ మేనేజ్మెంట్ ను స్థాపించారు. దీనికి ముందు ఆయనకు ఔషధరంగంలో గొప్ప పేరు ఉంది. రొవాంట్ సైన్సెస్ సంస్థను ఏర్పాటు చేశారు. 2016లో ఫోర్బ్స్ గణాంకాల ప్రకారం.. ఆయన ఆస్తుల విలువ 600 మిలియన్ డాలర్లు.. దీంతో 40 సంవత్సరాల కంటే తక్కువ వయస్సున్న సంపన్నుల్లో ఒకరిగా రామస్వామి నిలిచారు.
ఇక నిక్కీ గురించి చెప్పుకోవాలంటే ……. నిక్కీ హేలీ ఇంతకుముందు సౌత్ కరోలినాకు రెండుసార్లు గవర్నర్ గా పనిచేశారు. అలాగే డొనాల్డ్ ట్రంప్ ప్రెసిడెన్సీ ప్రారంభంలో రెండేళ్లపాటు హేలీ 2017 నుండి 2018 వరకు ఐక్యరాజ్యసమితిలో అమెరికన్ రాయబారిగా సేవలు అందించారు. సౌత్ కరోలినా గవర్నర్గా ఉన్న సమయంలో ఆమె బిజినెస్ ఫ్రెండ్లీ నేతగా పేరు పొందారు.
రాష్ట్రానికి ప్రధాన కంపెనీలను ఆకర్షించడంపై దృష్టి సారించి నిక్కీ విజయవంతం అయ్యారు. హేలీ విద్యను మెరుగుపరచడం, కొత్త ఉద్యోగాలను సృష్టించడం, పన్నులను తగ్గించడంపై దృష్టి పెట్టి పనిచేశారు. సౌత్ కరోలినా లో 2015 వరదలతో సహా అనేక ప్రకృతి వైపరీత్యాలు సంభవించాయి. ఆ సమయంలో ప్రజలకు సేవలు అందించడం లో ఆమె ముందంజలో ఉన్నారు.
అలాగే 2015లో చార్లెస్టన్ ఇమాన్యుయేల్ ఏఎంఈ చర్చీలో జాతివివక్షతో జరిగిన సామూహిక కాల్పుల ఘటన సమయంలో ఆమె స్పందించిన తీరుకు దేశవ్యాప్తంగా మంచి పేరు పొందారు. కాగా, ఈమె తల్లి తండ్రులు అజిత్ సింగ్ రన్ ధావా , రాజ్ కౌర్ రన్ ధావా . పంజాబ్ అగ్రికల్చర్ వర్సిటీలో ప్రొఫెసర్ గా పనిచేసే అజిత్ సింగ్ ఫ్యామిలీతో కలిసి 1960లో మొదట కెనడాకు ఆ తర్వాత అక్కడి నుంచి అమెరికాకు వెళ్లి అక్కడే స్థిరపడ్డారు.
నిక్కిహేలీ క్లెమ్సన్ విశ్వవిద్యాలయం లో అకౌంటింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీని పూర్తి చేసింది. కళాశాల చదువుల తర్వాత, హేలీ కొన్నాళ్ళు సోషల్ వర్కర్ గా పనిచేశారు. కుటుంబానికి చెందిన దుస్తుల వ్యాపారంలో పాలు పంచుకున్నారు. రామ స్వామి తో పోలిస్తే నిక్కీ రాజకీయంగా అనుభవం ఉన్నవారని చెప్పుకోవాలి.