Taadi Prakash..……………………………………..
MOHAN’S TRIBUTE TO BALAGOPAL……………………లక్షణంగా కడుపులో చల్ల కదలకుండా ఓ మూల పడి ఉండక కన్యాకుమారనీ, కాశ్మీరనీ గావుకేకలెందుకు; మానవ హక్కులకు ఎక్కడో ఏదో అయిందని ఎర్ర బస్సులెక్కి డేంజర్ జోన్లో తలదూర్చడమెందుకు – అని మనలాంటి జ్ఞానులకు అనిపించుట సహజం. కానీ కొందరంతే. కొత్త బూట్లు కొనుక్కోవడం, అద్దంలో పదేపదే చూసుకుంటూ తల దువ్వుకుంటూ ‘అదిరిందిరా చంద్రం’ అని తనలో తానే, ప్రకాశముగా కూడా అనుకుంటూ ఉండరు. ఇరాక్ మీద అమెరికా ఆంక్షల వల్ల ఆరున్నర లక్షల మంది చంటి పిల్లలు చనిపోవడమేంటని బెంగపడతారు. దాని గురించి రాస్తారు, చెప్తారు.
అందువల్ల మనకేదో బల్బు వెలుగుతుంది. ఔను నిజమే కదా .. అనిపిస్తుంది. అటువేపు మనల్ని మళ్ళిస్తుంది. బుర్ర తొలుస్తుంది. మరింత తెలుసుకోవడానికి, మరింత అర్థం చేసుకోవడానికి రేపెడుతుంది. మన స్థాయిని పెంచుతుంది. కొత్త దారొకటి దొరుకుతుంది. బాలగోపాల్ ఒక్కడే కాదు గ్రామ్ స్కీ అయినా, చోమ్స్కీ అయినా అదేపని చేస్తారు. తెలీకుండానే బతుకు మారుతుంది. తత్వశాస్త్రం, కళ, కొత్త ఆలోచనలూ మానవజాతిని ముందుకు నడిపిస్తాయి. చుట్టూ ఉన్నదానితో బాగా ఎడ్జెస్ట్ అయిపోయి ఉండకుండా ఈ భావాలు నిద్ర లేపుతాయి. నిద్రలేకుండా చేస్తాయి.బాలగోపాల్ ఇంగ్లీష్ వ్యాసాలు రాస్తే అచ్చేయడానికి ‘ఎకనమిక్ అండ్ పొలిటికల్ వీక్లీ’ రెడీగా ఉంటుంది.
కానీ రంగా హత్య గురించో, పరిటాల రవి హత్య గురించో వ్యాసాలు తీసుకొచ్చి బాగ్ లింగంపల్లి లో మేం పెట్టిన పనికిమాలిన వీక్లీకి ఇచ్చేవాడు. ఓపిగ్గా మూడంతస్థుల మెట్లెక్కి మరీ వచ్చేవాడు. తెలుగు డైలీలకు, నేషనల్ ఇంగ్లీష్ డైలీలకు ఇస్తే వాళ్లు వేస్తారు గదా, ఈ పిల్ల పత్రిక్కి ఎందుకిస్తారని అడిగితే.. ‘ ఆల్టర్నేటివ్ వాయిస్ ఉండాలి. మన సమస్యల మీద అభిప్రాయాలు తెలియాలి. మెయిన్ స్ట్రీమ్ లో అవి కుదరవు ‘ అనేవాడు. ఆయన నడిపిన ‘ స్వేచ్ఛ’ లాంటి పత్రికలూ అంతే. ఎంత సర్క్యులేషన్ ఉంటుంది గనక. రాసీ, కంపోజ్ చేయించి, ప్రూఫ్ రీడింగ్ చూసీ, పత్రికలు కట్టలు కట్టలు పంపించీ నానా తంటాలు పడేవాడు. ఏంటంటే., అదంతే. బతుకులో సక్సెస్ కీ, ఫెయిల్యూర్ కీ నిర్వచనాలు తిరగేసి చూపించాడు. ఇప్పుడున్న సోకాల్డ్ ప్రమాణాలని ఆకుచెప్పుల కాళ్లతో తన్ని పారేశాడు. అదో గొప్ప పని అనుకోలేదు కూడా. తను ఎలా ఉండాలో అలానే ఉన్నాడు.
