Taadi Prakash ……………………..
అతనొక రెస్ట్ లెస్ రచయిత. రగులుతూ ఉండే తీవ్రవాది. ఎగురుతూ ఉండే జెండాలా బతికాడు. ప్రజల మనిషి. కూలి జనాన్ని కూడగట్టిన నాయకుడు. రాజీపడే మనిషి కాదు. రాబిన్ హుడ్ లాంటి వాడు. ఒక బ్యాంక్ దోపిడీకి ప్రయత్నించాడు. పన్నెండు నవలలు రాశాడు.
కదంతొక్కే వాక్యాల వాడు. అతని అక్షరాలు పాఠకుల్ని దహించివేస్తాయి.ఆయన పేరు కొమ్మిరెడ్డి విశ్వమోహనరెడ్డి. కడపరెడ్ల పౌరుషం తనువంతా నిండిన తిరుగుబాటుదారు. జనం కోసం జీవితాన్ని పణం పెట్టిన వీరుడు.
ఆ విప్లవకారుని రచనలూ, జీవితం గురించి మనకు తెలిసింది చాలా తక్కువ. ఏప్రిల్ 11 న జనసాహితి సంస్థ వాళ్ళు గుంటూరులో విశ్వ మోహనరెడ్డి సంస్మరణ సభ జరిపారు. ఆ రచయిత,పోరాటం గురించి సాహితీవేత్తలు దివికుమార్, ఎన్.వి .ఎస్.నాగభూషనమ్ సంపాదకుడు చలసాని ప్రసాదరావు ,కొత్తపల్లి రవిబాబు, మరికొందరి వ్యాసాలతో ‘జ్వాలాశిఖ విశ్వ మోహన్’అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు.
ఆ వ్యాసాల్లోని ఆసక్తికరమైన విశేషాలు మీ కోసం ….
విశ్వమోహనరెడ్డి ఒక ఆదర్శం కోసం అగ్గిరవ్వలా బతికాడు. ఆయనొక రొమాంటిక్ హీరో. 1949లో కడప జిల్లాలో ఒక ధనిక భూస్వామ్య కుటుంబంలో పుట్టాడు.పొద్దుటూరు దగ్గర పొట్టిపాడు ఆయన స్వగ్రామం . యవ్వనప్రాయంలో సినిమా తీయాలనే తాపత్రయంలో డబ్బు నష్టపోయాడు.
ఆదర్శ వివాహం చేసుకోవాలనుకున్నాడు. ఒక వికలాంగురాలిని పెళ్ళి చేసుకోవాలను కుంటున్నానని పేపర్ ప్రకటన యిచ్చాడు. రాజమండ్రికి చెందిన గుర్రం ఇందిరా దేవి అనే వికలాంగురాలు ముందుకొచ్చింది. ఆమెనే పెళ్ళి చేసుకున్నాడు.
వాళ్ళకో బాబు,పేరు లెనిన్.విశ్వ మోహన్ తెల్లవారుజామున నాలుగింటికే లేచేవాడు. ఇంట్లోకి నీళ్ళు తెచ్చి పోసేవాడు. వంటకి కావాల్సినవన్నీ అమర్చిపెట్టేవాడు. నడవలేదు కనుక,అన్నీ సమకూరిస్తేనే వంట చేసేది. తర్వాత టీచర్ ఉద్యోగానికి వెళ్ళేది.
ఇంటి పని ముగిసాక,విశ్వమోహన్ జనం దగ్గరకు వెళ్ళేవాడు. వాళ్ళ సమస్యలు వినడం,మాట్లాడటం,ఆర్జనైజ్ చేయడం,రోజంతా అదే పని. అంగవైకల్యం వున్న భార్యకు సహాయంగా ఉండడం కోసం ఒక అనాథ పిల్లని ఆయన పెంచాడు.ఆయన మొదట సి.పి.ఐ లో పని చేసాడు.
