‘ధర్మావతి రాగం’ లో అద్భుతమైన పాటలు !!

Sharing is Caring...
Bharadwaja Rangavajhala  ……  

అమరదీపం సినిమాలో ఓ పాటుంది. ఏ రాగమో ఇది ఏ తాళమో అంటూ పాడతారు నాయికా నాయకులు. ఏదో అలా పాడేసుకున్నారుగానీ తెలుగు సినిమా పాటకు రాగమేమిటి అన్న వాళ్లూ లేకపోలేదు. కానీ సినిమా పాటలు కూడా రాగయుక్తంగా ఉంటేనే కదా…జనాలకు నచ్చేది. అందుకే శాస్త్రీయ రాగాధారితంగానే సాగుతాయి చాలా వరకు. అవసరాన్ని బట్టి కర్ణాటక సంగీతమూ కావచ్చు. హిందూస్తానీ కావచ్చు. పాశ్చాత్య సంగీతం కావచ్చు. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే …

శృంగార రౌద్ర రసాలను పలికించే రాగాలైన ధర్మవతి, గుర్జరిల గురించి మాట్లాడుకుందాం. ధర్మవతి అనగానే గుర్తొచ్చే అన్నమయ్య కీర్తన గోవిందాశ్రిత. ఈ పాటను గాయని శోభారాజ్ గాత్రంలో వింటుంటే బాగుంటుంది.
కర్ణాటక సంగీతం లో 58వ మేళకర్తరాగం అయిన ధర్మవతికి హిందూస్తానీ రాగం మధువంతితో దగ్గర సంబంధం ఉంది. ఈ సంపూర్ణ రాగం 23వ మేళకర్త రాగమైన గౌరీమనోహరికి ప్రతిమధ్యమ సమాన రాగం. ధర్మవతిలో సంగీత చక్రవర్తి ఎమ్మెస్ విశ్వనాథన్ స్వరపరచిన పాటొకటి ఉంది.

కాస్త శృంగార రస పోషణ చేసే ఈ గీతం బాలచందర్ తీసిన మన్మధలీలలో వినిపిస్తుంది. వీటూరి

రాసిన ఈ డబ్బింగ్ గీతం బాలుతో కలసి భాస్వరి ఎల్.ఆర్ ఈశ్వరి గానం చేశారు. హలో మైడియర్ రాంగ్ నంబర్ ….ఇలానే శృంగార రసాన్ని పోషిస్తూ…ఇళయరాజా కంపోజ్ చేసిన ధర్మవతి గీతం అశ్వమేథం చిత్రంలో ఉంది.

ఓ యమ్మా నీది బందరా, గుడివాడ కోతలు అనే రెండు మాటలు ఈ పాట రాసింది వేటూరి అని పట్టిచ్చేస్తాయి. ఇంతకీ పాటేంటంటే … ఏం దెబ్బతీశావురా …ఇదే ధర్మవతి రాగాన్ని కాస్త టెంపో మార్చి స్వర్ణకమలంలో ఎమోషనల్ గా పలికిస్తారు ఇళయరాజా. సీతారామశాస్త్రి కలం కూడా రాజా ట్యూనుతో పోటీ పడుతుంది. అందెల రవమిది పదములదా? అంబరమంటిన హృదయముదా? ఈ పాట వింటుంటే ఎవరికి వారు వేసుకునే ప్రశ్న అది. అంతటి అనుభూతి కలిగిస్తుంది.

ఎమ్మెస్వీ , ఇళయరాజాల తర్వాత దక్షిణాది సినిమా సంగీతానికి చుక్కానిగా నిలబడ్డ సంగీత శిఖరం ఎ.ఆర్.రెహ్మాన్. బిగ్ సినిమాల డైరక్టర్ శంకర్ తొలి చిత్రం జంటిల్ మేన్ లో రెహ్మాన్ ధర్మవతి రాగంలో స్వరం కట్టిన ఓ టిపికల్ యుగళగీతం వినిపిస్తుంది.

రాజశ్రీ రచనలో సాగే ఈ పాటకు ఓ విశేషం ఉంది. సాధారణంగా భారతీయులు పాశ్చాత్య సంగీతాన్నించి ప్రేరణ పొందుతారంటారు కదా. కానీ ఈ పాటను ప్రేరణగా తీసుకుని ఓ వెస్ట్రన్ ఆల్బమ్ వచ్చింది. దటీజ్ రెహ్మాన్  కొంటెవాణ్ణి కట్టుకో … అంటూ జంటిల్మేన్ సినిమాలో పాటుంది కదా.

అదే వందేమాతరం శ్రీనివాస్ అంటేనే సందేశాత్మక , విప్లవాత్మక గీతాలకు బ్రాండ్ అంబాసిడర్. కారంచేడు దుర్ఘటన నేపధ్యంగా తీసుకుని ఎన్. శంకర్ తీసిన జయంమనదే చిత్రానికి వందేమాతరం సంగీతం అందించారు. అందులో కాస్త వెస్ట్రన్ బీట్ తో సాగే సందేశాత్మక గీతానికి ధర్మవతి రాగాన్ని వాడారు. పాడింది శంకర్ మహదేవన్ కావడంతో చాలా స్పష్టంగా ఇది క్లాసికల్ మ్యూజిక్ నుంచీ ప్రేరణ పొందిన పాట అని అర్ధం అవుతుంది.

