విజయాలైనా … వైఫల్యాలనయినా ప్రజలే డిసైడ్ చేస్తారు. ఓడిపోయిన వారు ఆ ప్రజలకు దగ్గరై మరల విజయం సాధించవచ్చు . కాకపోతే సరైన పద్దతిలో , సరైన వ్యూహంతో ముందుకు సాగాలి. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పార్టీ కేవలం ఒకటి ,రెండు ఎన్నికల్లో ఓడిపోయినంత మాత్రానా కాడి వదిలేసి దూరంగా వెళ్ళటం సబబుగా లేదని ఆయన అభిమానులు అంటున్నారు. నిజానికి ఇప్పటికి మించిపోయింది ఏమి లేదు. మంచి సలహాదారులను పెట్టుకుని .. రంగంలోకి దిగితే సానుకూల ఫలితాలు అవే వస్తాయి.
ప్రస్తుతం కాంగ్రెస్ కు సలహాదారులు ఎవరూ లేరు. అహమ్మద్ పటేల్ కనుమూసాక మరొకరిని సలహాదారునిగా ఎంచుకోలేదు. ఇపుడు కాంగ్రెస్ కు కేవలం రాజకీయ సలహాదారులు మాత్రమే కాక ఎన్నికల ఎత్తుగడలు,అనుసరించాల్సిన వ్యూహాలు చెప్పేవారి అవసరం ఎంతైనా ఉంది. గతంలో ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో ప్రశాంత్ కిశోర్ సలహాలు తీసుకున్న అనుభవం ఉంది. అయితే ఆయన ఇచ్చిన సలహాలు రాహుల్ పూర్తిగా పాటించలేదు అంటారు. గతం గతః అనుకుని మరొకరిని సలహాదారుడిగా పెట్టుకుని రాహుల్ ముందడుగు వేయాల్సిన అవసరం ఉంది. దేశం ఇపుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ బలోపేతం కాకపోతే సాంప్రదాయ ఓటు బ్యాంక్ మొత్తం వేరే పార్టీకి తరలిపోయే ప్రమాదం ఉంది.
ఇక వద్దు వద్దు అంటున్న మళ్ళీ రాహుల్ గాంధీ కే కాంగ్రెస్ పార్టీ పగ్గాలు అప్పగించే సూచనలు కనిపిస్తున్నాయి. పార్టీ అధ్యక్షుడి ఎన్నిక ప్రక్రియ త్వరలో మొదలవుతుందని అధికార ప్రతినిధి రణ్‌దీప్ సూర్జేవాలా అంటున్నారు. నిజానికి ఇప్పటికే చాలా ఆలస్యమైంది. ఇప్పటికైనా క్రియాశీలం కాకపోతే పార్టీ మరింత నష్టపోవడం ఖాయం. ఈ మాట పార్టీ నేతలే అంటున్నారు. 2019 సాధారణ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి రాహుల్ గాంధీ రాజీనామా చేశారు. ఆ దరిమిలా మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీనే తాత్కాలిక అధ్యక్షురాలిగా వ్యవహరిస్తున్నారు. ఏడాదిన్నర గడిచాక కూడా అధ్యక్ష పదవి ఎవరు చేపడతారో ఖరారు చేయలేకపోయారు. రేపు మాపు అంటూ రోజులు నెట్టుకొస్తున్నారు. దీంతో నాయకులు నిరాశ నిస్పృహలకు లోనవుతున్నారు. ఇక కార్యకర్తల సంగతి చెప్పనక్కర్లేదు. నేతలకు దిశా నిర్దేశం చేసేవారు లేరు. అధికార పక్షం విమర్శలకు జవాబు చెప్పలేక మౌనంగా ఉండిపోతున్నారు.
మరో పక్క బీజేపీ వివిధ రాష్ట్రాల్లో దూకుడు గా వ్యవహరిస్తోంది. త్వరలో అయిదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. కనీసం ఆ ఎన్నికల్లో అయినా గట్టి పోటీ ఇవ్వడానికి పార్టీ సమాయత్తం కావాలి. పార్టీ నాయకత్వ పదవికి పలువురి పేర్లు పరిశీలనకు వచ్చినప్పటికీ పార్టీలో ఎక్కువ మంది మళ్లీ రాహుల్ గాంధీనే బాధ్యతలు చేపట్టాలని అంటున్నారు. ఈ విషయంపై కొందరు సీనియర్ నేతలు అసంతృప్తి గా ఉన్నారు. ఆగస్టులో కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశానికి ముందు పార్టీ అధ్యక్షుడి తో కార్యవర్గాన్ని మార్చాలని కోరుతూ 23 మంది సీనియర్ నేతలు లేఖ రాసిన విషయం తెలిసిందే. ఈ లేఖ అప్పట్లో సంచలనంగా మారింది. పార్టీ అధ్యక్ష పదవి వేరొకరికి ఇవ్వడం అధినేత్రికి ఇష్టం లేదు. అందుకే ఆమె విషయం నాన్చుతున్నారని అసమ్మతి నేతలు అంటున్నారు.
మొత్తానికి పార్టీ లో ఒక గందరగోళ పరిస్థితి నెలకొంది. రాహుల్ .. సోనియా కూర్చుని మాట్లాడుకుని ఒక నిర్ణయానికి వస్తే కానీ అధ్యక్ష పదవి వ్యవహారం ఓ కొలిక్కి రాదు. నిజానికి లేఖ రాసిన వారంతా పార్టీకి విధేయులే. వారిని పిలిచి మాట్లాడి…మీ సలహాలను , సూచనలను తీసుకుంటాం .. సంక్షోభ సమయం కాబట్టి సహకరించండి అని అడిగితే ముందుకు రాని వారు ఉండరు. కానీ భేషజాలకు పోయి సమయం వృధా చేస్తున్నారనే విమర్శలు లేకపోలేదు. రాహుల్ ఇంకా నాన్చకుండా ఒక నిర్ణయం తీసుకోవాలి. జనాల్లోకి దూసుకుపోవాలి. సకాలంలో సరైన నిర్ణయం తీసుకుంటేనే ఫలితాలు సానుకూలంగా ఉంటాయి. లేదంటే … పార్టీ ని ఎవరూ రక్షించలేరు అని నాయకులు వాపోతున్నారు. వారి మాటల్లో కూడా నిజం ఉంది.
———— KNM