కడప జిల్లాలో ప్రసిద్ధ కమ్యునిస్టు నాయకుడు ఈశ్వరరెడ్డి గెలుపు కోసం ఎన్నికల్లో పని చేసాడు.క్రమంగా విప్లవ రాజకీయాల వైపు వచ్చాడు. లిన్ పియావో గ్రూపులోను ,తరిమెల నాగిరెడ్డి యు.సి.సి .ఆర్ .ఐ (ఎం .ఎల్ )పార్టీలో చురుగ్గా పని చేసాడు.
25-30 ఏళ్ల వయసులో ప్రకాశం జిల్లా ఇంకొల్లులో అడుగు పెట్టాడు.పల్నాడు ప్రాంతంలో జనాన్ని కూడగట్టాడు. ‘గెరిల్లా’ అనే పత్రిక పెట్టాడు. గెరిల్లా నాటక సమాజాన్ని మొదలుపెట్టాడు. నవలలతో పాటు కొన్ని నాటకాలూ ,పాటలు కూడా రాశాడు. ఇంకొల్లులో ఉన్నప్పుడే ఆయన నవలలన్నీ రాశాడు. రాయలసీమ ఫ్యాక్షన్ రాజకీయాల నెత్తురు మడుగుల గురించి ‘మానవ హోమం’అనే నవల రాసాడు.
నవల చదివి,జడుసుకున్న పత్రికల వాళ్ళు తిప్పి పంపించారు. అప్పుడు విశ్వమోహన్ దాన్ని ‘చతుర’కి పంపించాడు. ఎడిటర్ చలసాని ప్రసాదరావు చదివి ఆశ్చర్యపోయాడు. ఇంత దారుణం నిజంగా జరుగుతోందా ?అని అప్పటి కడప ‘ఈనాడు’రిపోర్టర్లను ,కొందరు రాజకీయ నాయకులను అడిగారు. అందులో రాసినవి పచ్చి నిజాలని వాళ్ళు చెప్పారు.
1980 మార్చ్ లో చతుర లో ఆ నవల వచ్చింది. నవలకి వచ్చే రెమ్యునరేషన్ తాను స్థాపించిన హమాలీ యునియన్ ఖర్చుల కోసమేనని ,తన భార్య తన ఖర్చులు చూసుకోగలదని ఎడిటర్ తో అన్నాడు విశ్వమోహన్. ఆ కాలంలోనే ‘లిన్ పియావో’ పార్టీ ఆదేశంతో ఒక ప్రభుత్వ బ్యాంకుని దోపిడీ చేయాలని ప్రయత్నించి విఫలమయ్యాడు.
పారిపోతుండగా జీపు బురదలో కూరుకుపోవడంతో పోలీసులకు దొరికిపోయాడు. చాలాసార్లు జైలుకెళ్ళడం,తప్పించుకు పారిపోవడం …ఆ అనుభవాలతో ‘జైలు’అనే మంచి నవల రాసాడు. ఉద్యమకారుడిగా విశ్రాంతి లేకుండా పని చేసాడు. ఊరేగింపులూ,మెమోరాండాలు నడిచాయి. ఫారెస్టు,ప్రభుత్వ బంజర్లు,దేవాలయ మిగులు భూముల కోసం వేలాదిమంది రైతు కూలీలను కదిలించాడు.
గుంటూరు,ప్రకాశం జిల్లాల్లో పోరాటాలకు నాయకత్వం వహించాడు. పిడుగురాళ్ళలో 70 ఎకరాలలో పేదల కోసం 700 ఇళ్ళు నిర్మించాడు. లెనిన్ నగర్ అని పేరు పెట్టాడు. కొందరు పెద్దలు ,గూండాలు స్థలాలు దక్కించుకోవడానికి ప్రయత్నం చేస్తే ,వాళ్ళని తిప్పి కొట్టాడు. సున్నపు బట్టిలలో పని చేసే నిరుపేద కార్మికులకే ఈ ఇళ్ళు అని గట్టిగా చెప్పాడు.
