Mohammed Rafee ……………..
1998లో… చిలుకూరు వీసా బాలాజి టెంపుల్ లో హుండీ తీసేసారని వార్త గుప్పుమంది! నాకు ఆశ్చర్యం కలిగింది! ఆదాయాన్ని వద్దనే దమ్ము ధైర్యం ఎవరికి ఉంటుంది? “నాకుందిరా నాయనా” అని చాటి చెప్పారు! అతడే సౌందర రాజన్! ఆయన్ని చూడాలని ప్రత్యేకంగా మిత్రులు కుటుంబరావును కోరాను.
కుటుంబరావు కూడా అర్చకత్వం చేస్తుంటారు. వివిధ కార్యాలయాలకు వెళ్లి పూజలు చేస్తుండే వారు. ఆ తరువాత చింతామణి నాటకంలో సుబ్బిశెట్టి పాత్ర పోషించి నాటకాల ఆర్గనైజర్ గా మారాడు. ప్రస్తుతం రెండు రాష్ట్రాల సచివాలయంలో ఏ మంత్రి పదవీ బాధ్యతలు తీసుకోవాలన్నా కుటుంబరావును పిలుచుకుంటారు అది వేరే విషయం అనుకోండి!
కుటుంబరావు నన్ను తన స్కూటీపై ఎక్కించుకుని చిలుకూరు తీసుకెళ్లారు. అదృష్టవశాత్తు ఆరోజు సౌందర రాజన్ ఉన్నారు. పరిచయ వాక్యాలు, క్షేమ సమాచారాలు అయ్యాక గుడి చుట్టూ 11 ప్రదక్షిణలు చేయమన్నారు. “అబ్బాయ్ మీరు అక్కడ కుర్చీలో కూర్చోండి” అని నాతో అన్నారు. “లేదండి నేను కూడా కుటుంబరావుతో కలసి ప్రదక్షిణలు చేస్తాను” అని మొదలుపెట్టాను నడక! ఆయన ఆశ్చర్యంగా చూశారు.
నన్ను గమనిస్తూనే ఉన్నారని నాకు అర్ధమైంది! ఆ తరువాత గుడిలోకి తీసుకెళ్లి సంప్రదాయం ప్రకారం పూజ చేసి బొట్టు పెట్టారు. ప్రసాదం ఇచ్చారు. “వెళుతుండగా వుండండి ఎండ టైములో వచ్చారు” అంటూ ఆ పక్కనే వున్న ఇంట్లోకి తీసుకెళ్లారు. ఆ గుడి గురించి చెబుతున్నారు! ఆ గుడి మహత్యం గురించి చెబుతున్నారు. అలా మాట్లాడుతూ మాకూ భోజనం వడ్డించమని చెప్పేసారు!
ఆశ్చర్యపోవడం నావంతు! భోంచేసాక మమ్మల్ని పంపించారు. అలా మొదటి పరిచయంలోనే సౌందర రాజన్ నాకు బాగా నచ్చేసారు.అప్పట్లో దాట్ల నారాయణమూర్తి రాజు ఆంధ్రజ్యోతి వీక్లీ ఎడిటర్. ఆయనకు చెప్పాను ఆ గుడి గురించి! “ఇంకేం రాసేయ్” అన్నారు. మరుసటి వారం వీక్లీ లో చిలుకూరు బాలాజీ గుడి వ్యాసం అచ్చు అయ్యింది.
ఆ పత్రిక తీసుకుని నేను, దాట్ల గారు మళ్ళీ చిలుకూరు వెళ్ళాం! మళ్ళీ సౌందర రాజన్ సాంప్రదాయ భోజనం పెట్టి కానీ, పంపించలేదు! అదే ఐటమ్ వారు గుడి తరఫున నడిపించే వాక్ పత్రికలో కూడా నాపేరుతో ప్రచురించారు!
నాకు బ్రాహ్మణులు చాలా మంది మిత్రులు ఉన్నారు కానీ, సౌందర రాజన్ ప్రేమ, కుల మతాలకు భిన్నంగా ఆయన చూపించే ఆదరణ నన్ను బాగా కట్టిపడేసాయి. అసలు ఆ గుడిలో విఐపీలకు ప్రత్యేక క్యూ లేకుండా చేయడం ఆయన చేసిన గొప్ప సంస్కరణ! దేవుడు దగ్గర అందరూ సమానులే అనే విషయాన్ని ఆయన పాటించి చూపించారు.
