అజరామరం ఆ ‘మురళీ’ స్వరం !

Sharing is Caring...

రమణ కొంటికర్ల .……………………………………………………………

బాల్యంలోనే రవళించిన మురళది. చరమాంకానికి పద్మశ్రీభూషణ విభూషణుడైన ఒకే ఒక్క వాగ్గేయగానమది. ఆయన జుగల్బందీ లో పోటీ ఇవ్వక తప్పని పరిస్థితిలో సహపాఠి బందీ ఐతే… వీక్షక శ్రోతలు మాత్రం మంత్రముగ్ధులవ్వాల్సిందే!  గానం ఆయన వృత్తైతే… గానానికి సాయమయ్యే వయోలీనం, వీణ, వయోలా, మృదంగం, కంజీరా వంటివన్నీ  వృత్తంత పవిత్రంగా పలికించగల్గే ప్రవృత్తి ఆయనకున్న మరో అరుదైన విశిష్ఠత.

నేడు ఆయన జయంతి ..ఈ సుదినాన.. ఆకాశం నుంచి ఓ సంగీత ధృవతార భువికి వస్తే… ఆయన శివైక్యం పొందిన వేళ ఆ తార గగనమెక్కి.. అంతకుమించిన రెట్టింపు ప్రకాశవంతమైన తేజస్సును ప్రసరిస్తూనే ఉంది. భౌతికంగా బాలమురళీ లేకపోవచ్చు… కానీ ఈ భువి ఉన్నన్నాళ్లూ… ఆ బాల మురళి రవళిస్తూనే ఉంటుంది. ఈ ప్రకృతి పరవశించినన్నాళ్లూ ఆ మురళీనాదం వినిపిస్తూనే ఉంటుంది.

నగుమోము కనలేని నా జాలి తెలిసీ అంటూనే త్యాగయ్య ఆవేదనాకృతిని… అలవోకగా ముఖాన నవ్వు చెదరకుండానే గాలికి సైతం దొరకని గమకాల గుణింతాలతో మ్యాజిక్ చేసే మ్యూజికల్ వాయిస్ ఆ మురళీకృష్ణుడు. సరసమైనా, విరసమైనా, గంభీరమైనా, మాధుర్యమైనా… బైసైనా, టాపైనా, మధ్యమమైనా… ఎక్కడైనా ఎలాంటి చోటైనా ఆయన కంఠాన స్వచ్ఛంగా, స్పష్టంగా పడేందుకు జారిపోకుండా స్వరాలే ఒకింత ఉత్సాహాన్ని చూపుతాయంటే… అదొక బ్రహ్మ అపురూప గానసృష్ఠి. అందుకే ఆ బాలమురళీగానం అజరామరం.

ఆయనతో జుగల్బందీ చేస్తే… అంతర్జాతీయ అవార్డులందుకున్న దానికన్నా.. అదో గుర్తింపు. ఆయనకు సహవాద్యాలందించడమంటే… ఎందరికో ఈ జన్మకు సంగీత సరస్వతి తమను వరించినట్టు. ఇదిగో ఇలా సాగింది ఆయన గుర్తింపు. అతిశయోక్తులకు కూడా అందని గంధర్వగాయకులను సైతం సమ్మోహనపర్చే గానమది. హరికథా కళాకారుడు ముసునూరి సత్యనారాయణ.. పేరు ముందు చేర్చిన బాల… ఆ మురళీకృష్ణుడికి బొడ్డుకోసి పేరుపెట్టినట్టతికింది. త్యాగయ్య ఐదవ తరం పరంపరగా చెప్పుకున్నా… అంతకుమించే అనుకున్నా… ప్రతిభలో ఎలాంటి సందేహాలకాస్కరంలేని సంగీత కళానిధి మన తెలుగు బాలమురళి.

