ఈ సుందర రాముడి డేటింగ్ కాన్సెప్ట్ బాగుంది ..కానీ …

Sharing is Caring...

New Dating Concept………………………… డేటింగ్ అనగానే మనం ఏదేదో ఊహించుకుంటాం. అది విదేశీ సంస్కృతి కావడంతో తప్పుగా కూడా భావిస్తాం. కానీ తమిళనాడుకి చెందిన సుందర్ రామ్ డేటింగ్ కి ఒక కొత్త అర్ధం చెబుతున్నారు. డేటింగ్ అంటే ప్రేమతో గడపటం.,, ప్రేమను పంచడం .. అది ఏ వయసువారితో అయినా ..పెద్దలతో అయినా పిల్లలతో అయినా చివరికి రక్త సంబంధీకులతో అయినా అంటున్నారు రామ్. తాను చెప్పే డేటింగ్ విదేశీ రకం డేటింగ్ కాదు అంటున్నారు.

రామ్ చెప్పే డేటింగ్ కొత్త కాన్సెప్ట్. వెరైటీ భావన. గత కొన్నేళ్లుగా రామ్ 335 మందితో డేటింగ్ చేశారట. ఆయన లక్ష్యం 365 మంది తో డేటింగ్ చేయడం.మరో ముప్పైమందితో చేస్తే ఆయన టార్గెట్ సాధించినట్టే అంటున్నారు. రామ్ అంతమందితో డేటింగ్ చేసాడంటే నమ్మబుద్ధి కాదు. కానీ చేసాడంటున్నారు.

చెన్నైకి చెందిన సుందర్ రామ్ సినీ నటుడు కూడా. సినిమాల్లోకి రావడానికి ముందు నాటకాలు వేశారు. తమిళ మలయాళ చిత్రాల్లో కూడా నటించారు పైగా ప్రొఫెషనల్ డ్యాన్సర్ కూడా. 2012 నిర్భయ ఘటన రామ్ ను బాగా కలచి వేసింది. చాలా రోజులు బాధపడ్డారు. విదేశాలకు వెళ్లినప్పుడు కూడా చాలామంది అడిగేవాళ్లు “ఎందుకు మీ దేశంలో మహిళలను తీవ్రంగా హింసిస్తున్నారు ” అని. ఈ ప్రశ్నలకు జవాబు చెప్పలేక రామ్ ఇబ్బంది పడేవారు.

అవన్నీ రామ్ పై తీవ్ర ప్రభావం చూపాయి ఈ క్రమంలో రామ్ కొత్త డేటింగ్ కాన్సెప్ట్ ఎంచుకున్నాడు. మహిళలతో ప్రేమగా ఉంటూ వారికి .. వారి హక్కుల గురించి తెలియ జేయాలనుకున్నాడు. తాను మహిళలను గౌరవించే కుటుంబంలో పుట్టి పెరిగాడు. లింగ వివక్ష లేని పాఠశాలలో చదువుకున్నారు. స్కూల్ నుంచి బయటి ప్రపంచంలోకి అడుగు పెట్టాక సమాజంలో వేళ్లూనుకున్న లింగ వివక్షతను గమనించాడు. అలా ఆలోచించే ఈ 365 డేట్ ప్రణాళిక ఎంచుకున్నాడు.

దీని గురించి 2014 డిసెంబర్ ముప్పై ఒకటి న ఫేస్బుక్ లో అనౌన్స్ చేసాడు.మొదట్లో తెలిసిన పదిమంది నుంచి కాల్స్ వచ్చాయి. వాళ్ళతో డేటింగ్ కి వెళ్ళాడు. తమిళనాడులో వరదల వల్ల కొన్నాళ్ళు డేటింగ్ ప్రోగ్రాం వాయిదా పడింది. మరుసటి ఏడాది తిరిగి ప్రారంభించారు. మన దేశంలోనే కాక విదేశాల్లో కూడా పలువురు మహిళలతో డేటింగ్ కి వెళ్లానని రామ్ చెబుతున్నారు. వారిలో సొంత నాయనమ్మ .. చెత్త ఎత్తే మహిళలు.. ఐరిష్ సన్యాసిని, నటీమణులు .. మోడల్స్.. యోగా టీచర్, యాక్టివిస్ట్..రాజకీయాల్లో ఉన్నమహిళలు కూడా ఉన్నారట.

ఇక రామ్ భార్య నుంచి విడాకులు తీసుకుని ఒంటరిగా ఉంటున్నారు. “డేట్ అంటే శృంగార భరితమైనది కాదు. నా లక్ష్యం కేవలం ప్రేమ పంచడం మాత్రమే. ప్రతిరోజు నేను ప్రేమను అన్వేషిస్తాను. డేట్ అనగానే ఏదో ఊహించుకోవడం కాదు. అంతకు మించి ఆలోచించగలగాలి. మహిళలతో ప్రేమతో ఉన్నపుడే వాళ్ళు ఎదుర్కొనే సమస్యలు తెలుసుకుంటాం.” అంటారు రామ్.

రామ్ కథ మొత్తం చదివాక కొన్ని సందేహాలు కూడా కలుగుతాయి. ప్రేమను పంచె విశాల హృదయం ఉన్న రామ్ భార్యతో ఎందుకు విడాకులు తీసుకున్నారు? ఆమెతో ఎందుకు ప్రేమగా ఉండలేకపోయారు? ఆమె సమస్యలేమిటో కనుక్కుని ఎందుకు పరిష్కరించలేక పోయారు. రామ్ డేటింగ్ కాన్సెప్ట్ బాగానే ఉంది కానీ అందరూ సవ్యంగా ఉపయోగిస్తారనే గ్యారంటీ లేదు. మిస్ యూస్ అయ్యే అవకాశాలు ఎక్కువ. ఈ కాన్సెప్ట్ ను అడ్డం పెట్టుకుని మహిళలపై లైంగిక దాడులు కూడా జరగవచ్చు. నమ్మిన మహిళలను మోసం చేయవచ్చు. 

—————KNM  

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!