కొండమోడు అటవీ ప్రాంతంలో ఖనిజం తవ్విన 60 ఎకరాల్ని ఆక్రమించి శ్రామికుల కోసం 300 ఇళ్ళు నిర్మించి తరిమెల నాగిరెడ్డి నగర్ అని పేరు పెట్టాడు. రాజకీయ నాయకులు రౌడిలతో దాడి చేయిస్తే ధైర్యంగా ఎదుర్కున్నాడు. గుంటూరు జిల్లా పిడుగురాళ్ళ లో హత్యానేరం మోపినప్పుడు రహస్యజీవనంలోకి వెళ్ళాడు.
పల్నాడులోని పిడుగురాళ్ళ,రాజుపాలెం,వినుకొండ.ప్రకాశం జిల్లాలోని దొనకొండ, త్రిపురాంతకం,మార్కాపురం ప్రాంతాల్లో భూముల కోసం,మానవ హక్కుల కోసం ,పెత్తందార్ల దోపిడీకి వ్యతిరేకంగా సాహసోపేతంగా పోరాటం చేసాడు. సామాన్యజనం ప్రేమాభిమానాలు పొందాడు. చనిపోయేనాటికి విశ్వమోహనరెడ్డి వయసు యాభై ఏళ్ళు.
అది 2000 వ సంవత్సరం. ఏప్రిల్ 11 వ తేది. ఆ రాత్రి ప్రకాశం జిల్లా,దొనకొండ మండలం,మంగినపూడిలో విశ్వమోహన్ ,పి.ఓ .డబ్ల్యూ (స్త్రీ విముక్తి )కార్యకర్త మరియమ్మలు ఒక సానుభుతిపరుడి ఇంటికి వెళ్ళారు. స్థానిక సమస్యపై మాట్లాడుతూ ఉండగా హఠాత్తుగా వచ్చిన పోలీసులు వారిద్దరిని అరెస్టు చేసారు. గుంటూరు జిల్లా వినుకొండ మండలం దొండపాడు పరిసరాల్లో తెల్లవారుజామున విశ్వ మోహన్ ని ,మరియమ్మని కాల్చి చంపారు.
ఎన్ కౌంటర్ లో చనిపోయారని పోలీసులు పాత కట్టుకథనే చెప్పారు. చంద్రబాబు పాలన సాగుతున్న ఆ రోజుల్లో విశ్వమోహన్ పేరున స్థూపం నిర్మించడానికి కూడా ఒప్పుకోలేదు. ఎన్నికల్లో చంద్రబాబు చిత్తుగా ఓడిపోయి,కొత్త ప్రభుత్వం వచ్చాక ,విశ్వమోహన్ 60 వ జయంతి సందర్భంగా పిడుగురాళ్ళలోని లెనిన్ నగర్ లో 60 అడుగుల ఎత్తులో స్మారక స్థూపాన్ని కాలనీవాసులు నిర్మించుకున్నారు.
చంద్రబాబు ప్రభుత్వం చేసిన ఈ హేయమైన హత్యని ప్రసిద్ధ రచయితలు,సంపాదకులు గట్టిగా వ్యతిరేకించారు. చలసాని ప్రసాదరావు ,ఎ బి కె ప్రసాద్ ,సినీ దర్శకులు కె.బి.తిలక్ ,త్రిపురనేని మహారథి ,భాషా శాస్త్రవేత్త చేకూరి రామారావు లాంటివారు ‘జనసాహితి’బాధ్యుల వెంట నిలబడి గవర్నర్ కి విజ్ఞాపన ఇచ్చారు.
2000 సంవత్సరం మే నెల ‘ప్రజాసాహితి’ని విశ్వమోహనరెడ్డి ప్రత్యేక సంచికగా తెచ్చారు. విశ్వమోహన్ నవలు జైలు,మానవహోమం,దొంగలు ,దాడి కలిపి తెనాలి సాహిత్య వేదిక వాళ్ళు ఒక పుస్తకంగా తెచ్చారు. అనేకమంది విశ్వమోహన్ రెడ్లు తయారయ్యే ప్రమాదం వుందని పసికట్టి,భయపడిన ప్రభుత్వం ,ఆయన్ని క్రూరంగా అంతమొందించింది.
