ప్రముఖ వైష్ణవ తత్వవేత్త , విశిష్ట అద్వైతం గొప్పదనం గురించి ప్రపంచానికి తెలియ జేసిన రామానుజాచార్యులు మరణించి 884 ఏళ్ళు అయినప్పటికీ ఆయన శరీరం ఇంకా పదిలంగా శ్రీరంగంలో భద్రపరిచి ఉండటం విశేషం. రామానుజాచార్యులు శ్రీరంగంలోనే 80 ఏళ్ళు గడిపారు.అందులో 20 ఏళ్ళ పాటు శ్రీరంగనాధుడిని ప్రధాన పూజారిగా సేవిస్తూ తరించారు. రామానుజాచార్యులు వారు 120 ఏళ్ళు బ్రతికారు.
1137 లో స్వామి వారు తుది శ్వాస విడిచారు. అప్పటినుంచి ఆయన శరీరాన్ని అక్కడే భద్రపరిచి ఉంచారు. భక్తులలో చాలామంది తరచుగా వెళ్లి స్వామిని దర్శించి ఆశీస్సులు పొంది వస్తుంటారు. ఇప్పటికీ చాలామందికి ఈ విషయం తెలీదు. దేవాలయం లోపల అయిదవ ప్రాకారంలో ఉన్న రామానుజాచార్యులు ఆలయాన్ని సందర్శించినా అక్కడ ఉన్నది స్వామి వారి దివ్య శరీరం అని గుర్తించలేరు.
రామానుజ చార్యులు వారు 1017 లో తమిళనాడులోని పెరంబదూర్ లో జన్మించారు. తండ్రి కేశవ సోమయాజి , తల్లి కాంతిమతి . చిన్నతనం నుంచే విద్యాబుద్ధుల విషయంలో రామానుజాచార్యులు వారు చురుగ్గా ఉండేవారు. ఆయన చిన్న వయసులోనే తండ్రిని కోల్పోయారు.
తల్లే ఆయన్నిపెంచింది.కంచిలో యాదవ ప్రకాశం అనే గురువు శిక్షణలో స్వామి వేదాలను చదివారు. గురువు వద్దనే అన్ని విద్యల్లో ఆరితేరారు. తర్వాత విశిష్ట అద్వైత గొప్పదనం గురించి ప్రపంచానికి తెలియ జేస్తూ కొన్నాళ్ళు దేశ యాటన చేశారు. కొన్నాళ్ళు కంచిలో గడిపారు. 40 ఏళ్ళ వయసులో శ్రీరంగం చేరుకొని రంగనాధుడి సేవలో ఉండిపోయారు.
ప్రసిద్ధ వైష్ణవ దేవాలయాల్లో పురాతన ఆలయం శ్రీరంగం . విష్ణుభగవానుని 108 దివ్య క్షేత్రాలలో ఇదే మొదటిది.ఇది స్వయం భూక్షేత్రం. 6 శతాబ్దం నుంచి 9 వ శతాబ్దం వరకు దశలవారీగా ఈ ఆలయం నిర్మితమైంది. పల్లవరాజులు , చోళులు దేవాలయం పై శ్రద్ధ చూపి నిర్మాణానికి సహకరించారు.ఏడు ప్రాకారాలతో నిర్మితమైన ఆలయం లో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి.
అందులో ఇదొకటి అని చెప్పుకోవచ్చు.రామానుజ స్వామి వారు పద్మాసన యోగ భంగిమలో కూర్చొని శరీరాన్ని వీడారు. అదే భంగిమలో మనకు స్వామి వారు ఆలయంలో కూడా కనిపిస్తారు. స్వామి వారి శరీరానికి కర్పూరం, కుంకుమ పువ్వు ను ముద్దగా నూరి పూస్తారు. ఇందులో మరే రసాయనాలు కలపరని ఆలయవర్గాలు చెబుతున్నాయి.
ఈ లేపనం మూలంగా స్వామి శరీరం ఎర్రని రంగులో మెరుస్తూ కనిపిస్తుంది. హారతి ఇచ్చే సమయంలో కళ్ళు , వేళ్ళను కూడా స్పష్టంగా చూడవచ్చు. లేపనాన్ని కళ్ల వద్ద పూయక పోవడం వలన హారతి వెలుగులో ఆ కళ్ళు మరింత ప్రకాశవంతం గా కనిపిస్తాయి. ఏడాదిలో రెండుసార్లు ఇలా లేపనాన్ని స్వామి వారి శరీరానికి పూస్తారట . గత 884 ఏళ్లుగా ఇదే విధానాన్ని పాటిస్తున్నారు.
ఈజిప్టు తరహాలో కాకుండా అందుకు భిన్నమైన పద్దతిలో ఇక్కడ స్వామి వారి పార్థివ దేహాన్ని భద్రపరిచారు.ఇలా పార్థివ దేహాన్ని భద్రపరచడం మామూలు సాంప్రదాయానికి విరుద్ధం. ఆవిధంగా ఎందుకు చేశారనే దానికి కారణాలు ఎవరికి తెలియదు . అయితే పండితులకు ఈ విషయంపై వారి వివరణలు వారికున్నాయి. హిందూ సంప్రదాయంలో ఈ విధంగా పార్థివ దేహాన్ని దాచడం ఇదే ప్రధమం.
————- K.N.MURTHY
post upadated on 8-2-2022
రా మా నుజుల వారి పార్థివ దేహం విగ్రహం లా
ఉంది, i have seen at srirangam temple.
It is by the side of main shine.