అయితే ఒకటుంది. బ్రిటిష్ వాళ్లు మన దేశాన్ని పాలిస్తున్న కాలంలో రంగూన్ లో ఒక జమీందారు తన ఇంట్లోని టీనేజ్ పనిపిల్లని రేప్ చేశాడు. ఆ వార్త ఓ పత్రికలో ఏదో ఒక మూల సింగిల్ కాలమ్ లో వచ్చింది. లెనిన్ దాన్ని చదివి కదిలి, కామెంట్ రాశాడు. ఎక్కడి రంగూన్, ఎక్కడి మాస్కో! కానీ ‘కన్సర్న్డ్ సిటిజెన్’ లు ఇలాంటి ‘అతిచిన్న అప్రధానమైన’ వార్తలకు కూడా రియాక్ట్ అవుతారు. చాలామందిలాగ వాళ్ల చర్మం మొద్దుబారి ఉండదు. అలాగని కళ్లమ్మట నీళ్లు పెట్టుకుని వలవలా ఏడవరు. అప్పటి సమాజంలో ఇలాంటివి జరగడానికి గల మూలాల్ని చూస్తారు. మనలాంటి మందబుద్ధులకు చెప్తారు. సెన్సిటైజ్ చేస్తారు. బాలగోపాల్ ఆ కోవలో మనిషే. అందుకే అలా చేశాడు. అలా తిరిగాడు. అలా రాశాడు. గూండాలు కత్తులతో దాడి చేసినా బెదరలేదు. నక్సలైట్ ముద్ర ఉన్న వాళ్లని విమర్శించడానికీ వెనకాడలేదు.
మాయావతిని తిడితే దళితులు హర్ట్ అవుతారని లెక్కే చేయలేదు. కమ్యూనిస్టు అయినా కమ్యూనిస్టుల పద్ధతుల్ని వేలెత్తి చూపడానికి వెరవలేదు. ఇందులో తలతిక్క గానీ, రెటమతం గానీ ఉండవు. రీజన్ ఉంటుంది. తర్కం ఉంటుంది. మనల్ని ఒప్పిస్తాడు. ఇదంతా బాలగోపాల్ ని పొగిడి హెచ్చు చేయడానికి కాదు. మన బతుకు సంగతేంటని చూసుకోవడానికి, అసలైన ఆదర్శాన్నీ, త్యాగాన్నీ తెలుసుకోవడానికీ ఇలాంటి వాళ్లు మనకు బాగా పనికొస్తారు. ఇదంతా వాళ్ల గురించి కాదు. మన గురించి.మామూలు స్టాండర్డ్స్ తో చూస్తే తను బాగా అప్రయోజకుడు. పెళ్లాం బిడ్డల కేదేనా చేద్దామని ఎప్పుడూ లేదు. నాలుగు రాళ్లు వెనకేసే బుద్ధే లేదు. కనక చిక్కడపల్లిలో గానీ, గచ్చిబౌలీలో గానీ ప్లాటూ లేదు, ఫ్లాటూ లేదు. ఒకటే ప్రయాణాలు, సమావేశాలు, సభలు, ప్రసంగాలు, రాతకోతలు. కుదురులేని, సుఖంలేని బతుకు.
కానీ బాగా ఎంజాయ్ చేశాడనిపిస్తుంది. వాళ్ల డైనింగ్ టేబుల్ దగ్గర కూచున్నప్పుడు మా అంత వాగుడూ, వాదనలూ చేసేవాడు కాదు కాని., కాసిన్ని కబుర్లు చెప్పేవాడు. మధ్యమధ్యలో వంటింట్లోకెళ్ళొచ్చి నాలుగు కప్పుల చాయ్ తెచ్చిచ్చేవాడు. సన్నగా నవ్వడం, చిన్నగా జోకులు వేయడం. సీరియస్ విషయాల్లోకి పోకుండా జాగ్రత్తపడేవాడు. ముప్పై ఏళ్లుగా ఎరిగున్నా, డజన్లూ, పరకల కొద్దీ పోస్టర్లూ, కవర్ డిజైన్లూ, కార్టూన్లూ గీసిచ్చినా తెగ దగ్గరైపోవడం, ఫ్రెండ్షిప్ చేసేయడం ఏమీ ఉండేది కాదు. మామూలు కబుర్లు, అసింటా ఉండడం – ఎప్పుడూ అంతే.ఇక రాతల విషయానికొస్తే పైకి కనిపించేంత మొహమాటం ఏమీ ఉండదు. ‘జార్జిబుష్ నూ, సద్దాం హుస్సేన్ నూ ఒకే బోనులో నిలబెట్టలేమా ‘ అనే హెడ్డింగ్ తో వచ్చిన వ్యాసంలో “తెలుపునలుపులే తప్ప వేరే రంగులు చూడబోమని తెలుగునాట ప్రజాతంత్రవాదులు ఎప్పుడో చరిత్ర మీద ఒట్టు పెట్టి తీర్మానించినట్టున్నారు ‘ అని మొదలుపెట్టి ఇద్దరి గురించీ ఖచ్చితంగా ముక్కు మీద గుద్దినట్టు చెప్పాడు.
