కవితక్క రూటు మారిందా ?

Sharing is Caring...

రమణ కొంటికర్ల …………………………………………. 

సామూహిక అంశాలను భుజన కెత్తుకుని లీడ్ చేసే నాయకులు ఎంత క్లిక్కైతారో చెప్పడానికి జార్ఖండ్ ముక్తిమోర్చా శిబూసోరెన్ నుంచి తెలంగాణా ఉద్యమసారథి కేసీఆర్ దాకా… నందిగ్రామ్, సింగూర్ వంటి ఉద్యమాల నుంచి పుంజుకుని.. ఏకంగా కలకత్తాలో అపరకాళీగా మారిన మమత దాకా… ద్రవిడ మున్నేగ కజగ కోటకు బీటలు కొట్టిన జయలలిత దాకా… ఇలా ఎందరినో చూస్తూ వస్తున్నాం. అయితే ఆ దారిలో కేసీఆర్ కూతురైన కవిత కూడా వెళ్తోందా అనిపిస్తోంది ఈ మధ్య ఆమె వేస్తున్న అడుగులను చూస్తుంటే!

తెలంగాణాలో కవిత అంటే బతుకమ్మ… బతుకమ్మ అంటే కవిత అనేట్టుగా ఆమె పేరు ఎవరవునన్నా కాదన్నా, భిన్నవాదనలెలా ఉన్నా పాతుకుపోయింది. ఎంతగా అంటే.. అది కేవలం తెలంగాణా రాష్ట్రం వరకే పరిమితం కాకుండా ఇతర రాష్ట్రాలు, దేశాలు దాటి… ఎల్లలు దాటేంత పేరును బతుకమ్మ కవితకు తెచ్చిపెట్టింది. కారణం ఇదో సామూహిక ఉత్సవం.  మహిళలంతా రంగురంగుల చీరల్లో  అందంగా ముస్తాబై… ఏ ఊరు చూసినా… సీతాకోకచిలుకల పార్కుల్లా కనిపించే నందనవనాన్ని తలపించే ఉత్సవం బతుకమ్మ. మరి బతుకమ్మ అంతకుముందు లేదా… కవితనే తీసుకొచ్చిందా అనేవాళ్లూ లేకపోలేదు. వాళ్ల వాదనను కాదనీ ఎవ్వరనరు. కానీ… ఆ సాంస్కృతిక ఉత్సవానికి తెలంగాణా అస్తిత్వంతో ముడిపెట్టి ప్రచారంలోకి తీసుకొచ్చి బతుకమ్మ అంటే కవిత… కవిత అంటే బతుకమ్మ అనేవిధంగా సక్సెస్ కాగల్గింది నిజమేగదా మరి..?!!

ఆతర్వాత ఆమె ఎంపీ అవ్వడం… పసుపురైతుల దెబ్బకు నిజామాబాద్ ఎంపీ స్థానాన్నే కోల్పోవడం… ఈమధ్యే మళ్లీ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కావడం… స్థానిక ప్రజాప్రతినిధులు అధికంగా టీఆర్ఎస్ కు చెందినవాళ్లు కాబట్టే ఆమె గెల్చిందనే విమర్శలూ… ఇలా ఆమె రాజకీయ జీవితం ఆటుపోట్లను ఎదుర్కొంటున్న క్రమమిది. ఈ క్రమంలోనే ఆమె కాశీ బాట పట్టడం కొంత చర్చకు దారితీసింది. అయితే కాశీకి వెళ్లి రావడం వెనుక కారణాలేంటన్న చర్చ కొంతవరకే పరిమితం కాగా… ఇప్పుడు కొండగట్టులో హనుమాన్ చాలీసా పారాయణం, శ్రీరామకోటి స్థూప నిర్మాణం పేరుతో ఆమె మరింత చర్చకు తెరలేపి… ఇప్పుడు రాజకీయాల్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారుతున్నట్టుగా కనిపిస్తోంది.

