పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పదవికి కౌంట్ డౌన్ మొదలైంది. అవిశ్వాస తీర్మానం పై జరిగే ఓటింగ్ తో ఆయన భవిష్యత్ ఏమిటో తేలిపోనుంది. సొంత పార్టీలోనే ధిక్కార స్వరాన్ని ఎదుర్కొంటున్న ఇమ్రాన్ తన ప్రాణాలకు ముప్పు ఉందని వాపోతున్నారు. ప్రధాని స్థాయి వ్యక్తే అలా మాట్లాడితే ఇక సామాన్యుల సంగతేమిటి అనే విమర్శలు కూడా వినపడుతున్నాయి.
ఇమ్రాన్ సంకీర్ణ భాగస్వామ్య పక్షాలను అనుకూలంగా మార్చుకుంటారో లేదో అంచనాలకు అందడం లేదు. ప్రతిపక్ష పీఎంఎల్-ఎన్ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై ఏప్రిల్ 3న ఓటింగ్ జరగనుంది. అవిశ్వాస తీర్మా నం, ముందుస్తు ఎన్నికలు, లేదా ప్రధానిగా రాజీనా మా చేయడం వంటి మూడు ఐచ్ఛికాలను మిలిటరీ తనకు ఇచ్చిందని ఇమ్రాన్ చెప్పుకుంటున్నారు.
పాక్ చరిత్రలో అవిశ్వాసం ఎదుర్కొంటున్నమూడో ప్రధాని ఇమ్రాన్. 1989లో బేనజీర్ భుట్టో, 2006లో షాకత్ అజీజ్ పై పెట్టిన అవిశ్వాస తీర్మానాలు వీగిపోయాయి. నయా పాకిస్తాన్ నిర్మిస్తామంటూ 2018లో అధికారంలోకి వచ్చిన ఇమ్రాన్ పార్టీ పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ అన్ని రంగాల్లోనూ ఘోరంగా విఫలమైంది.
రెండేళ్లలో ద్రవ్యోల్బణం రికార్డు స్థాయిలో 12 శాతానికి పైకి చేరుకుంది. నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటాయి. ఇమ్రాన్ వైఫల్యాలు విపక్షాలకు అస్త్రాలుగా మారాయి. సొంత పార్టీతో పాటు భాగస్వామ్య పక్షాల్లోనూ అసంతృప్తి మొదలైంది. ఆర్మీ చీఫ్ ఖమర్ జావేద్ బజ్వాతో విభేదాలు ఇమ్రాన్‌కు ప్రతికూలంగా మారాయి. ఐఎన్ఏ డైరెక్టర్ ను మార్చినప్పటి నుంచీ ప్రభుత్వంపై ఇమ్రాన్ పట్టు సడలసాగింది.
ఆర్మీతో ఇమ్రాన్ విభేదాలను గుర్తించిన విపక్షాలు ఆయనను గద్దె దించడానికి ఇదే చాన్సని అవిశ్వాస తీర్మానాన్ని పెట్టాయి. పాక్ జాతీయ అసెంబ్లీలో 342 సభ్యులకుగాను ఇమ్రాన్ పార్టీ పీటీఐకి 155 మంది ఉన్నారు. మరో ఆరు పార్టీల నుంచి 23 మంది మద్దతుతో ఇమ్రాన్ సంకీర్ణ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు. అవిశ్వాస గండం గట్టెక్కాలంటే 172 మంది మద్దతు కావాలి.
కానీ 24 మంది సొంత ఎంపీలే ఇమ్రాన్ పై తిరుగుబావుటా ఎగరేశారు. వారిని ఎలాగోలా దారికి తెచ్చుకునేందుకు, లేదంటే అనర్హత వేటు వేయించేందుకు ఇమ్రాన్ ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో భాగస్వామ్య పార్టీల్లోని 23 మందిలో కూడా ఎవరైనా అడ్డం తిరిగితే ఇమ్రాన్ ఇక ఇంట్లో కూర్చోవాల్సిందే.
అందుకే ఏడుగురు సభ్యులున్న పీఎంఎల్-క్యూ, ఐదుగురున్న ముతాహిదా క్వామి మూవ్ మెంట్ పాకిస్తాన్ (ఎంక్యూఎం-పీ)లను ఇమ్రాన్ బుజ్జగిస్తున్నారు. పీఎంఎల్-క్యూకు పంజాబ్ ప్రావిన్స్ సీఎం పదవి, ఎంక్యూఎంకు సింధ్ గవర్నర్ పదవిని ఆఫర్ చేశారని అంటున్నారు.
ఇమ్రాన్ పై తిరుగుబాటు చేసిన సొంత పార్టీ ఎంపీల్లో అత్యధికులు దక్షిణ పంజాబ్ కు చెందిన వారు. అక్కడ ప్రత్యేకవాదం వేళ్లూనుకొని ఉంది. తమ ప్రాంతాన్ని ప్రత్యేక ప్రావిన్స్ చేయాలన్న డిమాండ్లు ఊపందుకుంటున్నాయి. అదే ప్రాంతానికి చెందిన విదేశాంగ మంత్రి షా మహమూద్ ఖురేషి ప్రత్యేక దక్షిణ పంజాబ్ ప్రావిన్స్ ఏర్పాటు కోరుతూ ఇప్పటికే పార్లమెంటులో బిల్లు పెట్టారు. ఈ నేపథ్యంలో అక్కడి ఎంపీలను బుజ్జగించడం ఇమ్రాన్ కు అంత సులభం కాదంటున్నారు.
పార్లమెంట్ లో అవిశ్వాస తీర్మానంపై జరిగే ఓటింగ్ లో పాల్గొనరాదని తన సొంత పార్టీ పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ పార్టీ సభ్యులకు ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సూచించారు. తీర్మానంపై ఓటింగ్ రోజు సభకు హాజరుకావద్దని, వచ్చినా ఓటింగ్ లో పాల్గొనవద్దని ఆయన ఒక లేఖలో కోరారు. తన సూచనలు ప్రతి ఒక్కరూ పాటించాల్సిందేనని, ఉల్లంఘించిన వారిపై ఫిరాయింపు చట్టం కింద చర్యలుంటాయని హెచ్చరించారు.
అవిశ్వాస తీర్మానం నెగ్గడం, ఇమ్రాన్ గద్దె దిగడం ఖాయమన్న వార్తల నేపథ్యంలో ఆయన ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి పెట్టారని అంటున్నారు. జాతీయ అసెంబ్లీ గడువు ఎటూ ఏడాదిలో ముగియనున్నందున దాన్ని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని సన్నిహితులు సూచిస్తున్నారు. ఇమ్రాన్ ఏమి చేస్తారో ? ఎలా ఆట ముగిస్తారో ?వేచి చూడాల్సిందే.