ఏ.ఐ. సాయంతో మార్కెట్లో కొచ్చిన మొదటి వార్తాపత్రిక !!

Sharing is Caring...

Manchala Srinivasa rao …………..

First news paper with the help of AI ………………..

రిపోర్టర్లు లేరు.. సబ్ ఎడిటర్లు లేరు.. ప్రూఫ్ రీడర్లు లేరు… పేజీ మేకప్ ఆర్టిస్టుల్లేరు… ఫోటోగ్రాఫర్లు లేరు…అయినా సరే, డెయిలీ పేపర్ పబ్లిషైంది… ప్రింట్ ఎడిషన్, డిజిటల్ ఎడిషన్ మార్కెట్‌లోకి వచ్చేశాయి.. ఆశ్చర్యంగా ఉందికదా.. అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మాయ..

నిజం… “ఇల్ ఫోగ్లియో” (Il Foglio) అనే ఇటాలియన్ పత్రిక తొలిసారిగా పూర్తిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాయంతో ఒక ఎడిషన్‌ను ప్రచురించడం ద్వారా చరిత్ర సృష్టించింది. ఈ ప్రయోగం 2025 మార్చి 18 నుంచి ప్రారంభమైంది, ఒక నెలపాటు కొనసాగుతుంది. 

అంటే ఇక జర్నలిస్టులు కనిపించరా..? వారు లేకుండా పత్రికలూ వచ్చేస్తాయా ?  పత్రికల్లో పనిచేసేవారంతా  వేరే వృత్తులు వెతుక్కోవల్సిందేనా..? అసలే ప్రింట్ మీడియా గడ్డు కాలంలో ఉంది .. రోజులు లెక్కపెట్టుకుంటోంది…

ఈక్రమంలో ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్  సాయంతో పత్రిక ప్రచురణ పిడుగుపాటు వంటి పరిణామమేనా ? అంటే అవుననే చెప్పుకోవాలి. అనేక రంగాల్లో ఎఐ ప్రవేశించాక కొలువులు పోతున్నాయి… ఎఐ ఆ స్థానాల్ని ఆక్రమిస్తోంది… జర్నలిజం గతి కూడా అంతేనా..? ఇదీ ఓ ప్రశ్న… ముందుగా ఆ ఎఐ డెయిలీ గురించి నాలుగు ముక్కలు చెప్పుకుందాం. 

ఈ ప్రత్యేక  AI ఎడిషన్, “ఇల్ ఫోగ్లియో ఏఐ” (Il Foglio AI) పేరుతో, నాలుగు పేజీలతో కూడిన ఒక సప్లిమెంట్‌గా వెలువడింది. ఈ పత్రిక రోజువారీ వార్తలు, విశ్లేషణలు, సంపాదకీయాలు, పాఠకుల నుంచి వచ్చిన లేఖలను కూడా AI ద్వారా రూపొందించింది.

ఈ ప్రయోగం జర్నలిజంలో AI యొక్క ప్రభావాన్ని పరీక్షించడానికి, దాని ఉపయోగాన్ని ఆచరణాత్మకంగా అర్థం చేసుకోవడానికి రూపొందించబడింది. పత్రిక సంపాదకుడు క్లాడియో సెరాసా (Claudio Cerasa) దీనిని “జర్నలిజాన్ని పునరుజ్జీవింపజేయడం” కోసం ఒక అవకాశంగా చూశారు, అది దాన్ని నాశనం చేయడానికి కాదని అంటున్నారు. 

కంటెంట్ గురించి చెప్పుకోవాలంటే ….  మొదటి ఎడిషన్‌లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు సంబంధించిన ఒక కథనం, “పుతిన్, ది 10 బిట్రేయల్స్” అనే వ్యాసం (రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ యొక్క 20 ఏళ్ల వాగ్దాన ఉల్లంఘనలు), ఇటలీ ఆర్థిక వ్యవస్థ గురించి ఒక సానుకూల కథనం, యువ యూరోపియన్లలో “సిచుయేషన్‌షిప్స్” (స్థిరమైన సంబంధాలకు దూరంగా ఉండే ధోరణి) గురించిన విశ్లేషణ ఉన్నాయి.