తండ్రి మురళీవాద్యంలోని గాలి ధ్వనితరంగాలు… తల్లి వీణావాద్యంలోని తీగానాదాలు కలిసిన వేళ పుట్టిన బిడ్డడు బాలమురళి. రెండువారాల వయస్సులోనే తల్లిని కోల్పోయిన బాధలోంచి పెత్తల్లి దగ్గర పెరిగిన జీవననాదమది. తను వయోలిన్ పట్టుకుంటే నచ్చని జనకుడిని భైరవీ ఆటతాళ వర్ణంతో మంత్రముగ్ధుణ్ని చేసిన సుతిమెత్తని స్ట్రింగ్ బాలమురళి. బాల్యంలోనే చెన్నై ఆల్ ఇండియా రేడియోలో ఏ గ్రేడ్ ఆర్టిస్ట్ గా గుర్తింపు దక్కించుకున్న గాత్రమది. ఆదిశంకర సినిమాతో సినీ సంగీతంలోనూ కాలుమోపి… నభూతో నభవిష్యత్ అన్నట్టుగా ఆయన పాడిన పాటలన్నీ ఇప్పటికీ అజరామరమే. 14 ప్రాయంలోనే 72 మేళకర్తల సృష్టికర్తైన సరస్వతీ పుత్రుడు బాలమురళి.

మహతి, సుముఖం, త్రిశక్తి, సర్వశ్రీ, ఓంకారి, జనసమ్మోధిని, మనోరమ, రోహిణీ, వల్లభి, లవంగి, ప్రతిమధ్యమావతి, సుష్మ వంటి ఎన్నో నూతన రాగాల పున: సృష్టికర్త బాలమురళి. విపంచి అనే ట్రస్ట్ ద్వారా నాట్యాన్ని, సంగీతాన్ని విస్తరించిన వినయశీలి. పాతికవేల సంగీత కచేరీలను అలవోకగా చెరగని నవ్వుతో పల్లవించిన చరణమది. గురువు పారుపల్లి రామకృష్ణయ్య, కొచ్చర్లకోట రామరాజు, సుబ్రహ్మణ్యం అయ్యర్, సుసర్ల దక్షిణామూర్తి వంటి గురువుల ఆశీస్సులతో… ఇంతింతై ఎదిగి ఆ ఏడుకొండల వెంకన్న సన్నిధికీ.. అద్వైతాన్ని ప్రతిపాదించిన ఆదిశంకరుడి శృంగేరీ పీఠానికీ ఆస్థాన విద్వాంసుడై ఆ దైవకృపకు పూర్తి పాత్రుడైన సుమధుర గానరత్నావళి బాలమురళి.

తల్లి చనిపోయిన్నాట్నుంచి… పెద్దమ్మే పె”తల్లై”.. లాలించి పెంచి చెల్లె రుణం తీర్చుకున్న సుబ్బమ్మ సక్సెస్ స్టోరీ బాలమురళి. చీపురుపుల్లలకు తీగలు కట్టి వయోలిన్ వాద్యాన్ని తయారుచేసిన బాల్యం నుంచి… చెంబులు, గంజులు వంటివాటినే మృదంగాలు చేసి వాయించిన చిన్ననాటి స్మృతుల సక్సెస్ డైరీ బాలమురళి. ఇవాళ ఏకంగా ప్రపంచమే ఆ కర్నాటక వాగ్గేయకారుడి ఘనతను గుర్తించేస్థాయికి ఎదగడం… ఇప్పటికీ.. ఇంకెప్పటికీ నభూతో నభవిష్యత్ అనే తరహాలో రూపుదిద్దుకుని నేటి తరానికి సాక్షీభూతమైన సంగీత శిఖరం బాలమురళి.

బాలమురళీ గురించి నాబోటివాళ్లు పొగడ్డమంటే…సూర్యకాంతిని మించిన కాంతి నా టార్చ్ లైటనుకునే వెర్రితనమే అవుతుందది.  ఆ స్వరబ్రహ్మ.. సంగీతమనే సృష్టికి ప్రతిసృష్టి చేసిన ద్రష్ట.. బాలమురళీ జయంతిని పురస్కరించుకుని… త్యాగయ్యన్నట్టు ఎందరో మహానుభావులు… అందరికీ వందనాలు… అందులో అరుదైన బాలమురళీకి ప్రత్యేక అభివందనాలతో.

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!