ఈ పింక్ సిటీ ని చూసారా ?

Sharing is Caring...

So many specialities………………………………………

మన దేశంలోని అత్యంత ఆకర్షణీయమైన నగరాలలో  జైపూర్ ఒకటి. ఇది రాజస్థాన్ రాష్ట్రానికి రాజధాని, దీనికో ప్రత్యేక గుర్తింపు ఉంది. దీనిని పింక్ సిటీ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు. జైపూర్‌ని అలా పిలవడానికి గల కారణాన్ని తెలుసుకోవాలంటే, మనం చరిత్రలోకి వెళ్ళాలి.

జైపూర్ పింక్ సిటీ పేరుతో ప్రసిద్ధి చెందడానికి అన్నిభవనాల నిర్మాణానికి గులాబీ రంగులో ఉన్నరాతిని వాడటమే  ప్రధాన కారణం. ఈ నగరాన్ని చూసిన ఎవరైనా జైపూర్ భవనాలన్నీ గులాబీ రంగులో ఉన్నాయనే చెబుతారు. 

ఈ గులాబీ రంగును వాడటానికి కూడా మరో కారణం ఉంది. అదేమిటంటే …  1876లో, ప్రిన్స్ ఆఫ్ వేల్స్, క్వీన్ విక్టోరియా భారతదేశాన్ని సందర్శించారు. ఆ సందర్భంగా జైపూర్ మహారాజా రామ్ సింగ్ అతిథులను స్వాగతించడానికి నగరం మొత్తాన్ని గులాబీ రంగులో అలంకరించారు. గులాబీ రంగు ఆతిధ్యాన్ని సూచిస్తుంది.

నగరంలోని  అన్ని భవనాలకు ఒకే రంగు వేయాలని ఆదేశిస్తూ ఆ తరువాత ఒక చట్టం కూడా తీసుకొచ్చారు. అప్పటినుంచి జైపూర్ ను  పింక్ సిటీ గా పిలుస్తున్నారు. ఈ సంప్రదాయాన్ని స్థానికులు కూడా అనుసరిస్తున్నారు.  

ఇక జైపూర్ చరిత్రలోకి వెళితే ఈ నగరాన్ని 1699 నుంచి 1744 వరకు కచావాహ రాజపుత్ర మహారాజు సవాయి జై సింగ్ 2 పాలించారు. ఆయన సారథ్యంలోనే ఈ జైపూర్ నగరం నిర్మితమైంది. ప్రారంభంలో  రాజధాని అంబర్. దానిని ప్రస్తుతం అమెర్ అని పిలుస్తున్నారు.ఇది జైపూర్ నుండి 11 కి.మీ దూరంలో ఉంది.

ఔరంగజేబు మరణానంతరం మొఘల్ రాజు బహదూర్ షా దాడి చేసే  ప్రమాదం ఉందని భావించి మహారాజా సవాయి జై సింగ్ 2 తన రాజధాని నగరాన్ని మార్చేశారు. నానాటికీ పెరుగుతున్నజనాభా,  నీటి కొరత తదితర అంశాలను దృష్టిలో ఉంచుకుని కొత్త రాజధానిని ప్రణాళికాబద్ధం గా నిర్మించి మహారాజా సవాయి జై సింగ్  జైపూర్ వ్యవస్థాపకుడిగా చరిత్ర కెక్కారు.

మహారాజు సవాయి జై సింగ్ 2  గొప్ప వాస్తుశిల్పి, ఖగోళ శాస్త్రవేత్త. ఆయనకు భారతీయ వాస్తుపై మంచి అవగాహన ఉంది. సవాయి జై సింగ్ 2 తన అభిరుచి మేరకు వాస్తును అనుసరిస్తూ జైపూర్ నగరాన్ని నిర్మించారు. జైపూర్ వాస్తు శిల్పం మొత్తం ప్రపంచంలోని ఆధునిక వాస్తుశిల్పులకు అద్భుతమైన కేస్ స్టడీగా ఉండటానికి కారణం ఇదేనంటారు. తర్వాత కాలంలో రాజులు కూడా ఈ నగర విస్తరణకు కృషి చేశారు.

జైపూర్ ప్రజలు ఉత్సవాలు, పండుగలు, వేడుకలను ఘనంగా నిర్వహిస్తారు. వందల సంవత్సరాల పురాతన కోటలు …  స్మారక చిహ్నాల కారణంగా జైపూర్ హెరిటేజ్ సిటీగా గుర్తింపు పొందింది.
జై పూర్ అతిపెద్ద నగరం. ఒకప్పుడు రాజవంశాలు నివసించిన రాజభవనాలు,కోటలు ఈనాటికి కనిపిస్తాయి.గంభీరత్వాన్ని చాటే కోటలు, హవేలీలు , అందమైన దేవాలయాలు, నిర్మలమైన ప్రకృతి దృశ్యాలు, గొప్ప సాంస్కృతిక వారసత్వం  పర్యాటకులను ఆకర్షిస్తుంటాయి.