నా పెళ్ళి ఫిక్స్ అయ్యింది. వెడ్డింగ్ కార్డు తీసుకుని వెళ్లి సౌందర్ రాజన్ గారికి ఇచ్చాను. వెంటనే ఆ కార్డును ఆయన స్వామి వారి పాదాల దగ్గర పెట్టి పూజ చేసి ఆశీర్వదించారు. ఒకసారి ఆ గుడిని ప్రభుత్వం ఆధీనం చేసుకోవాలని నిర్ణయించింది. ఆలయ వ్యవస్థాపకులుగా, ప్రధాన ధర్మకర్తగా సౌందర్ రాజన్ కు అది నచ్చలేదు! “ఒక్కసారి ముఖ్యమంత్రిని కలుస్తాను, స్వయానా గుడి తాళాలు ఆయనకే ఇస్తానని” భీష్మించుకున్నారు.
కొన్ని రోజులు దీక్షగా ఉపవాసంలో ఉన్నారు. గట్టి సంకల్పంతో ఉన్నారు. ప్రభుత్వమే మళ్ళీ వెనకడుగు వేసింది! ఆ సందర్భంలో ప్రెస్ మీట్ పెట్టించి నేను నావంతు సహకారం అందించాను. సౌందర రాజన్ బయో కెమిస్ట్రీ అధ్యాపకులుగా పని చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ రిజిస్ట్రార్ గా ఉద్యోగ విరమణ పొందారు. వారి కుటుంబానికి అనాదిగా వస్తున్న ఈ గుడి బాధ్యతలు చేపట్టారు.
ఆయన వైష్ణవ సంప్రదాయంలో ఎంత నిష్ఠగా వున్నా ఎదుటివారిని మాత్రం ఎంతో గొప్పగా ప్రేమించి అభిమానించి ఆదరించే ఆయన తత్వం నాకు చాలా ఇష్టం! అమెరికా నుంచి మిత్రులు వస్తే తప్పనిసరిగా ఆ గుడికి తీసుకెళ్లడం నాకు అలవాటుగా మారిపోయింది!
ఆయన వయసు పైబడ్డాక అలా స్టూల్ వేసుకుని ప్రాంగణంలో కూర్చుండే వారు! ఎంతో ఠీవిగా ఒక గొప్ప సంప్రదాయానికి నిలువుటద్ధంలా కనిపించేవారు! చూడగానే రెండు చేతులు పైకెత్తి నమస్కరించాలని పిస్తుంది! పాదాభివందనం చేసి ఆశీస్సులు అందు కోవాలనిపిస్తుంది! కల్మషం కపటం కుట్రలు కులాలు మతాలు ఏమాత్రం తెలియని పట్టించుకోని నాకు తెలిసిన గొప్ప మనీషి సౌందర రాజన్!
విదేశాలకు ముఖ్యంగా అమెరికా వీసాకు వెళ్లే వాళ్ళంతా ఆ గుడిలో 108 ప్రదక్షిణలు చేస్తే వీసా వచ్చేసినట్లే అన్నంత ప్రగాఢ నమ్మకంతో ఉంటారు. అసలు అక్కడ స్పీడ్ గా ఒక వలయంలా భక్తులు తిరుగుతుంటే చూసి తీరాల్సిందే! ఆ గుడికి అంతటి ఖ్యాతి, నమ్మకం, ఆదరణ తీసుకు రావడంలో సౌందర రాజన్ కృషి అనన్య సామాన్యం, అజరామరం!
వారి కుమారుడు రంగరాజన్ ఒక దళితుడిని తన భుజాలపై ఎక్కించుకుని మునివాహన సేవ చేయడం వెనుక సౌందర రాజన్ కృషి, ప్రోత్సాహం, పెంపకం, క్రమశిక్షణ అని వేరేగా చెప్పక్కరలేదు. ఫిబ్రవరి 27న మధ్యాహ్నం వృద్దాప్య అనారోగ్యంతో చికిత్స పొందుతూ ఇంటి దగ్గరే సౌందర రాజన్ కనుమూశారు. ఆధ్యాత్మిక చైతన్యశీలి, సంస్కరణల సౌందర రాజన్ గారికి అశ్రు నివాళి.

