జనరల్ బోగీ టిక్కెట్లు ముందుగా కొనుక్కొనే అవకాశం !

Sharing is Caring...

మన దేశంలోని రైళ్లలో జనరల్ బోగీల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎపుడూ అవి కిటకిట లాడుతుంటాయి. ఇక  రైల్వే స్టేషన్లలో టిక్కెట్ల కోసం చాంతాడు క్యూల సంగతి కూడా తెలిసిందే. ఆ క్యూలో నిలబడి టికెట్ సంపాదించి .. బోగీలో ఎక్కితే సీటు కూడా దొరకదు. ఈ  తిప్పలు అందరికి తెలిసినవే.

వీటిని తొలగించడం కోసం ఇండియన్ రైల్వే జనరల్ సీట్లను ముందుగా కొనుగోలు చేసే ప్రక్రియను అందుబాటులోకి తెచ్చింది. ఇందుకోసం భారతీయ రైల్వే.. యూటీఎస్ (అన్ రిజర్వ్డ్ టికెటింగ్ సిస్టమ్) అనే మొబైల్ యాప్ ను తీసుకొచ్చింది. ఈ యాప్ సాయంతో ఫోన్ లోనే జనరల్ టికెట్లు, నెలవారీ సీజనల్ టికెట్లు, ప్లాట్ ఫాం టికెట్లు  ఈజీగా బుక్ చేసుకోవచ్చు. తద్వారా బోలెడు సమయం కలసి వస్తుంది. క్యూలలో నిలబడే శ్రమ తప్పుతుంది. ఈ యాప్ కి మొదట్లో పెద్ద ఆదరణ లభించలేదు. మెల్లగా ఆదరణ పొందుతోంది.  

ఆండ్రాయిడ్ ఫోన్ వినియోగదారులైతే గూగుల్ ప్లేస్టోర్, ఐఫోన్ వినియోగదారులు యాప్ స్టోర్, విండోస్ ఫోన్లు వాడేవారు విండోస్ యాప్ స్టోర్ నుంచి యూటీఎస్ (UTS) అప్లికేషన్‌ను ముందుగా డౌన్లోడ్ చేసుకోవాలి. అనంతరం ఫోన్ నంబర్, పేరు, పాస్ వర్డ్, పుట్టిన తేదీ తదితర వివరాలు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆ వెంటనే వన్ టైం పాస్ వర్డ్ (ఓటీపీ) వస్తుంది. దాన్ని నమోదు చేయడంతో ఈ ప్రక్రియ ముగుస్తుంది. రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయ్యాక ఫోన్ నంబర్, పాస్ వర్డ్ తో మన అకౌంట్ లోకి లాగిన్ కావాల్సి ఉంటుంది.

ఆ తర్వాత టికెట్ బుకింగ్ కోసం ‘నార్మల్ బుకింగ్’ ఆప్షన్ పైన  క్లిక్ చేయాలి. ఆన్లైన్ టికెట్ కావాలనుకుంటే బుక్ అండ్ ట్రావెల్ (పేపర్‌లెస్), ప్రింటెడ్ టికెట్ కావాలనుకుంటే బుక్ అండ్ ప్రింట్ (పేపర్) ఆప్షన్ పై క్లిక్ చేయాలి. తరువాత  మనం ఎక్కాల్సిన, దిగాల్సిన స్టేషన్ల వివరాలు నమోదు చేయాలి. ఆపై ప్రయాణికుల (పెద్దలు, చిన్నారులు) సంఖ్య, ట్రైన్ టైప్, ఏ క్లాస్(రెండో క్లాస్, అన్ రిజర్వ్డ్) వివరాలు పొందుపర్చాలి.

తర్వాత నగదు చెల్లింపు కోసం ‘పేమెంట్ టైప్’లో ఆర్-వ్యాలెట్ లేదా ఇతర ఆన్లైన్ పేమెంట్ వ్యవస్థ(క్రెడిట్, డెబిట్ కార్డులు, ఇంటర్నెట్ బ్యాంకింగ్, డిజిటల్ పేమెంట్ యాప్స్)లను ఎంచుకోవాలి. టికెట్లకు ఎంతవుతుందో (గెట్ ఫేర్) తెలుసుకుని, చివరకు ‘బుక్ టికెట్’పై క్లిక్ చేయాలి. దీంతో టికెట్ బుక్ అవుతుంది.