ఈరోజు ఈ వాదనని సిరియా, ఇరాన్, కుర్దిస్తాన్, ఇసిన్ ల సందర్భంలో యధాతథంగా చెప్పుకోవచ్చు. తిరుమలలో అన్యమత ప్రచారం జరగకూడదని, అక్కడ లౌకిక పాలన ఉండకూడదనీ, దాని ఆదాయమంతా హిందూ మత ప్రచారానికే వాడాలన్న వాదన మామూలుగా మంచిదే కదా – అని జనం అనుకునే పరిస్థితి ఉంది. అలాంటి ప్రచారం చేశాడని ఈ మధ్యే అక్కడ ఒకర్ని అరెస్ట్ చేశారు కూడా. కానీ ఏనాడో ఈ వాదాన్ని తిప్పికొడుతూ రాశాడు బాలగోపాల్.దళిత రాజకీయాల పేరిట ఏదోరకంగా అధికారంలో ఉండడానికి మాయావతి చేసిన ‘సోషల్ ఇంజనీరింగ్’ ను ఘోరమైన కరప్షన్ గా తిడతాడు. చివరికి “చచ్చి ఏ నరకాన ఉన్నారో గానీ ఫూలే, అంబేద్కర్, పెరియార్లు తమ వారసులు, తమ ఆలోచనలకు పట్టించిన గతికి చాలా బాధపడుతుండాలి” అని ముగిస్తాడు.నందిగ్రాం, హైదరాబాద్ మక్కా మసీదు, రాజస్థాన్ గుజ్జర్ల ఆందోళనలో పోలీసుల దౌర్జన్యాన్ని నిరసిస్తూ “బ్రేకులు లేని లారీని గొర్రెల మంద మీదికి తోలినట్టు తుపాకులతో ప్రజలను వేటాడతారు” అంటాడు.
“గుజరాత్ హింసాకాండను పక్కన ఉండి నడిపించిన ఆ మహానుభావుణ్ని ఆ రాష్ట్రం మళ్లీ ఎట్లా ఎన్నుకుంది” అని ప్రశ్న వేస్తాడు. రాష్ట్రం కాదు దేశమే ఎన్నుకుందని తెలిస్తే ఏమనేవాడో!”జ్వరం ఆదిలాబాద్ కా, వైద్యశాఖకా?” వ్యాసం మనకి జ్వరం తెప్పిస్తుంది. “ఒకడు పోయాడు, ఒకడు బలపడ్డాడు, రేపు ఏం కానుందో” అనే శీర్షికతో ఉన్న వ్యాసం ఇలా మొదలవుతుంది. “సూర్యప్రతాపరెడ్డి చావుతో చంద్రబాబు నాయుడుకు అనంతపురం జిల్లా బయట సానుభూతి పొందడానికి ఇంకో శవం దొరికిందని అంటే.. అది అమానుషమైన వ్యాఖ్యగానో, దివాకరెడ్డికి అనుకూలమైన వ్యాఖ్యగానో తోచవచ్చు… ఈ రోజు దివాకరరెడ్డి కళ్లలో దాచుకోలేకపోతున్న సంతృప్తి రేపు సూర్యప్రతాపరెడ్డి కొడుకు కళ్లలో మనం చూడనూవచ్చు”.ఇంత బ్రూటల్ గా రాయడం శానా కష్టం.ఇలా ఎన్నయినా కోట్ చేయొచ్చు. ఎలాగూ చదువుతారుగా, ఎందుకు అన్నీ చెప్పడం అనిపిస్తుంది.
ఇవన్నీ చదివాక చుట్టూ ఉన్న పరిస్థితుల మీద కోపం, దేశంలో, ప్రపంచంలోనూ జనం కష్టాల వెంట, కన్నీళ్ల వెంట పరుగుపెట్టాలనే ఆందోళన కలుగుతుంది. ఇవి చూస్తూ మిన్నకుండకూడదనీ, గొంతెత్తి అరవాలనీ, నిరసించాలనీ, ఖండించాలనీ, అసలీ వ్యవహారాలన్నీ మొత్తంగా మార్చాలనీ, బుధ్ధుడిలాగో, మార్క్స్ లాగో, కనీసం బాలగోపాల్ లాగానో చెయ్యాలనీ కోరిక వస్తుంది. కాని మనకంత క్వాలిఫికేషన్ ఎక్కడిది?బాలగోపాల్ చిన్నవయసులోనే మరీ అర్థం పర్థం లేకుండా చనిపోయాడు. ఈ నాలుగైదేళ్లలో భారతదేశం ‘రైట్’కి మొగ్గింది. అరబ్ వసంతం ఆకురాల్చింది. మళ్లీ సిరియాలో, ఇరాక్ లో యుద్ధాలు జరుగుతున్నాయి. నెత్తుటి మయమయ్యే పత్రికల పేజీలూ, టీవీ తెరలూ మనముందు రోజూ కనిపిస్తున్నాయి. ఆ మధ్య మిత్రులొచ్చినప్పుడన్నారు – ఇప్పుడు బాలగోపాలుంటే ఎంత బాగుండేదని. ఇవి చదివాక నాకూ గట్టిగా అనిపించింది, బాలగోపాల్ ఉంటే ఎంత బావుండునని!
Read Also ……….. బాలగోపాల్ ఉంటే ఎంత బాగుండేది..! (1)