Ravi Vanarasi…………
ఒక ప్రముఖ వ్యక్తి జీవితాన్ని పరిశీలించినప్పుడు, వారి గొప్ప విజయాల వెనుక నిశ్శబ్దంగా దాగి ఉన్న బాధల తుఫానులు, సంక్షోభాలు కనిపిస్తాయి. ప్రపంచ ప్రఖ్యాత క్రైమ్ నవలా రచయిత్రి, ‘క్వీన్ ఆఫ్ క్రైమ్’గా కీర్తించబడిన అగథా క్రిస్టీ (Agatha Christie) జీవితంలో కూడా అలాంటివి ఉన్నాయి.
అగథా క్రిస్టీ తన నలభైవ ఏట, వ్యక్తిగత విషాదంలో కూరుకుపోయి, భావోద్వేగాల అగాధంలో ఉన్న ఆ సమయంలో ఆమె తీసుకున్న ఒక అనూహ్యమైన నిర్ణయం ఆమె జీవిత గమనాన్ని, ప్రపంచ సాహిత్య రూపురేఖలను శాశ్వతంగా మార్చివేసింది.
1926 నాటి సంఘటనలు అగథా క్రిస్టీ జీవితాన్ని తలక్రిందులు చేశాయి. ఆమె తల్లి మరణించింది. ఆ వెంటనే భర్త కల్నల్ ఆర్చిబాల్డ్ క్రిస్టీ (Archibald Christie) వివాహేతర సంబంధాలు బహిర్గతమైనాయి … ఇవన్నీ ఆమెను తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురిచేశాయి. ఈ ఒత్తిడి పరాకాష్టకు చేరి, ఆమె పది రోజుల పాటు అదృశ్యమైంది.
ఆ తర్వాత భర్తతో విడాకులు తీసుకున్నారు. తన జీవితంలో అదోక సంచలనం.ఆ సమయం ఆమె జీవితంలో అత్యంత చీకటి అధ్యాయం. ఏ స్త్రీకైనా నలభై ఏళ్ల వయసులో జీవిత భాగస్వామి నుండి విడిపోవడం విషాదం. అగథా క్రిస్టీ ఆ వేదనలో కుంగిపోలేదు. విషాదం ఆమెను నిస్తేజం చేయలేదు. ఆసమయంలో ఒక కొత్త శక్తిని పుంజుకుంది. ధైర్యాన్ని తెచ్చుకుంది.
1928లో అగథా క్రిస్టీ ఒంటరిగా, ఎవరు తోడు లేకుండా ఓరియంట్ ఎక్స్‌ప్రెస్ రైలు ఎక్కి, సుదూర తూర్పు దేశాలకు బయలుదేరింది. ఆ రైలు మార్గం కేవలం భౌగోళిక దూరాన్ని మాత్రమే కవర్ చేయలేదు.. ఆమె హృదయంలోని గాయాల నుండి విముక్తిని, కొత్త ప్రపంచాన్ని కనుగొనేందుకు దోహదపడింది.
లండన్ నుండి మొదలై, ఐరోపా అంతటా ప్రయాణించి, ఇరాక్ , సిరియా వంటి మధ్యప్రాచ్య దేశాలకు చేరుకోవడం ఒక నలభై ఏళ్ల ఒంటరి మహిళకు మామూలు విషయం కాదు. ఆమె జీవితంలో ఈ ప్రయాణం కేవలం ‘విరామం’ కోసం తీసుకున్న నిర్ణయం కాదు, అది తన ‘అస్తిత్వాన్ని’ పునఃపరిశీలించుకోవడం, అంతర్గత శూన్యతను నింపే ఆత్మశోధన (Self-Discovery) యాత్ర.
మధ్యప్రాచ్యంలో, వేలాది సంవత్సరాల చరిత్రను తనలో దాచుకున్న పురాతన నగరాల శిథిలాల మధ్య, విశాలమైన ఎడారుల నిశ్శబ్దంలో అగథా క్రిస్టీ పొందిన అనుభూతి వర్ణనాతీతం. తన వ్యక్తిగత బాధలు, ఆ ఇసుక దిబ్బల గొప్పతనం ముందు చిన్నవిగా అనిపించాయి. కొత్త సంస్కృతులు, వేరే జీవన విధానాలు, ఆర్కియాలజీ ప్రపంచం రహస్యాలు ఆమెకు కొత్త స్ఫూర్తిని, ప్రేరణను అందించాయి.
