అరకు కాఫీ ఘుమఘుమలను ఆస్వాదించారా ?

Sharing is Caring...

అరకు కాఫీ ఇప్పుడో అంతర్జాతీయ బ్రాండ్ ..  విశాఖ ఏజెన్సీలో 1820 ప్రాంతంలో కాఫీ ప్రస్థానం మొదలైంది. మొదట్లో గిరిజనులు పెరటి పంటగా పండించుకునేవారు. కాఫీ గింజల్ని చిల్లరగా సేకరించి టోకున అమ్ముకోడానికి దళారి వ్యవస్థ పుట్టుకొచ్చింది. లాభాల రుచి మరిగాక.. జైపూర్ సంస్థానాధీశులు పాచిపెంట, అరకు, పాడేరు తదితర అటవీ ప్రాంతాల్లో కాఫీ తోటల పెంపకాన్ని మొదలు పెట్టారు.

అప్పట్లో రాఘవేంద్రరావు అనే అధికారి ఉండేవారు. ఆంధ్రప్రదేశ్, ఒడిశా, మధ్యప్రదేశ్‌లలోని వివిధ ప్రాంతాలు కాఫీ పంటకు అనుకూలమంటూ ప్రభుత్వానికి నివేదిక పంపారు.ఆ జాబితాలో అరకు కూడా ఉంది. అప్పటి నుంచే అందరి దృష్టి అరకు పై పడింది. 1960ప్రాంతంలో అనంతగిరి, మినుములూరు ప్రాంతాల్లో నాలుగు వేల హెక్టార్లలో కాఫీ సాగు మొదలైంది.

మెల్లమెల్లగా పంట పాడేరు, చింతపల్లి, అరకు ప్రాంతాలకూ పరిచయమైంది. 1986లో కాఫీ బోర్డు, గిరిజన సహకార సంస్థ సంయుక్తంగా తోటల విస్తరణకు నడుం బిగించాయి. గిరిజనానికి కాఫీ గింజల్ని పండించడమంటూ తెలిసింది కానీ, ఆధునిక వ్యవసాయ పద్ధతుల మీద మాత్రం పెద్దగా అవగాహన రాలేదు. దీంతో గింజ నాణ్యత దెబ్బతింది. దిగుబడి తగ్గింది. రాబడి నామమాత్రమైంది.  

ఆ సమయంలోనే నాంది ఫౌండేషన్ వచ్చింది. చిన్న సన్నకారు గిరిజన రైతుల పరస్పర సహకార సంఘం ద్వారా … ఆరు వందల గ్రామాల్లోని పదకొండు వేల మంది రైతుల్ని ఓ గొడుగు కిందికి తీసుకొచ్చింది. పంటల కోసం హద్దూ అదుపూ లేకుండా వాడే క్రిమి సంహారకాలు ప్రకృతిని వికృతంగా మార్చే ప్రమాదం ఉందని అప్పట్లోనే నాంది పసిగట్టింది.

పరిష్కారంగా సేంద్రియ సేద్యాన్ని గిరిజనులకు నేర్పించింది.  నాంది గిరిపుత్రులకు మార్కెటింగ్ పాఠాలు బోధించింది. కొత్త రకాల్ని పరిచయం చేసింది. కాఫీ పంటని ఒక్కోలా సాగు చేస్తే ఒక్కో రుచి వస్తుంది. కొన్ని జాతుల్ని పెద్ద పెద్ద చెట్ల నీడలో పెంచితే, ఆ విత్తనాలకో ప్రత్యేక పరిమళం అబ్బుతుంది. ఇలాంటి అనేక చిట్కాల్ని గిరిజనులకు నేర్పించింది. 

ఇక అరకు కాఫీ రుచి ప్రత్యేకమైనది. అందులో రసాయనాల జాడే ఉండదు. మన్నెంలోని మిగతా ప్రాంతాల గిరిజనులూ ఇదే బాటలో నడుస్తున్నారు. అరకు, అనంతగిరి, డుంబ్రిగుడ, పెదబయలు ప్రాంతాల్లో రైతులు అరబికా కాఫీని పండిస్తుండగా… చింతపల్లి, గూడెం కొత్త వీధి మండలాల్లో ఇతర రకాల్ని సాగుచేస్తున్నారు.

రైతులకు గిట్టుబాటు ధర అందించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం గిరిజన సహకార సంస్థ ద్వారా కాఫీ కొనుగోళ్లను చేపట్టింది. రైతుల నుంచి కొన్న గింజల్ని అంతర్జాతీయ మార్కెట్‌లో బహిరంగ వేలం వేసి, ఆ సొమ్మును బ్యాంకు ఖాతాల ద్వారా రైతులకు చెల్లించే పారదర్శకమైన విధానాన్ని అమలు చేస్తోంది. ఇటలీ, దుబాయ్, స్విట్జర్లాండ్ వ్యాపారులు అరకు కాఫీని వేలం పాటలో పోటీపడి కొంటున్నారు.

గిరిజన సహకార సంస్థ ఆధ్వర్యంలో చిల్లర దుకాణాల్లో నేరుగా ఇన్‌స్టంట్ కాఫీని విక్రయిస్తున్నారు.
అరకులో కాఫీ మ్యూజియం కూడా ఉంది. ఇక్కడ, మూడొందల రకాల కాఫీ చాక్లెట్లను రుచిచూడవచ్చు. కాఫీతో తయారు చేసిన కేకులూ, పిజ్జాలూ, బర్గర్లూ అందుబాటులో ఉంటాయి. విశాఖ ఏజెన్సీలో పండుతున్న అరబికా కాఫీ 2009- –10 సంవత్సరం నుంచి వరుసగా ఐదుసార్లు పైన్ కప్ ఆఫ్ కాఫీ అవార్డును సొంతం చేసుకోవడం విశేషం. 

దేశంలోని ఇన్‌స్టంట్ కాఫీ ఎగుమతుల్లో ఏపీ 50 శాతానికి పైగా వాటాను కలిగి ఉంది. దీంతో రెండో పెద్ద ఎగుమతి దారు గా నిలిచింది. ఆంధ్రప్రదేశ్‌లో సగటున 3100 మెట్రిక్ టన్నుల అరబికా కాఫీని పండిస్తారు. ఈ కమోడిటీకి ఎగుమతి విలువ పెరిగింది, 2020-21 ఆర్థిక సంవత్సరంలో 142 మిలియన్ డాలర్ల విలువైన కాఫీని ఏపీ ఎగుమతి చేసింది.

విశాఖ ఏజెన్సీ కాఫీని 2015  డిసెంబరు వరకు విదేశీయులే తప్ప తెలుగు రాష్ట్రాల వారు గాని, దేశీయులు గాని రుచి చూడలేదు. మొదటిసారిగా 50, 100, 200, 500 గ్రాముల ప్యాక్‌ల్లో ఈ కాఫీ పొడిని  జీసీసీ రిటైల్ దుకాణాలు, సూపర్‌మార్కెట్లలోనే కాక ఆన్‌లైన్ షాపింగ్ ద్వారా అందుబాటులోకి తెచ్చింది.

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!