విభిన్నపాత్రలపై దృష్టి పెడితే …….

Sharing is Caring...

హీరో నందమూరి బాలకృష్ణ 1980 దశకం నుంచి తెలుగు చిత్రసీమలో హార్డ్‌కోర్ మాస్ హీరోగా రాణించారు. ఎన్నో హిట్స్ అందించి ఆ తర్వాత మాస్ స్టార్‌గా ఎదిగారు. ఇటీవల విడుదలైన అఖండతో మళ్ళీ అభిమానులను బాలయ్య ఉర్రూతలూగించాడు. డైరెక్టర్ బోయపాటి శీను బాలయ్య ను అఖండ పాత్రకు అనుకూలంగా మలచు కున్నాడు.

పాత్రకు కావాల్సిన మేరకు హావభావాలను బాలయ్య నుంచి రాబట్టుకున్నాడు. ముందెన్నడూ లేని రీతిలో బాలయ్య ఈ సినిమాలో కొంత భిన్నంగా నటించాడు. స్క్రీన్ ప్రెజెన్స్ , గంభీర వదనం .. డైలాగ్ డెలివరీ…ఇంటెన్స్ లుక్ .. సింపుల్ డైలాగులతో బాలయ్య  ప్రేక్షకులను అలరించాడు. అఖండలో మురళీ కృష్ణ పాత్ర కంటే .. అఖండ పాత్రనే అందరిని ఆకట్టుకుంటుంది. 

వాస్తవానికి అఖండ పాత్రను ఇంకా బాగా తీర్చిదిద్దవచ్చు. కానీ మాస్ ను, అభిమానులను దృష్టిలో ఉంచుకుని ఎక్కువగా యాక్షన్ సన్నివేశాలతోనే  సినిమాను నడిపించాడు బోయపాటి. విలన్ అనుచరులను నరికి పడేయడమే అఖండ లక్ష్యమన్నట్టు చూపారు. సినిమాలో హింస ఎక్కువైనట్టు విమర్శలు కూడా లేకపోలేదు. చైల్డ్ సెంటిమెంట్ సీన్స్ కి ఇచ్చిన ప్రాధాన్యత.. దర్శకుడు  బోయపాటి మదర్ సెంటిమెంట్  సన్నివేశాలకు ఇవ్వలేదు.

ఒకటి రెండు సీన్లు పెట్టినప్పటికీ అక్కడ భావోద్వేగాలు పండలేదు. అసలు అఖండ గా ఎలా పెరిగాడు ? ఏ ఇబ్బందులు ఎదుర్కొన్నాడు ? ఎలా అజేయ శక్తులను సాధించాడు వంటి అంశాల జోలికి బోయపాటి వెళ్ళలేదు. కేవలం .. పంచ్ డైలాగులు .. ఫైట్స్ మీదనే దృష్టి సారించారు. అఖండ సినిమాను లాజికల్ గా చూస్తే ఏమాత్రం నచ్చదు. మామూలు మూస పద్దతిలోనే తీశారు. కొత్త దనం కూడా లేదు. కథాపరంగా సినిమాలో చాలా గ్యాప్స్ ఉన్నాయి. ఇపుడు వాటిపై చర్చ దండగ.

అఖండ పాత్ర ఒకటే కొత్తగా కనిపిస్తుంది. ఈ సినిమాలో బాలయ్య లోని నటుడిని బోయపాటి గరిష్టంగా వాడుకున్నారు. అందుకే బాలయ్య కొంత డిఫరెంట్ గా కనిపించారు. ఆ విషయంలో మాత్రం దర్శకుడిని అభినందించవచ్చు.వెరైటీ పాత్రలు బాలయ్య చేయగలడని నిరూపించారు. ఇంతకు ముందు కొన్ని భిన్నమైన పాత్రలు బాలయ్య చేయక పోలేదు. అయితే తండ్రి ఎన్టీఆర్ తో పోలిస్తే చాలా తక్కువే అని చెప్పుకోవాలి.

ఇప్పుడైనా మించి పోయింది లేదు. బాలయ్య సై అంటే వెరైటీ పాత్రలు బోలెడు సిద్ధమౌతాయి. బాలయ్య వయసు కు తగిన పాత్రలు ఎంచుకుంటే హుందాగా ఉంటుంది. హీరోయిన్లతో పాటలు .. డాన్సులు కట్టిపెట్టి మలయాళ హీరో మోహన్ లాల్ మాదిరిగా సీరియస్ క్యారెక్టర్లు ఎంచుకుని చేస్తే .. మంచి సినిమాలు వచ్చే అవకాశాలు లేకపోలేదు. మాస్ ఇమేజ్ , కమర్షియల్ పోకడల పరిథి లోనే సీరియస్ క్యారెక్టర్లు చేయవచ్చు.

అద్భుతమైన పాత్రలను సృష్టించగల రచయితలు ఎందరో ఉన్నారు. ఆసక్తికరంగా తెరకెక్కించే దర్శకులున్నారు. అఖండ తరహా సీరియస్  పాత్రలు బాలయ్యకు బాగా సూట్ అవుతాయి. విభిన్న పాత్రలపై దృష్టి పెడితే బాలయ్య నటుడిగా మరింత రాణించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. 

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!