చివరి పేజీలో AI రాసిన పాఠకుల లేఖలు కూడా ఉన్నాయి, వాటిలో ఒకటి “AI మనుషుల శక్తిని  నిష్ప్రయోజనం చేస్తుందా?” అని ప్రశ్నించింది. జర్నలిస్టులు AI టూల్స్‌కు ప్రశ్నలు వేయడం, ఆ సమాధానాలను చదవడం మాత్రమే చేశారు. వ్యాసాలు, శీర్షికలు, కోట్స్, సారాంశాలు— అన్నీ AI ద్వారా రూపొందించబడ్డాయి. వ్యాసాలు స్పష్టంగా, వ్యాకరణ దోషాలు లేకుండా ఉన్నప్పటికీ, మానవుల నుంచి నేరుగా కోట్స్ లేకపోవడం ఒక లోపం గా కనిపించింది.

ప్రభావం ఎలా ఉందంటే ….  మొదటి రోజు పత్రిక అమ్మకాలు 60% పెరిగాయని క్లాడియోసెరాసా చెప్పుకొచ్చారు. ఈ ప్రయోగం కొత్త పాఠకులను ఆకర్షించింది..జర్నలిజంలో AI  సామర్థ్యంపై చర్చను రేకెత్తించింది.

ఐతే నిజంగానే ఇది జర్నలిజానికి చరమగీతం పాడుతుందా  సమీప భవిష్యత్తులో… ఇదీ అసలు ప్రశ్న… ఒక ఉదాహరణ ముందుగా చెప్పుకుందాం… AI  ఆధారితంగా ఆమధ్య టీవీ న్యూస్ రీడింగ్ చేయించారు గుర్తుందా..? ఏమైంది..? దిక్కూమొక్కూ లేకుండా కొట్టుకుపోయింది ఆ ప్రయోగం… ఒరిజినల్ ఒరిజినలే, ఆర్టిఫిషియల్ ఆర్టిఫిషియలే..

AI సాంకేతికత వేగంగా అభివృద్ధి చెందుతోంది, ఇల్ ఫోగ్లియో ప్రయోగం దీనికి ఒక ఉదాహరణ. AI సాధారణ వార్తల రచన, సారాంశాలు, డేటా విశ్లేషణలు వంటి పనులను త్వరగా, తక్కువ ఖర్చుతో చేయగలదు. కానీ, కొన్ని కీలక అంశాల్లో జర్నలిస్టుల పాత్ర ఇప్పటికీ అనివార్యం…

 ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం… ఇంటర్వ్యూలు   AI చేయలేదు, మానవ సోర్స్‌ల నుంచి సమాచారం సేకరించలేదు లేదా సంక్లిష్ట కథనాలను వెలికితీయలేదు. ఇవి జర్నలిస్టుల సృజనాత్మకత,  చురుకైన ఆలోచనలపై ఆధారపడతాయి.

AI వాస్తవాలను తప్పుగా అర్థం చేసుకోవచ్చు.. లేదా సందర్భాన్ని పట్టించుకోకపోవచ్చు. అదే మానవ జర్నలిస్టుల ద్వారా అయితే వాస్తవాలను తనిఖీ చేయడం, నిష్పాక్షికతను నిర్వహించడం ఉంటుంది…AI రాసిన వ్యాసాలు సాంకేతికంగా సరైనవైనా, మానవ జర్నలిస్టులు అందించే లోతైన అంతర్దృష్టి, విశ్లేషణ లేకపోవచ్చు.

పత్రిక సంపాదకుడు క్లాడియో సెరాసా   అభిప్రాయం ఏమిటంటే..? “AI మానవులతో పోటీపడగలదు, కానీ దీర్ఘకాలంలో ఈ పోటీ సామర్థ్యాన్ని పెంచాలి… భవిష్యత్తులో, AI రొటీన్ పనులను చేస్తుండగా, జర్నలిస్టులు మరింత సృజనాత్మకంగా, విమర్శనాత్మకంగా ఆలోచించే పాత్రలకు మారవచ్చు. కాబట్టి, జర్నలిస్టుల అవసరం పూర్తిగా తొలగిపోకపోవచ్చు, కానీ వారి పనితీరు ఖచ్చితంగా మారుతుంది…”

ఇక పత్రికల యాజమాన్యాలు ఎలా స్పందిస్తాయో చూడాలి ..ఖర్చు తగ్గుతుంది అంటే  కొద్దీ పాటి స్టాఫ్ తోనే  AI  సాయంతో పత్రికలూ తీసుకురావచ్చు .. ఏది ఏమైనా కొద్దీ కాలం వేచి చూడాల్సిందే.

 

 

Sharing is Caring...
Support Tharjani

Leave a Comment!

error: Content is protected !!