జైపూర్ లో  వివిధ సీజన్లలో ఉష్ణోగ్రతలు మారుతూ ఉంటాయి. ఏప్రిల్ నుండి జూన్ వరకు వేసవి నెలలలో సగటు రోజువారీ ఉష్ణోగ్రత 35 డిగ్రీల ఉంటుంది. జైపూర్‌లో మే, జూన్‌ మాసాల్లో అత్యంత వేడిగా ఉంటుంది. ఈ నెలల్లో ఉష్ణోగ్రత 40-45 డిగ్రీలకు  చేరుకుంటుంది జూన్ సెప్టెంబర్ మధ్య రుతు పవనాలు కేంద్రీకృతమై ఉంటాయి.వర్ష పాతం సగటున 500 మి. మీ ఉంటుంది. 

జైపూర్ లో  సందర్శనా స్థలాలు చాలానే ఉన్నాయి. పాత కాలం నాటి ప్యాలెస్‌లు .. వాటి నిర్మాణ తీరు తెన్నులు అబ్బుర పరుస్తాయి. నాటి రాజభవనాల గోడలపై అద్భుతమైన రాజస్థానీ కళాకృతులు కనువిందు చేస్తాయి.కొన్ని పురాతన భవనాలను హోటళ్లుగా మార్చారు, చూడదగిన వాటిలో అమెర్ ప్యాలెస్, జల్ మహల్, హవా మహల్ ముఖ్యమైనవి.

జైపూర్ ను ఏలిన రాజులు  నగరం చుట్టూ అనేక కోటలను నిర్మించారు.జైపూర్ వెళితే అమెర్ కోటను సందర్శించవచ్చు. అక్కడ ఏనుగు సవారీ ఎక్కి ఆనంద వచ్చు. అలాగే ఇటీవలే  పునర్నిర్మించిన జైఘర్ కోటను చూడవచ్చు. అక్కడికి దగ్గర్లో ఉన్న నహర్‌ఘర్ కోటను సందర్శించవచ్చు.

మరే రాష్ట్రంలో లేని విధంగా జైపూర్ లో చాలా మ్యూజియాలున్నాయి. సిటీ ప్యాలెస్ మ్యూజియం,ఆల్బర్ట్ హాల్ మ్యూజియం,జైపూర్ డాల్స్ మ్యూజియం,జైపూర్ వాక్స్ మ్యూజియం,జవహర్ కళా కేంద్రం,అనోఖి మ్యూజియం,దివాన్-ఎ-ఆమ్ మ్యూజియం,జ్యువెల్స్ లేక్ ప్యాలెస్ మ్యూజియం,జ్ఞాన్ మ్యూజియం అనే పేర్లతో వీటిని పిలుస్తారు.

వీటిలో దేని ప్రత్యేకత దానిదే అని చెప్పుకోవాలి. ఎంతో జాగ్రత్తగా భద్రపరిచిన  అసంఖ్యాక కళాఖండాలు, నాటి పాలకులు ధరించిన రాచరిక దుస్తులు, కుండలు, చెక్క శిల్పాలు, లోహపు వస్తువులను వీటిలో తిలకించవచ్చు. అలాగే అక్కడున్న అందమైన పెయింటింగ్‌లు, శిల్పాలను చూడవచ్చు.  

షాపింగ్ ప్రియులు వైవిధ్యభరితమైన ఎన్నో వస్తువులను ఇక్కడ కొనుగోలు చేయవచ్చు. ఇక్కడి జోహ్రి బజార్ లో ఆకర్షణీయమైన మోడల్స్ లో ఆభరణాలు లభిస్తాయి. బంగారం, వెండి, కుందన్, మరేదైనా ఆభరణాలు కావాలన్నా జైపూర్ సరైన కేంద్రం.  నగలతో పాటు, వివిధ రకాల రత్నాలను కూడా కొనుగోలు చేయవచ్చు. మంచి డిజైన్లతో కూడిన లేహరియా చీరలు …..బంధాని దుపట్టాలు, ఎంబ్రాయిడరీ బెడ్ షీట్లు,హ్యాండ్‌క్రాఫ్ట్ హ్యాండ్‌ బ్యాగు లు, లక్ బ్యాంగిల్స్ ఇక్కడ లభిస్తాయి. 

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!