కొండగట్టుకు ఆమె ఈమధ్య మూడుసార్లు రావడం వెనుక వ్యక్తిగత దోష పరిహారం, నివారణ చర్యలే ప్రధాన కారణమనే ఓ ప్రచారమున్నప్పటికీ… ఎక్కడైతే రామనామ స్మరణతో హిందువుల ఓట్లను పోలరైజ్ చేస్తున్న కాషాయదళానికి చెక్ పెట్టే ఎత్తుగడే అఖండ హనుమాన్ నామ స్మరణ అని.. అందుకే ఈ రామాంజనేయ యుద్ధమనేది మరో రాజకీయ వాదన. ఆమె వ్యక్తిగత దోష నివారణ చర్యలైతే… ఆమె వరకే ఉండేవేమో…?  కానీ కొండగట్టు కేంద్రంగా అఖండ హనుమాన్ చాలీసా పారాయణాన్ని ప్రారంభించి.. దాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆలయాల్లో రోజు సాయంకాలం వేళ పఠించేలా ప్రణాళిక రూపొందించడం… మీడియాలో దానికి హైపును సృష్టించడం… పైగా శ్రీరామకోటి స్థూప భూమిపూజకు.. రాజు తల్చుకుంటే దెబ్బలకు కొదవా అన్నట్టు ఇంత గడ్డుకాలంలోనూ ఏకంగా 90 లక్షల రూపాయలను మంజూరు చేయించి వారం రోజుల వ్యవధిలో పనులు ప్రారంభించడం వంటివన్నీ చూస్తోంటే… మరో ఆధ్యాత్మిక, సాంస్కృతిక, సామూహికాంశాన్ని కవిత భుజానికెత్తుకున్నట్టుగా కనిపించడంలేదూ…?!!

అయితే దీనివెనుక కేసీఆర్ ఉన్నారా… గులాబీపార్టీ మేథోమథనం జరిగిందా… లేక ఇదంతా యాదృచ్ఛికంగా జరుగుతుంటే మీడియా వండివార్చే కథనాలా అన్నది పక్కనబెడితే… కవిత వేస్తున్న అడుగులు, రచిస్తున్న వ్యూహాలు తండ్రీ, సోదరులకు సమాంతరంగా…పార్టీని బీజేపికి దీటుగా నిలబెట్టేందుకు చేస్తున్న యత్నంగా కూడా ఎందుకనుకోకూడదు..? ఏదేమైనప్పటికీ… ఇప్పుడూ అఖండ హనుమాన్ చాలీసా పారాయణం ఆమె అనుకున్నట్టు 82 రోజులపాటు రాష్ట్రంలోని ప్రతీ ఊళ్లోని హనుమాన్ ఆలయాల్లో జరిగితే… టీవీల్లో లైవ్ గానో, వార్తల రూపంలోనో వెళ్లుతుంటే మాత్రం మళ్లొక్కసారి జనం అటెన్షన్ ను మాత్రం ఓ సాంస్కృతిక, ఆధ్యాత్మిక, సామూహిక కార్యక్రమంతో కవితక్క క్యాప్చర్ చేసినట్టే మరి!  

పార్లమెంట్ లో తన ప్రసంగాలతోనూ ఆకట్టుకున్న కవిత… బతుకమ్మ తరహాలో ఆ పండుగను విశ్వవ్యాప్తం చేసినట్టే… అఖండ హనుమాన్ చాలీసా నామస్మరణతో మెజార్టీ జనాన్ని ఆకట్టుకుంటే మాత్రం ఆమె కచ్చితంగా తెలంగాణా రాష్ట్రంలో మంచి మాస్ పుల్లర్ గా నిల్చి… మరో మమతలా, మరో మాయావతిలా, మరో జయలలితలా తెలంగాణాను నడిపించే భవిష్యత్తు నాయకురాలిగా.. మరో మెట్టెక్కి అర్హత సాధించినట్టేగా..?!!

 

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!