కొత్త జిల్లాల ఏర్పాటు వెనుక ఉన్న ఆలోచన ప్రజలకు సమర్థవంతమైన పాలన అందించడమే. జిల్లాల ఏర్పాటు ను ఒక్కో సారి ప్రభుత్వమే తలపెడుతుంది. ఒక్కోసారి స్థానిక డిమాండ్లను అనుసరించి ప్రభుత్వం చేపడుతుంది.
ఏ విధంగా చేపట్టినా అభివృద్ధి .. మెరుగైన పాలన అందించడం .. ప్రభుత్వ పధకాలను సమర్ధ వంతంగా అమలు చేయడం లక్ష్యంగా పెట్టుకుని ప్రభుత్వం కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియను చేపడుతుంది. జిల్లాల సంఖ్య ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలా ఉంటుంది. అన్ని చోట్లా ఒకేలా ఉండాలని లేదు.
పెద్ద రాష్ట్రాలలో జిల్లాల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఉదాహరణకు, ఉత్తరప్రదేశ్‌లో అత్యధికం గా 75 జిల్లాలు ఉన్నాయి. దీని తర్వాత మధ్యప్రదేశ్ లో 52 ఉన్నాయి. అతి చిన్న రాష్ట్రం గోవాలో 2 జిల్లాలు మాత్రమే ఉన్నాయి. మరోవైపు అరుణాచల్ ప్రదేశ్‌లో 25 జిల్లాలు ఉన్నాయి. ఈశాన్య రాష్ట్రాల్లో చాలా చిన్న జిల్లాలు ఉన్నాయి. తెలంగాణా లో 33 జిల్లాలున్నాయి.
రాష్ట్రంలోని జిల్లాల సంఖ్య రాష్ట్ర వైశాల్యం లేదా దాని జనాభా ప్రకారమే ఉండదు. ఉదాహరణకు, ఆంధ్రప్రదేశ్ విస్తీర్ణంలో 7వ అతిపెద్ద రాష్ట్రంగా ఉంది కానీ మొన్నటి వరకు 13 జిల్లా లే ఉన్నాయి. ఏప్రిల్ 4 నుంచే కొత్త జిల్లాలు ఏర్పడుతున్నాయి. జిల్లాల పునర్విభజన పూర్తి అయింది. 13 జిల్లాలు 26 కాబోతున్నాయి. అభివృద్ధే లక్ష్యంగా జిల్లాల పునర్విభజన చేపట్టామని జగన్ సర్కార్ అంటోంది.
కొత్త జిల్లాల ఏర్పాటు లేదా ఇప్పటికే ఉన్న జిల్లాలను మార్చే లేదా రద్దు చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు మాత్రమే ఉంటుంది. ఇది కార్యనిర్వాహక ఉత్తర్వు ద్వారా లేదా రాష్ట్ర అసెంబ్లీలో చట్టాన్ని ఆమోదించడం ద్వారా చేయవచ్చు. అధికారిక గెజిట్‌లో నోటిఫికేషన్‌ను జారీ చేయడం ద్వారా అనేక రాష్ట్రాలు కార్యనిర్వాహక మార్గాన్ని ఇష్టపడతాయి.
జిల్లాల మార్పు, కొత్త జిల్లాల ఏర్పాటులో కేంద్రం పాత్ర ఏమీ లేదు. ఈ విషయంలో రాష్ట్రాలకు పూర్తి స్వేచ్ఛ ఉంది. అందుకే రాష్ట్రాలను పాలించే నేతలు తమ విజన్ ను బట్టి జిల్లాలను ఏర్పాటు చేసుకుంటున్నారు.
జిల్లాలను ఏర్పాటు చేయడం సులభమే కానీ ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటు, సిబ్బంది కేటాయింపు కయ్యే ఖర్చులే తడిసి మోపెడు అవుతాయి. అన్ని శాఖలకు కార్యాలయాలు .. అధికారులు ..కింది స్థాయి సిబ్బంది ని నియమించుకోవాలి. అపుడే అధికార వికేంద్రీకరణ కు బీజం పడుతుంది. ప్రభుత్వం అమలు చేసే యే స్కీం అయినా జనానికి చేరుతుంది. ఈ ప్రాసెస్ లో లోటుపాట్లు ఉంటే అనుకున్న లక్ష్యాలు నెరవేరవు.
కొన్ని ప్రభుత్వాలు జిల్లాలు ఏర్పాటు చేసేటపుడు చూపే ఉత్సాహం తర్వాత బడ్జెట్ కేటాయింపుల్లో చూపవు. సిబ్బంది జీతాల వరకే ప్రాధాన్యత ఇస్తారు .. వసతుల విషయం లో నిర్లక్ష్యం చూపుతారు. అందుకే అరకొర వసతులతో.. సదుపాయాలతో, తక్కువ సిబ్బందితో ప్రభుత్వ కార్యాలయాలు పనిచేస్తుంటాయి. ఏపీ విషయంలో అలా కాకూడదని ఆశిద్దాం.