ఈ నూర్జహాన్ మామిడి పండ్ల గురించి విన్నారా ?

Sharing is Caring...

Noorjahan ………………………………………………. 

ఈ పేరు వినగానే మనకు మొగల్ సామ్రాజ్య నేత జహంగీర్ సతీమణి నూర్జహాన్  పేరు గుర్తుకొస్తుంది. అదే పేరు మీద మామిడి పండ్లు కూడా వస్తున్నాయి. మామిడి పండ్లలో 35 రకాల పాపులర్ బ్రాండ్ల పైనే ఉన్నాయి. మనకు తెలిసినవి .. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా దొరికేవి బంగినపల్లి, నూజివీడు,చిన్నరసాలు, పెద్ద రసాలు. అలాగే తోతాపురి, సువర్ణరేఖ,ఆమ్రపాలి వంటి రకాలు మనకు అందుబాటులో ఉండే మామిడి పండ్లు.

వీటి ధరలు కూడా సరసంగానే ఉంటాయి. సంపన్నుల నుంచి సామాన్యుల వరకు ఎండా కాలంలో వచ్చే ఈ పండ్లను తప్పని సరిగా ఆరగిస్తారు. ఈ పండ్లలో బంగినపల్లి, తోతాపురి శ్రేష్టమైనవి గా చెబుతుంటారు. మరెన్నో పేర్లతో కూడా మామిడి పండ్లు మార్కెట్లో కొస్తుంటాయి.ప్రాంతాల వారీగా వీటిని ఉపయోగిస్తుంటారు. ప్రపంచ వ్యాప్తంగా 1000 రకాల పైనే మామిడి పండ్ల రకాలున్నాయి.

ఇక పైన చెప్పిన 35 రకాల్లోనే నూర్జహాన్ రకం మామిడి పండ్లు కూడా ఉన్నాయి. ఈ రకం పండ్లను మధ్యప్రదేశ్లోని ఆలీరాజ్ పూర్ జిల్లాలో మాత్రమే పండిస్తారు. ఈ మామిడి పండు బరువు కిలోలలో  ఉంటుంది. రుచి కూడా బాగుంటుంది. అందుకే ఈ నూర్జహాన్ మామిడి పండ్లకు డిమాండ్ ఎక్కువ.

ఈ పండ్ల ధర రూ. 500 నుంచి 1000 వరకు పలుకుతుంది. ఆఫ్ఘన్ మూలాలు ఉన్న ఈ నూర్జహాన్ మామిడి తోటలు ఆలీరాజపూర్ జిల్లాలోని కత్తివాడ లో ఎక్కువగా ఉన్నాయి. ఈ కత్తివాడ గుజరాత్ సరిహద్దు లో ఉంది. అక్కడే ఈ పండ్లు ఎక్కువగా పండుతాయి.

ఫిబ్రవరిలో కాపు మొదలై జూన్ నాటికి పండ్లు చేతికొస్తాయి. సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే తొందరగా అంతరించిపోయే రకాల్లో ఇదొకటి. ఒక చెట్టుకి సుమారు 80 కాయలు వరకు కాస్తాయి. కాయలు బరువు ఎక్కువగా ఉంటాయి. అందుకే దీన్ని అరుదైన మామిడి పండు అంటారు.

ఒక్కోసారి చెట్ల కొమ్మలు కూడా బరువుకి విరిగి పోతుంటాయి. ఒక్కోపండు 2 కిలోలనుంచి 3.5 కిలోల వరకు బరువు ఉంటుంది. ఒక్కో సీజన్ లో ఒక్కోరకం ధర పలుకుతాయి. గతంలో పండు 1200 కి కూడా అమ్మారట. ఈ సారి ధర వెయ్యి పలుకుతోంది. ఇవి మన తెలుగు రాష్ట్రాల్లో లభ్యం కావు. కావాలంటే వెళ్లి తెచ్చుకోవాల్సిందే. ఇండోర్ లో దొరుకుతాయి.

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!