డోంట్ మిస్ సోదరా …ఇళయరాజా తనయుడు యువన్ శంకర్ రాజా కూడా ధర్మవతి రాగంలో ఓ అద్భుతమైన మెలోడీ అందించాడు. సెవన్ జీ బృందావన్ కాలనీ సినిమా కోసం చేసిన ఈ మెలోడీ కుర్రాళ్ల మనసుల్లో నిలచిపోయింది. కలలు కనే కాలాలూ …ధర్మావతి ఆధారంగా చేసిన పాటే …

గుర్జరి రాగం. ఇది కూడా ధర్మవతిలాగా ఎమోషనల్ రాగమే. దీని వెనుకా హిందూస్తానీ నీడలు కనిపిస్తాయి. గుజరీ తోడి అంటూ హిందూస్తానీలో వినిపించే రాగానికి ఇది దగ్గరగా ఉంటుంది. మెలోడీ ప్రధానంగా సాగే భావాత్మక గీతాలను స్వరపరచడానికి ఎక్కువగా ఈ రాగాన్ని వాడతారు.

ఆర్డీ బర్మన్ స్వరసారధ్యంలో వచ్చిన రాజేశ్ ఖన్నా , షర్మితాఠాగూర్ ల సినిమా అమర్ ప్రేమ్ లో ఆనంద్ బక్షి రాసిన యుగళగీతం రైనా బీత్ జాయే గుజరీ తోడిలో వినిపిస్తుంది. గుర్జరి రాగంలో తెలుగు సినిమాల్లో వినిపించే గీతాల్లో రావేలా కరుణాలవాలా ఒకటి. సుశీల గాత్రంలో వినిపించే వీటూరి వారి సాహిత్యం మనసులకు తాకుతుంది.

ఎమోషనల్ కావడంతో ఈ గీతాన్ని గుర్జరిలో స్వరపరిచారు ఎస్.పి కోదండపాణి.హిందూస్తానీ టచ్ ఉన్న కర్ణాటక రాగాలను అధికంగా వాడడం అప్పట్లో తెలుగు సినిమా సంగీత దర్శకులు ఎక్కువగా చేసేవారు. చాలా వరకు రంగస్థలం సంబంధీకులు కావడమే ఇందుకు కారణం.

భక్తి భావమే కాదు…ఏ భావాన్నైనా ఎమోషనల్ గా పలికించే రాగం కావడంతో విషాదాన్ని పలికించడానికి కూడా గుర్జరినే ఆశ్రయించారు మన సంగీత దర్శకులు. అక్కినేని నటించిన దొంగల్లో దొర చిత్రానికి సంగీత దర్శకుడు ఎమ్.ఎస్.రాజు. ఆయన కూడా విషాదాన్ని పలికించాల్సిన ఆశలే మారునా గుర్జరిలోనే స్వరపరిచారు. ఘంటసాల లీల ఆలపించిన ఈ గీతం సముద్రాల సీనియర్ రచన.

గుర్జరిలో పాటలు చేసిన సంగీత దర్శకులు దక్షిణాదిన తక్కువ మందే ఉన్నారు. ఎమ్మెస్ విశ్వనాథన్ కూడా ఆడబ్రతుకు చిత్రం లో విషాదం పలికించాల్సిన సందర్భానికి గుర్జరి ఆధారంగా ఓ ట్యూను చేశారు. ఆత్రేయ అందించిన సాహిత్యాన్ని పి.బి.శ్రీనివాస్ ఆలపించారు. తనువుకెన్ని గాయాలైనా … మాసిపోవునేలాగైనా … పాట అది.

గుజ్జర్ జాతికి చెందిన సంప్రదాయ సంగీతం నుంచి ఉద్భవించింది కనుక దీనికి గుజ్జరి అనే పేరొచ్చిందనే అభిప్రాయం చాలా మందిలో ఉంది. అది నిజమే కావచ్చు. అయితే ఒక భావం పలికించడానికి నిర్ణయమైపోయాక దాన్ని ఏ రాగంలో పలికిస్తే ప్రజల హృదయాలను చేరుతుందని విజ్ఞతతో ఆలోచించగలగడం సంగీత దర్శకుల విధి.

సత్యనారాయణ మహత్యం సినిమా కోసం సముద్రాల వారు రాసిన మాధవా సనాతనా అనే గీతాన్ని గుర్జరిలోనే స్వరపరిచి పాడారు ఘంటసాల మాస్టారు.తెలుగు సినిమా సాహిత్యానికి సంబంధించి కేవలం మూడు పర్యాయాలు మాత్రమే జాతీయ పురస్కారం లభించింది. అందులో రెండు పాటలు శ్రీశ్రీ ప్రమేయం ఉన్నవైతే ఒకటి వేటూరి సుందరరామ్మూర్తిది.

శ్రీశ్రీ ప్రమేయం ఉన్న రెండు పాటల్లో మొదటిది ఆయనే రాసిన తెలుగువీర లేవరా అయితే రెండోది ఆయన మహాప్రస్తాన గీతం ప్రేరణతో రాసిన నేను సైతం గీతం.నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను అన్న శ్రీశ్రీ వాక్యాన్ని ఆధారం చేసుకుని ఠాగూర్ చిత్రం కోసం సందర్భోచిత సాహిత్యం కూర్చారు సుద్దాల అశోక్ తేజ. ఎమోషనల్ గా సాగే ఆ గీతాన్ని సైతం గుర్జరిలోనే స్వరపరిచారు సంగీత దర్శకుడు మణిశర్మ.  

 

Sharing is Caring...
Support Tharjani

Leave a Comment!

error: Content is protected !!