ఈ ప్రయాణం ఆమె రచనా శైలికి కొత్త నేపథ్యాన్ని ఇచ్చింది. బంధాల నుండి విముక్తి పొంది, ఆమె తన కథలకు కొత్త ‘జీవన నాడులను’ కల్పించింది. మెసొపొటేమియా, ఈజిప్ట్‌ల చారిత్రక గొప్పతనం, పురావస్తు తవ్వకాల ఉత్కంఠ… ఇవన్నీ ఆమె ఊహకు కొత్త ఇంధనాన్ని అందించాయి.
ఈ ప్రయాణంలో అగథా క్రిస్టీ అనుకోకుండా ఒక యువకుడిని కలుసుకుంది. మెసొపొటేమియాలో పురావస్తు తవ్వకాల స్థలంలో, ఆమె తన కంటే దాదాపు 14 ఏళ్లు చిన్నవాడైన యువ పురావస్తు శాస్త్రవేత్త మాక్స్ మల్లోవాన్ (Max Mallowan) ను కలుసుకున్నారు. విజ్ఞానం, చరిత్ర పట్ల వారికున్నఆసక్తి ఇద్దరినీ దగ్గర చేసింది. ఈ పరిచయం స్నేహంగా మారి, చివరకు ప్రేమకు దారితీసింది.
1930లో వారు వివాహం చేసుకున్నారు.మాక్స్ మల్లోవాన్‌తో ఆమె బంధం, విడాకుల తరువాత ఒక స్త్రీ జీవితం ముగిసిపోదని, కొత్త జీవితం, కొత్త ప్రేమ, కొత్త కెరీర్ పునర్నిర్మాణం సాధ్యమని నిరూపించింది. ఈ సాహసయాత్ర అగథా క్రిస్టీ రచనలకు బంగారు గనిలా మారింది. మధ్యప్రాచ్యపు లొకేషన్లు, అక్కడి సంస్కృతి, పురావస్తు తవ్వకాల నేపథ్యం ఆమె నవలలకు ముడిసరుకుగా మారాయి.
– Murder in Mesopotamia (మెసొపొటేమియాలో హత్య) పురావస్తు తవ్వకాల నేపథ్యంలో సాగే కథ.
– Death on the Nile (నైలు నదిపై మరణం) ఈజిప్ట్, నైలు నది క్రూయిజ్ నేపథ్యంతో అద్భుతమైన కథ.
– Appointment with Death (మరణంతో నియామకం) జోర్డాన్ లోని పెట్రా నేపథ్యంలో రాసిన కథ.
– Murder on the Orient Express (ఓరియంట్ ఎక్స్‌ప్రెస్‌లో హత్య)ఆమె స్వయంగా ప్రయాణించిన రైలునే వేదికగా చేసుకున్నారు.
ఈ నవలలు ప్రపంచవ్యాప్తంగా పాఠకులను ఉర్రూతలూగించాయి. వ్యక్తిగత కష్టాల నుండి ఆమె పొందిన అనుభవం, ఆమె సృజనాత్మకతకు పదును పెట్టింది.నలభై ఏళ్ల వయసులో భావోద్వేగాలను అధిగమించి ఆనందాన్ని, ప్రేమను వెతుక్కుంది. సృజనాత్మకత తో పాఠకుల అభిమానాన్ని సంపాదించింది.
మనమంతా ఆమె నుండి నేర్చుకోవాల్సిన పాఠాలు ఏమిటంటే … జీవితంలో ఎదురయ్యే విషాదాలు, నిరాశలు మన గమ్యాన్ని మార్చే శక్తిని కలిగి ఉండవు. వాటిని ఎదుర్కొని, కొత్త దారులు వెతకడానికి వాటిని ప్రేరణగా మార్చుకోవాలి.కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి, సాహసాలు చేయడానికి, ప్రేమను పొందడానికి వయస్సు అనేది ఒక అడ్డంకి కాదు.