Eco-friendly, crowd-free travel…………………….
త్వరలో ఎగిరే ఎయిర్ టాక్సీలు అందుబాటులోకి వచ్చేస్తున్నాయి. ఈ టాక్సీ లో 90 నిమిషాల దూరాన్ని 7 నిమిషాల్లోనే చేరుకోవచ్చు ఎయిర్ టాక్సీ వంటి ప్రయోగాలు ఇప్పటికే విదేశాల్లో విజయవంతంగా జరిగాయి. కానీ, ఆ ప్రయాణాన్ని అనుభవించాలంటే ప్రస్తుతానికైతే భారతీయులు విదేశాలకు వెళ్లాల్సిందే.
2026 నాటికి మన దేశంలోనే ఇది సాధ్యమవుతుంది. ఎలక్ట్రిక్ వర్టికల్ టేకాఫ్, ల్యాండింగ్ (eVTOL) విమానాలను సాధారణంగా ఆల్-ఎలక్ట్రిక్ ఎయిర్ టాక్సీలుగా సూచిస్తారు.ఇది భారతదేశంలో పట్టణ రవాణా వ్యవస్థను మార్చబోతోంది. వేగవంతమైన, పర్యావరణ అనుకూలమైన, రద్దీ లేని ప్రయాణ విధానాన్ని అందించనుంది.
ఇంటర్‌గ్లోబ్ ఎంటర్‌ప్రైజెస్, భారతదేశపు విమానయాన సంస్థ ఇండిగో మద్దతుతో 2026 నాటికి భారతదేశంలో ఆల్-ఎలక్ట్రిక్ ఎయిర్ టాక్సీ సర్వీస్‌ను పరిచయం చేయడానికి US-ఆధారిత ఆర్చర్ ఏవియేషన్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ విమానాల్లో నలుగురు ప్రయాణీకులు, ఒక పైలట్ ఈజీగా ప్రయాణం చేయవచ్చు.
ఈ సేవలు ఢిల్లీ, ముంబై, బెంగళూరులలో 200 విమానాలతో అందుబాటులోకి వస్తాయి. ఈ విమానాల్లో ట్రావెల్ ప్రయాణ సమయాన్ని గణనీయంగా తగ్గిస్తుంది. ఉదాహరణకు, మీరు 60 నుండి 90 నిమిషాల పాటు కారులో ప్రయాణించే బదులు..ఎయిర్ టాక్సీలో కేవలం 7 నిమిషాల్లో మీరు మీ గమ్యాన్ని చేరుకుంటారు.
ఇంటర్‌గ్లోబ్ ఎంటర్‌ప్రైజెస్ ఇ-ఎయిర్‌క్రాఫ్ట్ వినియోగాన్ని ప్రయాణీకుల సేవలకు మాత్రమే కాకుండా కార్గో, లాజిస్టిక్స్, మెడికల్, ఎమర్జెన్సీ, చార్టర్ సేవలకు కూడా విస్తరించాలని యోచిస్తోంది. ఇటీవలి కాలంలో పర్యావరణ అనుకూలమైన ఎలక్ట్రిక్ ఎయిర్ ట్యాక్సీలపై ఆసక్తి, పెట్టుబడి పెరుగుదలను మనం చూస్తున్నాం. ప్రయాణ ధరలు కొంచెం ఎక్కువగానే ఉండొచ్చు. అయితే సమయం బాగా కలసి వస్తుంది.