విశ్వమోహన్ రాసిన విలువైన నవలల గురించి మాట్లాడుకోవాల్సి వుంది.విశ్వమోహన్ రెడ్డి ,
జాక్ లండన్ జీవన పోరాటానికి ,మాక్సిం గోర్కి జీవితానికి చాలా పోలికలు కనిపిస్తాయి. అయితే విశ్వ మోహన రెడ్డి సాహిత్యాన్ని చదివి ,విశ్లేషించి,వ్యాసాలు రాసిన వాళ్ళు ఒకరిద్దరూ మాత్రమే.
ఆయన నవలలన్నీ రీ ప్రింట్ చేయాల్సిన అవసరం ఉంది. మానవ జీవితంలోని చీకటి కోణాల గురించి రికార్డు చేసిన అరుదైన సాహిత్యం అది. 1978 నుంచి 1990 వరకూ మాత్రమె ఆయన రాయగలిగారు. తర్వాత పది సంవత్సరాలు ప్రజా ఉద్యమాలకు అంకితమై పని చేసారు.
1981 డిసెంబరు నుంచి 1982 ఏప్రిల్ దాకా వరుసగా ఐదు నెలలు చతురలో ఆయన నవలలే వివిధ పేర్లతో వచ్చాయి. అది ఒక రచయితకు దక్కిన అరుదైన గౌరవం. ఆయన ‘మానవహోమం’నవల ‘భోగి మంటలు’సినిమాగా వచ్చింది. తెలుగు సినిమా రంగం ఎందరెందర్నీ ఎలా బలి తీసుకుంటుందో చెప్పిన నవల మాయాలోకం.
కర్నూలు జిల్లా నల్లమల అడవుల్లో బతికే చెంచుల జీవితాల గురించి రాసిన శక్తివంతమైన నవల ‘దాడి.’పోలీసు వ్యవస్థలో భాగమైన మన జైళ్ళ వికృత రూపాన్ని బయట పెట్టిన నవల ‘జైలు.’ విశ్వమోహన్ మనం ఊహించలేనంత వేగంగా రాసే రచయిత. రెండే రెండు రోజుల్లో…48 గంటల్లోనే ఆయనొక నవల పూర్తి చేసేవాడు.
అక్షరాలను అగ్నికణాలుగా మారే ఆ ఫోర్స్ అందువల్లనే వచ్చిందేమో!రాజకీయాలు ,పేదజనం సమస్యలే ముఖ్యం అనుకున్న కొమ్మిరెడ్డి విశ్వమోహన్ రెడ్డి ,చివరి పది సంవత్సరాలు రాయడం మానుకున్నాడు. అది తెలుగు సాహిత్యానికి పెద్ద లోటు. అది మరెవరూ పూడ్చలేనిది.
రిక్షా తొక్కి ,కార్మికుడిగా పని చేసి, కార్యకర్తగా తిరిగి ,నాయకుడిగా ఎదిగి , జనాన్ని ఉరకలెత్తించే ఉద్యమాలు నడిపి, జైళ్ళ నుండి తప్పించుకుని ,నవలలు రాసీ ,పాటలు కట్టి ,రొమాంటిక్ హీరో అనే మాటకి పర్యాయపదంగా బతికిన కొమ్మిరెడ్డి మోహనరెడ్డి లాంటి మరో రచయితనీ, మరో విప్లవ కారుణ్ణి ,మరో తిరుగుబాటుదారున్ని మనం చూడగలమా?
ఆయన్ని అనార్కిస్టు అనడం చాల తేలిక.అది జనం పట్ల ప్రేమ తొణికిసలాడే కళాత్మకమైన అరాచకం! ఏ పార్టీ పరిమితులకు, ఆంక్షలకు లొంగని ఒక తలవొంచని తత్త్వం !చావుతప్పదని తెలిసి కూడా ,లెక్క లేకుండా నమ్మిన ఆదర్శం వెంట నడిచిన మనిషితనం!
రండి ,ఒక్కసారి విశ్వమోహనరెడ్డిని చదువుకుందాం. మంచి మనుషులం అయినందుకు ,సుఖంగా,భద్రంగా , భయంతో బతుకుతున్నందుకు సామూహికంగా సిగ్గు పడదాం!
writer phone no 9704541559