టికెట్ చూడాలనుకుంటే ‘షో టికెట్’ ఆప్షన్ పై క్లిక్ చేయాలి. వెంటనే మీరు బుక్ చేసుకున్న టికెట్ వివరాలు కనిపిస్తాయి. ‘వ్యూ టికెట్ పై క్లిక్ చేస్తే.. టికెట్ కనిపిస్తుంది.‘క్విక్ బుకింగ్’ ఆప్షన్ ద్వారా ఇదివరకు బుక్ చేసుకున్న టికెట్స్ వివరాలు కనిపిస్తాయి. ‘ప్లాట్ ఫాం బుకింగ్’ ద్వారా ప్లాట్ ఫాం టికెట్ తీసుకోవచ్చు. ‘సీజనల్ టికెట్స్’తో కొత్తగా నెలవారీ టికెట్ తీసుకోవచ్చు.

రెన్యూవల్ కూడా చేసుకోవచ్చు. ‘క్యూఆర్ బుకింగ్’ ఆప్షన్ ద్వారా.. స్టేషన్లోని టికెట్ కౌంటర్ల వద్ద క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేయడం ద్వారా టికెట్ పొందవచ్చు. టికెట్ కోసం చెల్లింపులకు ఆర్-వ్యాలెట్ ఆప్షన్‌ను ఎంచుకునే వారు ముందుగా.. దాన్ని రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. రూ. 100 ఆపై మాత్రమే రీఛార్జ్ సాధ్యపడుతుంది. ఆన్‌లైన్లో లేదా, స్టేషన్లోని యూటీఎస్ కౌంటర్ వద్ద రీఛార్జ్ చేసుకోవచ్చు.

ఫోన్లో టికెట్ బుకింగ్ కోసం ఇంటర్నెట్ సదుపాయం తప్పనిసరి. జీపీఎస్ ను యాక్టివేట్ చేసుకోవాలి. ప్రయాణించే రోజు మాత్రమే టికెట్ బుక్ చేసుకోగలం. టికెట్ తీసుకున్న గంటలోపు రైలెక్కాలి. ఎంపిక చేసిన స్టేషన్లలో మాత్రమే ప్లాట్ ఫాం టికెట్ తీసుకోగలం.పేపర్‌లెస్ టికెట్ రద్దు చేయడం కుదరదు. స్టేషన్ వెలుపల 5 కి.మీల పరిధిలో మాత్రమే టికెట్ తీసుకోవచ్చు. స్టేషన్ లోపల, రైల్లో ఉన్నప్పుడు కుదరదు.

పేపర్ టికెట్ బుక్ చేసుకున్నవారు స్టేషన్‌కు వెళ్లి అక్కడి ఏటీఎం / కో-టీవీఎం, ఓసీఆర్ యంత్రాలు, ఓటీఎస్ బుకింగ్ కౌంటర్ నుంచి టికెట్ ప్రింట్ తీసుకోవచ్చు. ఇందుకోసం ఫోన్ నంబర్, బుకింగ్ ఐడీ నంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. టికెట్ రద్దూ చేసుకోవచ్చు.

ఈ విధానంలో టికెట్ బుక్ చేసుకున్నవారు కచ్చితంగా చేతిలో టికెట్ కలిగి ఉండాలి. లేనిపక్షంలో జరిమానా పడుతుంది.టికెట్ పొందడంలో సమస్యలు, ఇతర ఇబ్బందులపై ఫిర్యాదు చేసేందుకు ఈ యాప్ లోనే రైల్వే కస్టమర్ కేర్ నంబర్లు, ఫిర్యాదుల స్వీకరణ అప్షన్ కూడా ఉన్నాయి. అంతా బాగానే ఉంది .కానీ మరి గంట ముందే అనేదే బాగాలేదు. 

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!