బెజవాడ ఊర్వశి థియేటర్ కి యాభై ఏళ్లు !

Sharing is Caring...

సరిగ్గా 50 ఏళ్ల క్రితం ‘MACKENNA’S GOLD’ సినిమాతో ప్రదర్శనలు ఆరంభించింది బెజవాడ ఊర్వశి 70MM థియేటర్.అప్పట్లో ఆ సినిమాని భారతదేశంలోనే మొదటిసారి ప్రతిష్ఠాత్మకంగా విడుదలచేసి,రికార్డ్ సృష్టించిన ఆ హాలు,ఈ 2020 డిసెంబర్ 10న స్వర్ణోత్సవం జరుపుకుంది..బెజవాడలో మొట్టమొదటి 70MM సినిమా హాల్ అది. మేము డిగ్రీ చదివే రోజుల్లో ఊర్వశి,మేనక హాల్స్ లో ఇంగ్లీష్ సినిమాలు చూడటం,అక్కడ క్యాంటీన్ లో టీ తాగటం మాకు నిత్యకృత్యాలు. విశాలమైన ఆ జంటహాళ్లను బయటినుండి చూస్తే,పొడవాటి ఆ భవనాలు..ఒక ప్రక్క రంగురంగుల టైల్స్అతికించి రూపొందించిన మేనక రూపం,మరోప్రక్క ఇనప చువ్వను వంచి, కళాత్మకంగా తయారుచేసిన ఊర్వశి రూపం మనోహరంగా హాలు గోడపై దర్శనమిచ్చేవి.

70MM సినిమాలు చూస్తే,ఊర్వశిలోనే చూడాలని సుదూర ప్రాంతాల నుండి కూడా వచ్చి,చూసేవారు ప్రేక్షకులు.నిత్యం ఖరీదైన కార్లతో,ఖాళీ లేకుండా వరుసలో నిలబెట్టిన ద్విచక్రవాహనాలతో వెహికల్ పార్కింగ్ కళకళలాడేది. 36TH CHAMBER OF SHAOLIN,ALIEN,BLUE LAGOON లాంటి అనేక సినిమాలు ఊర్వశి 70MM లో మిత్రబృందంతో కలిసి చూడటం ఒక మధురానుభూతి.నేను ఇంగ్లీష్ సినిమాలలో నేపధ్య సంగీతాన్ని ఇష్టంగా వినేవాణ్ణి. 
అయితే..మేనక థియేటర్ చాలా చిన్నది.అందుచేతనేనేమో..ఆ ఏసీ హాలులోపలికి అడుగుపెట్టగానే చలి వేసేది..మంచి సువాసన కూడా వచ్చేది.అక్కడ హాలీవుడ్ సినిమా చూస్తూ,అమెరికాలో ఉన్నట్టు ఫీలయ్యేవాళ్లం.ఆ రెండు హాల్స్ లోనూ సీట్ నెంబర్లు కూడా మాకు పరిచయమే.. 10 వ తరగతి 1976 స్కూల్ చదివేరోజుల్లో అక్కడ క్యాంటీన్ వాడు సమోసా,టీ కలిపి ఒక రూపాయి చేసినప్పుడు,ధరలు మండి పోతున్నాయని బాధపడ్డాం.ఆ ఇరానీ క్యాంటీన్ లో టీ చాలా రుచిగా ఉండటంతో తాగకుండా ఉండలేకపోయేవాళ్లం. కాలక్రమేణా ఊర్వశి,మేనకలకు రంభ తోడయింది.అది మరింత చిన్న హాలు.ఆ మూడు హాళ్లు చాలాకాలం వివిధ భాషాచిత్రాలతో ప్రేక్షకులను అలరించాయి.

ఈమధ్య  INOX యాజమాన్యం వాటిని తీసుకోవటంతో,ఆ మూడు థియేటర్ల రూపురేఖలు మారిపోయాయి.ఆధునిక మార్పులతో, వాటికి పూర్వపు కళ పోయిందనిపించింది.చిన్నప్పుడు అన్ని సినిమాలు చూసిన ఆ హాళ్లలో,ఆ తరువాత సినిమాలు చూడటం తగ్గించేశాను.కారణం.. ఒకప్పటి PARAMOUNT,COLUMBIA,20TH CENTURY FOX వంటి ప్రతిష్టాత్మక హాలీవుడ్ సినీనిర్మాణ సంస్థలు కనుమరుగయిపోవటం,త్రీడీ,తెలుగు డబ్బింగ్,గ్రాఫిక్స్ సినిమాలు పెరిగిపోవటం..అసలు ఎందుకో సినిమాల మీదే ఆసక్తి తగ్గిపోయింది.

నా సంగతి అలా ఉంటే,బెజవాడలో మాత్రం ఇప్పటికీ సినిమాలకు ఆదరణ తగ్గలేదు. కరోనా విలయం వల్ల మూతపడిన థియేటర్లు ఈమధ్యనే మళ్లీ తెరుచుకున్నాయి.జనం హాజరీ పెద్దగా లేకపొయినా,సినిమా హాళ్లు తెరిచే ఉంచుతున్నారు.ఊర్వశి పేరు ఇప్పుడు ఆ థియేటర్ కు లేకపోయినా,ఆ సెంటర్ ఇప్పటికీ ‘ఊర్వశి సెంటర్’గానే పిలువబడుతోంది. నా స్కూల్ రోజుల్లో ఒకసారి 3వ నెంబరు బస్సు ఎక్కితే,బస్సు ఊర్వశి సెంటర్లో  ఆగగానే..కండక్టర్ అలవాటుగా ‘ఆ..ఎవరమ్మా ఊర్వశి..మేనక..దిగాలి..’ అంటూ కేక పెట్టేవాడు. వెంటనే ఇద్దరు ముసలమ్మలు సీట్లనుంచి నిదానంగా లేచి,బస్సు దిగారు.అది ఎప్పుడు గుర్తు వచ్చినా నవ్వు ఆగదు. ఊర్వశి థియేటర్ల వ్యవస్థాపకులు కీ.శే.కామరాజు గారిని ఈ సందర్భంలో స్మరించుకొవాలి.ఊర్వశి ఐనాక్స్ కు స్వర్ణోత్సవ శుభాకాంక్షలు.

 

——————COURTESY… Unknown Writer 

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!